ఇంట్లోనే రెస్టారెంట్‌ స్టైల్‌ ఫ్రైడ్‌ చికెన్‌: ఓ లుక్కేయండి మరి!

How To Make Restaurant Style Fried Chicken At Home - Sakshi

వివిధ రెస్టారెంట్లలో దొరికే ఫ్రైడ్‌ చికెన్‌ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే ఫ్రైడ్‌ చికెన్‌ను ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చదవండి!

కావాల్సిన పదార్థాలు
చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌: ఆరు, కోడిగుడ్డు: ఒకటి, ఉప్పు: రుచికి సరిపడా, తెల్ల మిరియాల పొడి: రెండు స్పూన్లు, మైదా: ఒక కప్పు, కారం: ఒక స్పూను, అల్లం తురుము: ఒక స్పూను, వెల్లుల్లి తురుము: ఒక స్పూను, ఉల్లిపాయ పేస్టు ఒక స్పూను, వాము పొడి: ఒక స్పూను, బరకగా దంచిన ఎండు మిరపకాయల పొడి: ఒక స్పూను, తులసి ఆకుల పొడి: ఒక స్పూను, బ్రెడ్‌ స్లైసులు: మూడు, ఆయిల్‌: డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ
ముందుగా చికెన్‌ డ్రమ్‌స్టిక్‌ పీసులను ఒక గిన్నెలో తీసుకుని కొద్దిగా ఉప్పు, అరస్పూను మిరియాల పొడి వేసి డ్రమ్‌స్టిక్స్‌కు పట్టించి, మారినేట్‌ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో గుడ్డు పగుల కొట్టి సొన వేసి బాగా కలపాలి. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి మరింత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరోక గిన్నె తీసుకుని.. మైదా, ఉప్పు, కారం, అల్లం, వెల్లులి, ఉల్లిపాయ, వాము పొడి, బరకగా దంచిన ఎండు మిరపకాయల పొడి, ఒకటిన్నర స్పూను తెల్లమిరియాల పొడి, తులసి ఆకుల పొడిని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

బ్రెడ్‌ స్లైస్‌లు మూడు తీసుకుని వాటి చుట్టూ ఉన్న అంచును కట్‌ చేయాలి. తరువాత మధ్యలో తెల్లని స్లైస్‌ను కాస్త బరకగా ఉండేలా పొడి చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌ వెలిగించి డీప్‌ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ వేసి కాగనివ్వాలి. మరోపక్క మారినేట్‌ చేసుకున్న చికెన్‌ పీస్‌ తీసుకుని, ముందుగా మసాలాలన్ని కలిపి పెట్టుకున్న పొడిలో ముంచాలి, తరువాత గుడ్డు సొన మిశ్రమంలో ముంచాలి. చివరిగా బ్రెడ్‌స్లైస్‌ పొడిలో ముంచాలి. ఇలా ముక్కకు ఈ మూడు రకాల మిశ్రమాలను కోటింగ్‌లా  పట్టిన తరువాత మరుగుతున్న ఆయిల్‌లో వేసి సన్నని మంటమీద డీప్‌ ఫ్రై చేసుకోవాలి. పీస్‌లు బాగా ఉడికి క్రిస్పీగా వేగితే రెస్టారెంట్‌ స్టైల్‌ చికెన్‌ ఫ్రై రెడీ అయినట్లే. కాస్త వేడిగా ఉన్నప్పుడు ఈ ఫ్రై తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. చూశారా ఫ్రైడ్‌ చికెన్‌ తయారు చేయడం ఎంత సులభమో, ఇంకెందుకాలస్యం... వెంటనే మీరుకూడా ట్రై చేసి రుచిచూడండి. 

గమనిక: ఉప్పు మూడుసార్లు వేసేటప్పుడు ఎంతెంత వేస్తున్నామో గమనించి రుచికి సరిపడా వేసుకోవాలి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top