Legs Swelling Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే...

Health Tips In Telugu: How To Get Rid Of Edema Leg Swelling - Sakshi

పాదాల వాపు ప్రమాద సంకేతమే..! కానక్కరలేదు..

పాదాల వాపు ఇంచుమించు అందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బంది పెట్టే సమస్యే. సాధారణంగా ఇది గర్భధారణ సమయంలో స్త్రీలకు వస్తుంది. లేదంటే ఎక్కువసేపు ప్రయాణం చేసినప్పుడు వస్తుంది. అలా కాకుండా అకారణంగా ఈ సమస్య వేధిస్తుంటే మాత్రం దీనిని అంత తేలిగ్గా తీసిపారేయడానికి వీలు లేదు. గుండె, కిడ్నీల పనితీరు సరిగా లేకున్నా, రక్తపోటులో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నా ఇలా పాదాల వాపు రూపంలో శరీరం మనకు హెచ్చరికలు జారీ చేస్తుంది.

అందువల్ల ముందు గుండెకు, కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుని అవి సరిగానే పని చేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత కొన్ని చిన్న చిట్కాలను అనుసరించడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. పాదాలు వాచాయంటే శరీరంలో లవణాలు అధికంగా చేరాయని సూచన. శరీరంలో ఉన్న లవణాలను పలుచన చేసేందుకు నీటిని ఎక్కుగా తాగాలి.

ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. దీంతో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఒక గ్లాస్‌ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. కీర దోస జ్యూస్‌ను కూడా తాగవచ్చు. దీని వల్ల పాదాల వాపులు తగ్గుతాయి. పాదాల్లో అధికంగా ఉండే ద్రవాలు బయటకు పోతాయి.

పుచ్చకాయల్లో అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయల్లో 92 శాతం నీరు ఉంటుంది. అందువల్ల మూత్రం బాగా వస్తుంది. దీంతో శరీరంలో ఉండే అధిక ద్రవాలతోపాటు వ్యర్థాలు బయటకు పోతాయి. పాదాల వాపులు తగ్గుతాయి.

ధనియాల్లో యాంటీ ఇన్‌ఫ్ల్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే పాదాల వాపులను తగ్గించుకోవచ్చు. 2 లేదా 3 టీస్పూన్ల ధనియాల విత్తనాలను ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. నీరు సగం కప్పు అయ్యే వరకు మరిగించాక ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే ఎడిమా అంటే పాదాల వాపు సమస్య నుంచి బయట పడవచ్చు.

నువ్వుల నూనెతో రోజూ పాదాలను 5–10 నిమిషాల పాటు మర్దనా చేయాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కాపడం పెట్టాలి. ఇలా రోజూ చేస్తే పాదాలలో రక్త సరఫరా పెరుగుతుంది. వాపులు తగ్గుతాయి. అలాగే నిద్రించేటప్పుడు పాదాలను ఎత్తులో పెట్టుకుని నిద్రించాలి. అందుకు గాను దిండును ఉపయోగించాలి. పాదాలు గుండె కన్నా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

ఇక ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. ఉప్పును తగ్గించాలి. ఎక్కువ సేపు కూర్చుని ఉండటం లేదా నిలుచుని ఉండటం వల్ల కూడా ఇలా జరుగుతుంది కాబట్టి దానిని మార్చుకోవాలి. మధ్య మధ్యలో విరామం తీసుకుని కాస్తంత దూరం నడవాలి. రక్త సరఫరా మెరుగు పడేందుకు పాదాలకు వ్యాయామం చేయాలి. దీంతో వాపులు, నొప్పులు తగ్గుతాయి. 

పాదాలు భరించగలిగినంత వేడి నీటిని ఒక బేసిన్‌లో ఉంచి, దానిలో గుప్పెడు రాళ్ల ఉప్పు (సాధారణ ఉప్పు అయినా ఫరవాలేదు) వేసి, అది కరిగిన తర్వాత ఆ నీటిలో పాదాలను ఉంచాలి. 
తరచు బార్లీ నీరు తాగుతుండటం వల్ల కూడా పాదాల వాపు రాకుండా ఉంటుంది. 
పాదాల వాపులను తగ్గించడంలో గ్రేప్‌ ఫ్రూట్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ బాగా పనిచేస్తుంది.
ఒక బకెట్‌ గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల గ్రేప్‌ ఫ్రూట్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ను వేసి ఆ నీటిలో పాదాలను ఉంచాలి.
కొంత సేపు ఉంచాక పాదాలను తీసేయాలి. ద్రాక్షలో యాంటీ ఆక్సిడేటివ్‌ లక్షణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఎడిమా సమస్య నుంచి సులువుగా బయట పడవచ్చు.

చదవండి: పాదాలు కదలడం లేదా? అయితే గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top