Health Tips In Telugu: Best Foods Nuts That May Control High Blood Pressure - Sakshi
Sakshi News home page

Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే..

Published Sat, Oct 8 2022 9:58 AM

Health Tips In Telugu: Best Foods Nuts That May Control High BP - Sakshi

ప్రస్తుత కాలంలో జీవనశైలి మూలాన వస్తున్న సమస్యలలో బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్, ఎసిడిటీ, కడుపులో పుండ్లు వంటివి ముఖ్యమైనవి. వాటిలో అతి ముఖ్యమైనది బీపి. దీనికి వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు.

తక్కువ వయసు వారు కూడా హైబీపితో బాధపడుతున్నారు. రక్తపోటు పెరిగిపోవడం వల్ల ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవాలంటే కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం ప్రయోజనకరం. అవేంటో తెలుసుకుందాం..
 
పల్లీలు, బాదం, జీడిపప్పు అధిక రక్తపోటును అదుపు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే వాటిని ఎలా తీసుకోవాలో చూద్దాం. 
సాధారణంగా అధిక బరువు ఉన్నవారు నట్స్‌ను దూరం పెడుతుంటారు. వీటిని తింటే మరింత బరువు పెరిగిపోతామేమోననే అపోహతో. అయితే అది సరికాదు. ఎందుకంటే వేరుశెనగ, బాదం పప్పుల వల్ల బరువు పెరగరు. ఇవి మీ శరీర బరువు మరింత పెరగకుండా అడ్డుకుంటాయి కూడా. 

పల్లీలు
పల్లీలు లేదా వేరుసెనగ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు వేరువెనగ గింజలు తినడం వల్ల వంటి పనితీరు బాగుంటుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా తొలగిపోతుంది. కొలెస్ట్రాల్‌ వంటి రోగాల ప్రమాదం తప్పుతుంది.

ఎందుకంటే ఈ గింజలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేరుశెనగల్లో విటమిన్‌ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ వేరుశెనగలను తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.

ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బీపీని పెంచే కారకాలలో కొలెస్ట్రాల్‌ ముందుంటుంది. కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటే రక్తపోటుకు కళ్లెం వేయడం సులభం అవుతుంది కాబట్టి రోజూ నానబెట్టిన పల్లీలు తీసుకోవడం మంచిది. 

బాదం పప్పు
శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తొలగించేందుకు బాదం పప్పులు ఎంతో సహాయపడతాయి. గుప్పెడు వేరుసెనగ గింజలను, నాలుగైదు బాదం పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే బీపీ, డయాబెటిస్‌ అదుపులో ఉంటాయి.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని, అధిక రక్తపోటునూ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల శరీర బలం పెరుగుతుంది. 

జీడిపప్పులు
జీడిపప్పులు తింటే బరువు పెరిగిపోతామని వీటిని ముట్టని వారు చాలా మందే ఉన్నారు. నిజానికి అది సరికాదు.. జీడిపప్పులు బరువును పెంచడానికి బదులుగా.. బరువును కంట్రోల్‌ లో ఉంచడానికి సహాయపడతాయి. శీతాకాలంలో 2 నుంచి 3 జీడిపప్పులను తినడం శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

అలాగే శరీర శక్తిని కూడా పెంచుతుంది. వీటిలో పిస్తాపప్పు, ఇతర గింజల కంటే ఎక్కువ పోషకాలుంటాయి. ఇది రుచిగానే కాదు.. మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.

ఈ గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ కూడా అదుపులో ఉంటుంది. 

జుట్టు, చర్మానికి ప్రయోజనకరం
డ్రై ఫ్రూట్స్‌లో చాలావరకు విటమిన్‌ ఎ, విటమిన్‌ బి1, విటమిన్‌ బి6, విటమిన్‌ ఇ ,మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం  తగ్గుతాయి. సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. 

అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పేననడంలో ఎలాంటి సందేహం లేదు. చాపకింద నీరులా గుండె కవాటాలను పూడ్చివేసి, గుండె పనితీరును మందగింపజేసే బీపీని 
అదుపులో ఉంచుకోకపోతే చాలా ప్రమాదం. 

అయితే అది మందుల ద్వారానే కాదు, నిత్యం ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చునంటున్నారు ఆహార నిపుణులు. వీటన్నింటితోపాటు కంటినిండా నిద్రపోవడం, నిత్యం వాకింగ్‌ చేయడం కూడా చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి.  

నోట్‌: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది.

చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు!
High Uric Acid Level: యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే..

Advertisement

తప్పక చదవండి

Advertisement