ఆధునిక వ్యవసాయానికి ఆయువుప‌ట్టు! | how fertilizers useful to present farming in India Sagubadi explainer | Sakshi
Sakshi News home page

ఆధునిక వ్యవసాయానికి మూలస్తంభం!

Mar 27 2026 2:36 PM | Updated on Mar 27 2026 3:06 PM

how fertilizers useful to present farming in India Sagubadi explainer

మానవాళి ప్రపంచవ్యాప్తంగా కనీసం పది వేల ఏళ్ల నుంచి వ్యవసాయం ద్వారా ఆహారాన్ని సమకూర్చుకుంటున్నది. వందేళ్ల క్రితం నుంచి రసాయనిక ఎరువుల వాడకం ప్రారంభమై, క్రమంగా ప్రపంచవ్యాప్తమైంది. అయితే, ఈ ఎరువుల ఉత్పత్తి అన్ని ఖండాల్లో, అన్ని దేశాల్లో అవసరాలకు తగినంత జరగటం లేదు. అందువల్ల ఎరువుల వాణిజ్యం కీలకంగా మారింది.  

ఆధునిక వ్యవసాయానికి రసాయనిక ఎరువు మూలస్తంభం. ప్రపంచ మానవాళికి ఆహారం అందించడానికి ఈ ఎరువులు అత్యవసరం. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది (సుమారు 350–400 కోట్ల మంది) హేబర్‌–బోష్‌ ప్రక్రియ ద్వారా సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసే నత్రజని ఎరువులపై ఆధారపడుతున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్‌ ఫర్టిలైజర్‌ అసోసియేషన్‌(ఐఎఫ్‌ఏ) చెబుతోంది.

ఈ ఎరువులను సమకూర్చటంలో అంతర్జాతీయ వాణిజ్యం పాత్ర కీలకంగా ఉంది. ఎరువుల సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు, దాని పర్యవసానాలు నేరుగా రైతుల పొలాలపై, అంతిమంగా ప్రపంచ ఆహార లభ్యతపై ప్రభావం చూపుతాయి. రసాయనిక ఎరువుల వ్యాపారం వల్ల వ్యవసాయం, ఆహార వ్యవస్థలు ప్రభావితమయ్యే తీరు ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాలను బట్టి గణనీయంగా మారుతుంది. దేశీయ సహజ వాయువు నిల్వలు లేదా ఎరువుల ఉత్పత్తికి సంబంధించిన మౌలిక సదుపాయాల కొరత వంటి అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.  

ఏయే దేశాల్లో ఎంత?
భారతదేశంలో 37.9 కోట్ల మంది ప్రజలకు అవసరమయ్యే ఆహారోత్పత్తికి దిగుమతి చేసుకున్న నత్రజని తదితర రసాయనిక ఎరువులు లేదా దిగుమతి చేసుకున్న గ్యాస్‌ నుంచి తయారైన ఎరువులను వాడుతున్నారని ఒక అంచనా. బ్రెజిల్‌లో వీరి సంఖ్య 18.5 కోట్ల మంది ఇలాగే ఆధారపడి ఉన్నారు. చైనా ప్రధాన ఎరువుల ఉత్పత్తిదారు అయినప్పటికీ, ఇది దిగుమతి చేసుకున్న సహజ వాయువు నుండి ఉత్పత్తి చేసిన ఎరువులను ఉపయోగించి 15.1 కోట్ల మందికి ఆహారం అందిస్తున్నట్లు సమాచారం.

ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో మధ్య‌ప్రాచ్యం కీలక పాత్ర పోషిస్తుంది. 2024లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌ కలిసి ప్రపంచ అమ్మోనియా వాణిజ్యంలో 23%, ప్రపంచ యూరియా వాణిజ్యంలో 34%, ప్రపంచ అమ్మోనియేటెడ్‌ ఫాస్ఫేట్‌ వాణిజ్యంలో 18% వాటాను కలిగి ఉన్నాయి. ప్రధాన ఎరువుల ఎగుమతిలో మధ్య‌ప్రాచ్య దేశాలు దాదాపు 30% సరఫరా చేశాయి.

దిగుమతులు కీలకం
అయితే, ప్రపంచ దేశాలు తమ దేశాల్లో సొంత వనరులతో తయారు చేసుకునే రసాయనిక ఎరువులు సగం మేరకు ఉంటాయి. మిగతా సగం(52%) ఎరువుల కోసం విదేశాలపైనే దేశాలు ఆధారపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మంది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎరువులతో లేదా దిగుమతి చేసుకునే సహజ వాయువుతో దేశీయంగా తయారు చేసుకునే ఎరువులతో పండించిన పంటల ఆహారంపై ఆధారపడుతున్నారు. ప్రపంచ జనాభాలో వీరు సుమారు 23% మేరకు ఉంటారని అంచనా.

దిగుమతి చేసుకున్న నత్రజని తదితర రసాయనిక ఎరువులతో పండించిన ఆహారంపై సుమారు 107 కోట్ల నుండి 120 కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రాథమిక ముడిపదార్థంగా దిగుమతి చేసుకున్న సహజ వాయువును ఉపయోగించి దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువుల ద్వారా అదనంగా 71 కోట్ల మంది ప్రజలకు ఆహారం అందుతోందని అంచనా.

ఎన్‌పీకే ఎరువుల వినియోగ నిష్పత్తి ఎంత?
మన దేశంలో రసాయనిక (నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం– ఎన్‌పీకే) ఎరువుల వినియోగ నిష్పత్తి అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న పార్లమెంటులో ప్రకటించిన గణాంకాల ప్రకారం రాష్ట్రాల్లో ఎన్‌పీకే ఎరువుల వినియోగ నిష్పత్తి ఎలా ఉందో చూద్దాం. రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ ఎస్‌. పటేల్‌ రాజ్యసభలో ఎరువుల సమతుల్య వినియోగం, సుస్థిర వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) ప్రకారం.. పంట రకం, నేల ఆరోగ్యం, వ్యవసాయ–వాతావరణ పరిస్థితులను బట్టి పోషకాల అవసరాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా మారుతూ ఉంటాయి. కాబట్టి, దేశవ్యాప్తంగా వర్తించే ఒకే ఒక్క ‘ఆదర్శవంతమైన’ ఎన్‌పీకే ఎరువుల వినియోగ నిష్పత్తిని నిర్దేశించలేమని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విస్తృతమైన క్షేత్ర ప్రయోగాలు, సమన్వయ పరిశోధనలను నిర్వహించి రసాయన, సేంద్రియ వనరులను రెండింటినీ కలిపి, వివిధ పంటలకు ఎరువుల మోతాదులను ఐసీఏఆర్‌ నిర్థారించింది. ఎన్‌పీకే ఎరువులను 4:2:1 నిష్పత్తిలో వాడమని సూచించింది. అయితే, దేశవ్యాప్తంగా యూరియా ఎక్కువగా వాడుతున్నారు. నేల ఆరోగ్యాన్ని,  ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఎరువులను సమతుల్యంగా వాడటం అవసరం.

నేల పరీక్ష ఆధారిత సమతుల్య, సమీకృత పోషక నిర్వహణ చేపట్టాలని ఐసీఏఆర్‌ చెబుతోంది. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట పంటలు, పంట అవశేషాల పునర్వినియోగం వంటి సేంద్రియ వనరులతో రసాయనిక ఎరువులను కలిపి ఉపయోగించాలని సిఫారసు చేస్తోంది. సరైన పరిమాణం, సరైన సమయం, సరైన పద్ధతి, సరైన రకం ఎరువులను వివేకవంతంగా ఉపయోగించటం, రసాయనిక ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తోంది. ఈ అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు.

హోర్ముజ్‌ జలసంధి కీలకం
నత్రజని ఎరువు అయిన యూరియా.. అంతర్జాతీయంగా అత్యంత విస్తృతంగా అమ్మకాలు కొనుగోళ్లు జరిగేది ఈ ఎరువుకు సంబంధించే. మధ్య‌ప్రాచ్యంలో ఇటీవలి సంఘర్షణలు హోర్ముజ్‌ జలసంధిలో రాకపోకలకు అంతరాయం కలగటంతో ముఖ్యంగా నత్రజని ఎరువుల క్రయవిక్రయాలు ప్రభావితమయ్యాయి.

2024లో, హోర్ముజ్‌ జలసంధి ద్వారా దాదాపు 18.5 మిలియన్‌ టన్నుల యూరియా ఎగుమతి జరిగింది. ఈ మార్గంలో రవాణాకు ఏవైనా దీర్ఘకాలిక అంతరాయాలు ఏర్పడితే, దాని ప్రభావం ప్రపంచ ఎరువుల మార్కెట్లపై చప్పున కనిపిస్తుంది.

నత్రజని ఎరువులను అమ్మోనియా నుంచి ఉత్పత్తి చేస్తారు. ఇది హైడ్రోజన్‌ ఫీడ్‌స్టాక్‌గా, ఇంధన వనరుగా సహజ వాయువుపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ఇంధన ధరల్లోని అస్థిరత ఎరువుల ఉత్పత్తి ఖర్చులను నేరుగా ప్రభావితం చేస్తుంది.

ఫాస్ఫేట్‌ సరఫరా గొలుసులు కూడా ఈ హోర్ముజ్‌ జలసంధితో ముడిపడి ఉన్నాయి. అమ్మోనియేటెడ్‌ ఫాస్ఫేట్ల ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 18% హోర్ముజ్‌ ద్వారా జరుగుతుంది. అదే సమయంలో ప్రపంచ సల్ఫర్‌ వాణిజ్యంలో దాదాపు సగం ఇదే మార్గం గుండా వెళుతుంది. ఫాస్ఫేట్‌ ఎరువుల ఉత్పత్తిలో సల్ఫర్‌ ఒక కీలకమైన ముడి పదార్థం. అంటే, సరఫరాలో అంతరాయాలు ఫాస్ఫేట్‌ ఎరువుల విలువ గొలుసును ప్రభావితం చేయగలవు.

ఇంధనం, ఎరువుల వాణిజ్య మార్గాలకు అంతరాయాలు కొనసాగితే, దిగుమతి చేసుకున్న ఎరువులపై ఆధారపడిన దేశాలలో దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. సహారా ఉప–్ర  ప్రాంత ఆఫ్రికా, దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలలో ఉన్న చిన్న రైతులు ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే ఎరువుల లభ్యత, అందుబాటు ధరలు పంట దిగుబడులను, ఆహార ఉత్పత్తిని నేరుగా ప్రభావితం చేస్తాయి.

చ‌ద‌వండి: సేంద్రియ ఆహార మార్కెట్ల‌కు చోటివ్వండి

ఈ కారణాల వల్ల, ఎరువుల సరఫరా గొలుసులను సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకోవటం అత్యవసరం. ఎరువులు సకాలంలో అందితేనే రైతులు పంట దిగుబడులు  పొందగలుగుతారు. ప్రపంచ ఆహార భద్రతకు, స్థిరత్వానికి తద్వారా భరోసా ఉంటుంది. భౌగోళిక–రాజకీయ సంక్షోభాలను తట్టుకునే శక్తి చేకూరుతుంది.

తీవ్రమైన అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో, విధాన రూపకర్తలు ఎరువులను ప్రపంచ ఆహార వ్యవస్థలలో ఒక వ్యూహాత్మక భాగంగా గుర్తించి, కీలకమైన వ్యవసాయ సరఫరా గొలుసులు సజావుగా పనిచేసేలా కృషి చెయ్యటం చాలా ముఖ్యం. ఎరువులు ప్రధాన సముద్ర మార్గాల ద్వారా నమ్మకంగా రవాణా అయ్యేలా చూడటం, రైతులకు తోడ్పడటానికి, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను కాపాడటానికి అత్యవసరం.

– నిర్వహణ: 
పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement