
మన మెదడులో ఎంత శాతం మనం ఉపయోగించుకుంటున్నాం? అంటే మీ సమాధానమేంటి? ఐదు లేదా పది శాతం అనేగా! ఇదే ప్రశ్నను మీ మిత్రులను అడిగి చూడండి. ‘ఐదు లేదా పది శాతం, కచ్చితంగా పదిశాతంకన్నా తక్కువే..’ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మీరే కాదు, కొందరు సైకాలజీ విద్యార్థులు, న్యూరోసైంటిస్టులు కూడా ఒక సర్వేలో అదే సమాధానం చెప్పారు. కొందరు అంతర్జాతీయస్థాయిలో పేరున్న ప్రముఖులు కూడా తమ పుస్తకాల్లో కూడా పది శాతమనే రాశారు. కానీ అది అవాస్తవం, అపోహ మాత్రమే.
అపోహ ఎలా మొదలైంది?
1890వ దశకంలో హార్వర్డ్ సైకాలజిస్ట్ విలియం జేమ్స్, బోరిస్ సిడిస్ ఇద్దరూ కలసి పిల్లల పెంపకంపై ప్రయోగాలు చేశారు. విలియం సిడిస్ అనే బాల మేధావిని తయారుచేశారు. ఆ సందర్భంగా విలియం జేమ్స్ మాట్లాడుతూ ‘మనిషి తన మేధాసామర్థ్యం (mind potentiality)లో కొద్ది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు’ అని చెప్పారు.
ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు డేల్ కార్నీ 1936లో రాసిన "How to win friends, influence people"కు అమెరికన్ రచయిత Lowell Thomas ముందుమాట రాశాడు. అందులో ‘మనిషి తన మేధాశక్తి (mind power)లో 10శాతాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకోగలడు’ అని చెప్పాడు. అంటే సామర్థ్యం కాస్తా శక్తిగా మారింది. ఆ తర్వాత 1970లో సైకాలజిస్ట్, విద్యావేత్త Georgi Lozanov తన suggestopedia ని ప్రతిపాదిస్తూ ‘మనం మన మేధాశక్తిలో ఐదు నుంచి పది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత అనేకమంది తమ పుస్తకాల్లో ఉపన్యాసాల్లో ‘మెదడులో పదిశాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని రాశారు, చెప్పారు.
తేడా గమనించండి..
మేధాసామర్థ్యంలో పదిశాతం ఉపయోగించుకోవడానికి, మెదడులో పదిశాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అనడానికి.. చాలా తేడా ఉంది. మేధో సామర్థ్యంలో పదిశాతాన్ని ఉపయోగించుకుంటున్నారంటే.. మనిషి తన మేధస్సుతో తాను సాధించగలిగిన దానిలో పదిశాతాన్ని మాత్రమే సాధించగలుగుతున్నాడని అర్థం. అంటే తన మేధస్సును మరింతగా ఉపయోగించుకుంటే మరింత ప్రగతిని సాధించగలడనే కదా. మన మెదడు అన్ని సందర్భాల్లోనూ నూటికి నూరుశాతం పనిచేస్తుంది. ఏ భాగమైనా పనిచేయకపోతే, దానికి సంబంధించిన శరీరభాగం చచ్చుబడి పోతుంది. దాన్నే పక్షవాతం అంటారు.
అపోహల నుంచి బయటపడండి..
మీరు చదివింది లేదా మీకు తెలిసింది మాత్రమే నిజమనే నమ్మకం నుంచి బయటపడాలి. గొప్పవారు చెప్పారు కాబట్టి నమ్మాలి, దాన్ని ప్రశ్నించకూడదనే వైఖరి నుంచి బయటకు రావాలి. ఎవరో చెప్పినదాన్ని గుడ్డిగా అంగీకరించవద్దు, అనుసరించవద్దు. ఇలాంటి భ్రమలు, అపోహలు, అసత్యాలు మన చుట్టూ చాలా.. చాలా.. ఉన్నాయి. అవే అపర సత్యాలుగా చలామణీ అవుతున్నాయి. చలామణీ చేస్తున్నారు. అధిక సంఖ్యాకులు అంగీకరించినంత మాత్రాన, అనుసరించినంత మాత్రాన అసత్యం సత్యం కాబోదు. ఎవరో చెప్పారనో, ఎక్కడో రాశారనో దేన్నీ గుడ్డిగా నమ్మవద్దు. కాస్త సమయం వెచ్చించి పరిశీలించాలి, పరీక్షించాలి, ప్రశ్నించాలి. నిజానిజాలేమిటో తెలుసుకోవాలి. మీ మేధా సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.
తప్పు అభిప్రాయానికి ఎందుకొస్తారు?
- తాము చదివిన పుస్తకాల్లో అలా రాసి ఉండి ఉంటుంది..
- ప్రఖ్యాత వ్యక్తులు తమ ఉపన్యాసాల్లో అలా చెప్పి ఉంటారు..
- ప్రశ్నలకు సులువుగా సమాధానాలు తెలుసుకోవాలనే కోరిక..
- తమకు నచ్చిన సమాధానాలనే ఎంచుకోవడం, గుర్తుంచుకోవడం..
- తప్పు సమాచారం మాత్రమే అందుబాటులో ఉండటం..
- మీడియా, సినిమాల ద్వారా అందిన సమాచారం..
ఇలా రకరకాల మార్గాల ద్వారా అందిన సమాచారాన్ని, వివిధ కారణాలతో ఏ మాత్రం ప్రశ్నించకుండా, పరీక్షించకుండా అంగీకరించడంతో వివిధ అంశాలపై అపోహలు, తప్పు అభిప్రాయాలు ఏర్పడతాయి.
జ్ఞానమెలా వస్తుందంటే..
మనమందరం మనకు అందుబాటులో ఉన్న, లేదా మనం చదివిన పుస్తకాల ఆధారంగా అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం. ఒకసారి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాక దాన్ని ఏ మాత్రం పరీక్షించం, అదే సత్యమని విశ్వసిస్తాం. ఆ తర్వాత మనం ఎవరితో మాట్లాడినా అదే విషయాన్ని చెప్తాం. మన విలువలు, విశ్వాసాలు, వైఖరులు, ప్రవర్తనలన్నీ ఇలా ఏర్పడినవే. మన జ్ఞానమంతా ఇలా వచ్చిందే. మనం జ్ఞానం అనుకుంటున్న జ్ఞానం మనకు ఎలా వచ్చిందనే విషయాన్ని వివరించే శాస్త్రాన్నే Epistemology (జ్ఞానమీమాంస) అంటారు.
సైకాలజిస్ట్ విశేష్
psy.vishesh@gmail.com
ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!?