International Day of Older Persons: అమ్మానాన్నలకు ఏం చేస్తున్నాం?

International Day of Older Persons 2021: Digital Equity for All Ages - Sakshi

నేడు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

చెట్లు ఎదిగి నీడనిస్తాయి. ఎదిగి ఎదిగి ఫలాలూ పూలు ఎరగని స్థితికి వస్తాయి. అప్పుడు ఏం జరగాలి? అవి ఇచ్చిన విత్తనాలు నీడ అవ్వాలి. అవి ఇచ్చిన నీడ నీడ అవ్వాలి. అవి ఇచ్చిన గాలి ప్రాణవాయువు కావాలి. అమ్మానాన్నలు పిల్లలకు చాలా ఇస్తారు.
పిల్లలు? వారికి తోడునివ్వాలి. నీడనివ్వాలి. మాటనివ్వాలి. నవ్వునివ్వాలి. అంతకు మించి వేరే ఏం అక్కర్లేదు. అరిగిపోని కరిగిపోని ‘ప్రేమ’ను పంచడానికి కూడా ఎందుకు వారిని ముఖం వాచేలా చేస్తున్నాం.

ప్రతి సంవత్సరం ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం’ సందర్భంగా ఒక థీమ్‌ను ప్రతిపాదిస్తుంది ఐక్యరాజ్య సమితి. 2021కి కూడా నిర్ణయించింది. అది ‘డిజిటల్‌ ఈక్విటి ఫర్‌ ఆల్‌ ఏజెస్‌’. అంటే డిజిటల్‌ మాధ్యమాలను, పరికరాలను ఉపయోగించే, పొందే హక్కు అందరికీ సమానమే అని అర్థం. మరోమాటలో చెప్పాలంటే వయోవృద్ధులకు డిజిటల్‌ పరికరాలు, మాధ్యమాలను ఉపయోగించే... వాటిని పొందే వీలు కల్పించమని సూచన. ఇంట్లో అందరికీ ఫోన్లు ఉంటాయి. అమ్మమ్మకు ఉండదు.

ఇంట్లో అందరూ టీవీ చూస్తారు. కాని రిమోట్‌ను నానమ్మకు ఇవ్వరు. యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఓటిటిలలో ఎన్నో చూడదగ్గ విషయాలు ఉంటాయి. కాని అవి ఉన్నట్టు తాతయ్యకు అస్సలు తెలియదు. ‘నీకు అవన్నీ అర్థం కావులే తాతయ్య’ అని చెప్పేస్తాం. ఆ మాట చెప్పాల్సింది తాతయ్య కదా. ఇవి మాత్రమేనా? బిపి మిషిన్, గ్లూకోమీటర్, డిజిటల్‌ థర్మామీటర్‌ ఇవన్నీ పొందే హక్కు, ఉపయోగించే హక్కు ఇంటి వృద్ధులకు ఉంది.

వారు తాము కోరిన చోటుకు వెళ్లి రావడానికి వీలుగా క్యాబ్స్‌ బుక్‌ చేసుకునే యాప్స్‌ వారి ఫోన్‌లో ఉండాలి. రైలు, ఫ్లైట్, బస్‌ టికెట్లు బుక్‌ చేసుకునే పరిజ్ఞానం వారికి తెలియచేయాలి. వారికి కావల్సిన వస్తువులు అమేజాన్‌ నుంచో మరో ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌ నుంచో తెప్పించుకునే వీలు వారికి ఉండాలి. వీటిలో ఎన్ని ఇంట్లోని అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలకు ఏర్పాటు చేసి ఉన్నామో చెక్‌ చేసుకుంటే, ప్రతిదానికి వారు కొడుకూ కోడలి వైపో మనవల వైపో చూడాల్సి వచ్చేలా చేసి ఉంటే వారి పట్ల వివక్ష సాగించినట్టే అని చెబుతోంది  ఐక్యరాజ్యసమితి ఈ థీమ్‌తో.

ఎందుకు ఈరోజు?
గమనించండి మీ ఇంటి పెద్దవారిని అని చెప్పడానికి 1991 నుంచి ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం’ మొదలైంది. వారికి ఏం కావాలి.. వారు దేనికి బాధ పడుతున్నారు... వారికి ఆనందం కలిగించే విషయాలు ఏమిటి... వారి ఆరోగ్య సమస్యలు ఏమిటి... ఆర్థిక ఆందోళనలు ఏమిటి... ముచ్చట పడుతున్న కోరికలు ఏమిటి... ఇవన్నీ కనుక్కోవడానికి ప్రత్యేకం ఈ రోజన్నా పిల్లలు ప్రయత్నిస్తారని ఈరోజును ఏర్పాటు చేశారు. ప్రతి అక్టోబర్‌ 1న వృద్ధుల సంక్షేమాన్ని పట్టించుకోవడమే కాదు వారి పై ఏదైనా పీడన జరుగుతుంటే దానిని తొలగించాల్సిన, వారు వేదన అనుభవిస్తుంటే దానిని దూరం చేయాల్సిన బాధ్యతను కూడా ఈ రోజు గుర్తెరగాలి.

అమ్మా నాన్నలకు ఏం చేస్తున్నాం?
‘నీకేం కావాలి’ అని తండ్రి, ‘పిల్లలకు ఇది కావాలట చూడండి’ అని తల్లి.. పిల్లల అవసరాల కోసమే జీవిస్తారు. పిల్లల సంతోషం కోసం వారు చేసే త్యాగాలు... పిల్లలు నిద్రపోయాక వారి భవిష్యత్తు కోసం చేసే మంతనాలు, ఆర్థిక సమస్యలు పిల్లల దృష్టికి రాకుండా పడే తపనలు... ఇవన్నీ గుర్తుండాలి సంతానానికి. ఇంతా వారు చేసేది ఎందుకు? పిల్లలు ఏదో నిధి తెచ్చిస్తారని కాదు. వారికి నిధి ఎందుకు? వయసు మీద పడ్డాక నిధిని ఏం చేసుకుంటారు. వారికి కావాల్సింది పిల్లల ప్రేమ నిధి.

పిల్లల సమక్షంలో ఉండే నిధి. రోజూ వారిని కళ్లారా చూసుకునే నిధి. అది రకరకాల కారణాల వల్ల నేటి ఇంటి పెద్దలు పొందలేకపోతున్నారు. కొందరు బలవంతంగా పిల్లలకు దూరం చేయబడుతున్నారు. కొందరిని పిల్లలతో పాటు ఉండేందుకు అలమటించేలా చేస్తున్నారు. మన ఒడిలో పిల్లలు వచ్చిన వెంటనే మనల్ని ఒడిలో ఉంచి పెంచిన అమ్మానాన్నల పట్ల తెలియకనే అలక్ష్యం వచ్చేస్తోంది. ఇది వారికి బయటకు చెప్పని వేదన కలిగిస్తుందని ఎందుకు తెలుసుకోము. తెలుసుకున్నా తెలియనట్టు నటిస్తున్నాము.

కనపడండి... చిన్న కోరికలు తీర్చండి
చిన్నచిన్న కోరికలు ఉంటాయి తల్లిదండ్రులకు. ఫలానా ఊరు చూసి రావాలని, ఫలానా వస్తువు కొనుక్కోవాలని, ఫలానా కూర ఇష్టంగా వొండుకుని తినాలని, ఫలానా స్నేహితురాలిని కలవాలని... అంతెందుకు... ఉదయాన్నే లేచి వాకింగ్‌ చేయాలనుకునే తల్లికి కొత్త షూస్‌ తెచ్చిస్తే, పుట్టినరోజునాడు తండ్రికి మంచి ఫోన్‌ ప్రెజెంట్‌ చేస్తే, తల్లిదండ్రులఫొటోలన్నీ ఒక ఆల్బమ్‌గా చేసి ఇస్తే, పెరడులో వారికి ఇష్టమైన మొక్కను తెచ్చి నాటితే, మనవలతో హాయిగా గడిపేలా చేస్తే... అవన్నీ వారు గొప్పగా భావించే కానుకలే.  ‘మీకేం కావాలో అడగొచ్చు కదా’ అనే పిల్లలు ఉంటారు కాని సహజంగా తల్లిదండ్రులు అడగరు. ఎందుకులే పిల్లల ఆరాటాల్లో వారు ఉంటారు అని.  పిల్లలు పుడితే అమ్మానాన్నలను పిలుద్దాం అని నగరాల్లో, అమెరికాలో ఉన్న కొడుకులు, కూతుళ్లు అనుకోవడం ఆనవాయితీగాని పిల్లలు పుట్టేలోపు తల్లిదండ్రులను తీసుకొచ్చి అన్నీ తిప్పి చూపిద్దాం అనుకునేవారు ఎంతమంది?

ఇప్పుడు తల్లిగాని తండ్రిగాని కోరుకుంటున్న కోరిక నెలలో ఒకసారైనా పిల్లలు కనిపిస్తే బాగుండు అనేది. ఒకే ఊళ్లో ఉన్నా ఒకే రాష్ట్రంలో ఉన్నా ఒకే దేశంలో ఉన్నా పిల్లలు ఒకచోట తల్లిదండ్రులు ఒకచోట బతకాల్సిన పరిస్థితిని మన ‘నాగరికత’ తెచ్చి పెట్టింది. కాని రెగ్యులర్‌గా వెళ్లి తల్లిదండ్రులను చూడవద్దు అని ఏ నాగరికతా చెప్పదు. ‘అమ్మకో నాన్నకో బాగలేదు’ అని ఫోన్‌ వస్తే తప్ప కదలని సంతానం మీరైతే ఇవాళ మీరు తప్పనిసరిగా మీ ఆత్మశోధన చేసుకోవాలి. తల్లిదండ్రుల సంతోషానికి నిజంగా ప్రయత్నిస్తున్నారా చెక్‌ చేసుకోవాలి. వారి కోసం కచ్చితంగా మీరు ఇవాళ సంకల్పం తీసుకోవాలి. తీసుకోండి ప్లీజ్‌.
 
‘నీకేం కావాలి’ అని తండ్రి, ‘పిల్లలకు ఇది కావాలట చూడండి’ అని తల్లి.. పిల్లల అవసరాల కోసమే జీవిస్తారు. పిల్లల సంతోషం కోసం వారు చేసే త్యాగాలు... పిల్లలు నిద్రపోయాక వారి భవిష్యత్తు కోసం చేసే మంతనాలు, ఆర్థిక సమస్యలు పిల్లల దృష్టికి రాకుండా పడే తపనలు... ఇవన్నీ గుర్తుండాలి సంతానానికి.

చదవండి: సెల్ఫీ అడిక్షన్‌ పెరుగుతోందా.. ఈ ఏడు జాగ్రత్తలు అవసరం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top