దీపాల పండగ వేళ.. కాంతులు పంచే తీరొక్క దివ్వెలు!

Home Creations Diwali Special Decoration  - Sakshi

దీపాల పండగ అనగానే మనకు మట్టి ప్రమిదలే గుర్తుకువస్తాయి. కానీ, ఇప్పుడీ దివ్వెల అలంకరణలో ఎన్నో అందమైన సృజనాత్మక రూపాలు బంగారు కాంతులను విరజిమ్ముతున్నాయి. ఆ కాంతుల వెలుగుల్లో ఆనందాల దీపావళి మరింత అలంకారంగా, రంగుల హరివిల్లుగా మన కళ్లను కట్టిపడేస్తుంది. 

ప్రమిదలకు ఆభరణాల సొగసును అద్ది, కాంతిని గ్లాసుల్లో నింపి, కుండల్లో మెరిపించి, ఆరోగ్యాన్ని పంచి, రంగులను వెదజల్లేలా ఈ దీపావళిని ఓ అందమైన కథలా మరింత అర్థవంతంగా జరుపుకోవచ్చు. 

ఆభరణాల వెలుగు: మట్టి ప్రమిదలకు న చ్చిన పెయింట్‌ వేసి, వాటికి పూసల హారాలను గమ్‌తో అతికించి జిలుగు పూల కాంతులను పూయించవచ్చు. కొన్నేళ్లుగా వస్తున్న ఈ ప్రమిదల అలంకరణ ప్రతి యేటా కొత్తదనాన్ని నింపుతూనే ఉంది. అలంకరణలో ఎన్నో ప్రయోగాలు చేయిస్తోంది. మగ్గం వర్క్‌లో ఉపయోగించే మెటీరియల్‌తో ప్రమిదలను అందంగా అలంకరించవచ్చు. 

గ్లాస్‌లో కాంతి: ప్లెయిన్‌గానూ, క్లాస్‌గాను ఉండే గ్లాస్‌ కాంతి ఇంటికి, కంటికి కొత్త వెలుతురును తీసుకువస్తుంది. కొన్ని గులాబీ పూల రేకులను ప్లేట్‌లో పరిచి, గ్లాస్‌లో క్యాండిల్‌ అమర్చి వెలిగిస్తే చాలు కార్నర్‌ ప్లేస్‌లు, టేబుల్, టీపాయ్‌పైన ఈ తరహా అలంకరణ చూపులను ఇట్టే ఆకర్షిస్తుంది. పండగల కళను రెట్టింపు చేస్తుంది. 

చిట్టి కుండల గట్టి కాంతి: కుండల దొంతర్లు దీపావళి పండగ వేళ ఐశ్వర్యానికి ప్రతీకగా ఉపయోగిస్తారు. ఎక్కువ సేపు దీపాలు వెలగడానికి, డెకొరేటివ్‌ పాట్‌ క్యాండిల్స్‌ను ఉపయోగించవచ్చు. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు అనుకునేవారు చిట్టి చిట్టి కుండలు కొనుగోలు చేసి, నచ్చిన అలంకారం చేసుకొని, వాటిలో మైనం నింపి దీపం వత్తితో వెలిగించుకోవచ్చు. లేదంటే కుండల మీద ప్రమిదలు పెట్టి, మరొక అలంకారం చేయచ్చు. 

ఆరోగ్యకాంతి: ఇది గ్లాస్‌ అలంకారమే. పానీయాలు సేవించే గాజు గ్లాస్‌లో నిమ్మ, ఆరెంజ్‌ తొనలు, పుదీనా ఆకులు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క ముక్కలు వేసి, ఆపైన సగానికి పైగా నీళ్లు పోసి, ఫ్లోటెడ్‌ క్యాండిల్‌ను వేసి వెలిగించవచ్చు. ఈ కాంతి చుట్టూ కొన్ని పరిమళలాను వెదజల్లుతుంది. హెర్బల్స్‌ నుంచి వచ్చే ఆ సువాసన ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. 

ఇంద్రధనస్సు కాంతి: ఎరుపు, పసుపు, నీలం .. ఇంద్రధనుస్సు కాంతులు ఇంట్లో వెదజల్లాలంటే రంగురంగుల గాజు గ్లాసులను తీసుకోండి. వాటిల్లో ఫ్లోటెడ్‌ క్యాండిల్స్‌ అమర్చి, వెలిగించండి. చీకటి వేల వేళ రంగులు పూయిస్తాయి ఈ కాంతులు. 

కథ చెప్పే కాంతి: దీపావళి వేళ తోరణాలుగా ఎలక్ట్రిక్‌ దీపాలను చాలా మంది ఉపయోగిస్తుంటారు. వాటిని చాలా మంది గుమ్మాలకు వేలాడదీస్తుంటారు. దీనినే కొంచెం సృజనాత్మకంగా ఆలోచిస్తే ఓ కొత్త దీపాల వెలుగులను ఇంటికి తీసుకురావచ్చు. ఒక గాజు ఫ్లవర్‌వేజ్‌ లేదా వెడల్పాటి గాజు పాత్ర తీసుకొని అడుగున పచ్చ రంగు అద్దిన స్పాంజ్‌ ముక్కలను పరిచి, ఆ పైన ఎలక్ట్రిక్‌ బల్పులు గొలుసు, మధ్యన పూల కాంబినేషన్‌తో ఓ అందమైన లోకాన్ని నట్టింట్లో సృష్టించిన అనుభూతిని పొందవచ్చు.   

చదవండి: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top