ఈ ప్రముఖుల గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు

Interesting Facts About Celebrities - Sakshi

అమీషాకు పింక్‌ పిచ్చి...
నటి అమీషా పటేల్‌కు పింక్‌ కలర్‌ అంటే పిచ్చి. ఆమె డ్రెస్‌లు, చీరలు, ఇతరత్రా అలంకరణ వస్తువులతో పాటు దాదాపుగా ప్రతి వస్తువు పింక్‌ కలర్‌లో ఉండేలా చూసుకుంటుంది. బద్రీ భామ ఇంట్లో ఆఖరికి గోడలు, తలుపులు, ఫర్నిచర్‌ కూడా పింక్‌ మయమేనట. 

ముఖ్యమంత్రి కాక ముందు బొటిక్‌ ఓనర్‌..
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి.. (దివంగత) బిజు పట్నాయక్‌ రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు బొటిక్‌ నిర్వహించేవారు.. ‘సైక్‌డెల్హి’ పేరుతో. ఇది నిజం. న్యూఢిల్లీలోని ఓబెరాయ్‌ హోటల్‌లో ఉండేది అది. 

కాళీ కాదు చిత్రకారిణి..
కలకత్తా కాళీలా గర్జించే మమతా బెనర్జీ చిత్రకళలో మేటి తెలుసా! ఆమె చిత్రాలు ఎక్కువగా మహిళలకు సంబంధించే ఉంటాయి. అందులో కొన్ని చిత్రకళా ప్రదర్శనల్లో అమ్ముడు పోయి అధిక మొత్తంలో కాసులనూ సంపాదించి పెట్టాయి ఆమెకు. 

ప్రపంచంలో ఒకే ఒక్కడు మన మన్‌మోహనుడు..
ఆర్థిక సంస్కరణలను అద్భుతంగా అమలు చేసిన ఆర్థికవేత్తగా.. ప్రధానమంత్రిగా మన్‌మోహన్‌ సింగ్‌ జగద్విదితం. ఆయనకు ఇంకో రికార్డ్‌  కూడా ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయనంత చదువుకున్న.. క్వాలిఫైడ్‌ ప్రధాని మరొకరు లేరుట. 

చాంపియన్‌ ప్రెసిడెంట్‌..
మన తొలి మహిళా ప్రెసిడెంట్‌ ప్రతిభా పాటిల్‌ ఎరుకే కదా! కానీ ఆమె టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ అని తెలుసుండదు. అవును కాలేజీ రోజుల్లో ఆమె టీటీ చాంపియన్‌. 

మరీ ఇంత బిజీనా..?
సుప్రసిద్ధ రచయిత హరుకి మురకామి డైలీ షెడ్యూల్‌ ఎంత బిజీగా ఉంటుందో ఓ ఇంటర్వ్యూలో ఆయన.. ‘నేను ఉదయం నాలుగింటికల్లా నిద్రలేస్తాను. లేవగానే రాయడం మీద కూర్చుంటాను అయిదు నుంచి ఆరుగంటల పాటు. మధ్యాహ్నం దాదాపు పది కిలోమీటర్లు నడవడమో.. లేక పదిహేను వందల మీటర్లు స్విమ్‌ చేయడమో లేదంటే రెండూ ఉంటాయి. ఆ తర్వాత కాసేపు నచ్చిన పుస్తకం చదవడమో.. మ్యూజిక్‌ వినడమో చేస్తాను. రాత్రి తొమ్మిదింటికల్లా నిద్రకుపక్రమిస్తాను. ఏమాత్రం తేడా లేకుండా. .రాకుండా రోజూ ఇదే షెడ్యూల్‌ కొనసాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. నోట్‌ చేసుకుంటున్న రిపోర్టర్‌ చివరి వాక్యం రాసి ఊపిరి పీల్చుకుంటూ నిట్టూర్చాడట. 

ఆయుష్మాన్‌ ఖురానా@దంతావధాని 
బాలీవుడ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ ఆయుష్మాన్‌ ఖురానా.. దంతాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. ఎంతంటే ఆ శ్రద్ధ ఓ అబ్సేషన్‌ అయ్యేంతగా. సాధారణంగా ఉదయం, రాత్రి రెండు సార్లు బ్రష్‌ చేసుకుంటాం. కానీ ఆయుష్మాన్‌.. తరచుగా అంటే రోజులో వీలైనన్ని సార్లు బ్రష్‌ చేసుకుంటూంటాడట. అందుకే నిత్యం తన వెంట డెంటల్‌ కేర్‌ కిట్‌ను క్యారీ చేస్తూంటాడట! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top