High Uric Acid Level: యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే..

Health Tips: If Uric Acid Level Increases What Risks Treatment By Expert - Sakshi

శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరిగితే... అది సాధారణంగా కాలి బొటనవేలి ఎముకల మధ్యనో లేదా ఏ మోకాలు ప్రాంతంలోనో ఓ స్ఫటికంగా రూపొందుతుంది. అక్కడి ఎముకలతో ఒరుసుకుపోతూ... తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందన్నది చాలామందికి తెలిసిన విషయమే.

ఇలా వచ్చే కీళ్లనొప్పుల్ని ‘గౌట్‌’ అని పేర్కొంటారు. ఈ గౌట్‌ మీద చాలామందికి అవగాహన ఉంటుంది. కానీ యూరిక్‌ యాసిడ్‌ పెరగడం మరికొన్ని అనర్థాలకు దారితీస్తుందనీ, ఆ సమస్యలు  చాలామందికి పెద్దగా తెలియవని అంటున్నారు డాక్టర్లు. ఇలా యూరిక్‌ యాసిడ్‌ పెరగడం అన్నది గుండె, మూత్రపిండాలు, కాలేయం లాంటి కీలక అవయవాలపై దుష్ప్రభావం చూపుతుందనీ, కాబట్టి వాటి విషయంలోనూ అవగాహన అవసరమని చెబుతున్నారు. 

మనం అనేక రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటాం. అందులో మాంసకృత్తులు (ప్రోటీన్లు) ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారాలు జీర్ణమయ్యే సమయంలో కొన్ని వ్యర్థాలూ విడుదలవుతాయి. వాటిని బయటకు పంపే బాధ్యత మూత్రపిండాలు నిర్వహిస్తాయి. ఒకవేళ ఆ బాధ్యతను అవి సరిగా నిర్వహించలేకపోతే రక్తంలో ‘యూరిక్‌ యాసిడ్‌’ మోతాదులు పెరుగుతాయి.

ఇలా పెరిగాయంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో యూరిక్‌ యాసిడ్‌ ప్రమాణాలు 3.5 నుంచి 7.2 ఉండాలి. స్త్రీల  విషయంలోనైతే గరిష్ట మోతాదు 6.2 వరకే ఉండాలి. ఈ మోతాదులు మించితే కిడ్నీలపై దుష్ప్రభావాలు, గాల్‌ బ్లాడర్‌లో రాళ్లు వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. ఇవి కొన్ని లక్షణాల రూపంలో వ్యక్తమవుతాయి. 

కారణాలు:
రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరగడానికి అనేక అంశాలు దోహదపడతాయి.
చాలా అరుదుగా కొందరిలో పుట్టుకతో వచ్చే ఎంజైమ్‌ లోపాల కారణంగా కూడా అవి పెరగవచ్చు.
ఇది నివారించలేని సమస్య. ఇక నివారించగలిగే కొన్ని కారణాలూ ఉంటాయి. అవి... 

నీళ్లు : కొంతమంది చాలా తక్కువ నీళ్లు తాగుతుంటారు. రోజూ సరిపడా నీరు తాగనివారిలో  యూరిక్‌ యాసిడ్‌ పెరిగిపోయే అవకాశముంది. 
హై ప్రోటీన్‌ ఆహారం : మన దేహ నిర్వహణకు ప్రోటీన్లు చాలా అవసరం. కానీ కొంతమంది చాలా ఎక్కువగా ప్రోటీన్‌ డైట్‌...  అందునా రోజూ  వేటమాంసాల (రెడ్‌ మీట్‌) వంటివి తీసుకునేవారిలో ఈ ముప్పు మరింత ఎక్కువ.
మూత్రపిండాల సమస్య : కిడ్నీలు తమ పూర్తి సామర్థ్యంతో పని చేయని సందర్భాల్లోనూ యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరగవచ్చు. 

గుండె జబ్బుకు మందులు వాడటం : ఈ సమస్య కోసం మందులు వాడే వారిలో... వాటి దుష్ప్రభావాల (సైడ్‌ ఎఫెక్ట్స్‌) కారణంగా ఈ సమస్య కనిపించే అవకాశముంది. 
క్యాన్సర్లు : కొన్ని రకాల క్యాన్సర్లు సోకినప్పుడు ఈ సమస్య కనిపించవచ్చు. 

తమకు తామే గ్రహించేందుకు అవకాశం... ఇక్కడ పేర్కొన్న కారణాలు గలవారు, ముప్పు ఉన్నవారిలో సమస్య పెరిగే అవకాశమున్నందున, వాళ్లలో ఒళ్లునొప్పులు, జ్వరం, కీళ్లనొప్పులు కనిపించనప్పుడు... దానికి యూరిక్‌ యాసిడ్‌ కారణం కావచ్చేమో అని అనుమానించి, జాగ్రత్తగా గమనించుకోవాలి.

డయాబెటిస్‌ను, హైబీపీని అదుపు చేసే మందులు సక్రమంగా వాడుతున్నప్పటికీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, తగిన పరీక్షలు చేయించి, వాటి మోతాదు పెంచుకోవాల్సిన (డోస్‌ అడ్జెస్ట్‌ చేసుకోవాల్సిన) అవసరముందేమో చూడాలి. 

మద్యపానం తర్వాత కీళ్లనొప్పులు తరచూ కనిపిస్తుంటే... ఆ అలవాటుకు దూరంగా ఉండాలి. అలాగే రక్తాన్ని పలుచబార్చే ‘ఎకోస్ప్రిన్‌’ వంటి మందుల వాడకం తర్వాత ఈ సమస్య కనిపిస్తే, తమ డాక్టర్‌తో చర్చించి, ప్రత్యామ్నాయ మందులు వాడుకోవాలి. ఏ కారణమూ లేకుండా లక్షణాలు కనిపిస్తుంటే, రోజూ తాగే నీళ్ల మోతాదు పెంచి చూడాలి. మాంసకృత్తులు మరింత ఎక్కువగా తీసుకుంటున్నారేమో గమనించుకోవాలి. ఇలా ఎవరికి వారే కారణాలు గ్రహించి, కొంతమేరకు జాగ్రత్తపడేందుకు అవకాశం ఉంది.          

లక్షణాలు: 
ఒళ్లునొప్పులు 
తేలికపాటి జ్వరం
పిక్కల్లో నొప్పులు 
పాదాలు, మోకాళ్లలో నొప్పులు

చికిత్స:
ఈ సమస్యకు అందించే చికిత్స కొంత తేలికైనదే. ఓ చిన్న రక్తపరీక్ష ద్వారా రక్తంలో పెరిగిన యూరిక్‌ యాసిడ్‌ మోతాదులను తేలిగ్గా గుర్తించవచ్చు. ఒకవేళ ఆ మోతాదు పెరిగితే, దాన్ని సరిచేసేందుకు డాక్టర్లు నోటి ద్వారా తీసుకునే మందులు సూచిస్తారు. వాటిని వాడుతూ, మరోసారి మోతాదులను పరీక్షించి, అవి అదుపులోకి వస్తే, మందుల్ని ఆపేయవచ్చు. అయితే పుట్టుకతో వచ్చే ఎంజైమ్‌ లోపం కారణంగా ఈ సమస్య వస్తే... ఇలాంటి వారు తమ జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది.

ముప్పు ఎవరెవరిలో ఎక్కువ...? 
యూరిక్‌ యాసిడ్‌ మోతాదులు పెరిగే అవకాశాలు కొందరిలో మరీ ఎక్కువ. వారెవరంటే... 
మద్యం తీసుకునేవారు 
మధుమేహం (డయాబెటిస్‌)తో బాధపడేవారు ∙అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ∙రక్తాన్ని పలుచబార్చే మందులు వాడేవారిలో... ముప్పు ఎక్కువ.

మోతాదులు పెరిగితే కీలక అవయవాలపై దుష్ప్రభావం
యూరిక్‌ యాసిడ్‌ మోతాదు పెరుగుదల దేహంలో ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌ను సృష్టించి, అన్ని అవయవాలనూ ప్రభావితం చేయగలదు. అలాంటప్పుడు చిన్న చిన్న సమస్యలే కాకుండా కొన్ని సందర్భాల్లో తీవ్ర రుగ్మతలూ తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా యూరిక్‌ యాసిడ్‌ పెరుగుదలకూ, మూత్రపిండాల సమస్యకూ సంబంధం ఉంటుంది. రక్తంలో ఉండే యూరిక్‌ యాసిడ్‌ మోతాదు పెరిగితే, తొలుత స్ఫటికాల్లా మారి, తర్వాత రాళ్ల రూపం దాల్చేందుకు అవకాశం ఉంది. 

ఏ అవయవంలో ఈ యాసిడ్‌ ఎక్కువగా చేరుకుంటే, అది తీవ్రంగా ప్రభావితమవుతుంది. యూరిక్‌ యాసిడ్‌ పెరుగుదల ప్రభావం గుండె మీద కూడా పడే అవకాశం లేకపోలేదు. అలాగే మూత్రపిండాల పనితీరు, కాలేయం, గాల్‌ బ్లాడర్‌ పనితీరు కూడా దెబ్బతినవచ్చు.

కీళ్లతోపాటు మన కండరాలు, ఎముకల (మస్క్యులో–స్కెలెటల్‌) వ్యవస్థ ప్రభావితం కావచ్చు. అలాగే కొంతమందిలో ఇలా పెరిగే యూరిక్‌ యాసిడ్‌ మోతాదు మధుమేహానికి కూడా దారితీయవచ్చు.

ప్రత్యామ్నాయాలు ప్రయత్నించాలి
యూరిక్‌ యాసిడ్‌ పెరుగుదల ఎకోస్ప్రిన్‌ మందులు వాడకం వల్ల జరుగుతుందని గ్రహిస్తే... అప్పుడా మందులకు ప్రత్యామ్నాయాలను; అలాగే తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌ డైట్‌ ఎక్కువగా ఉండటం వల్ల అని తెలిస్తే... అప్పుడు మాంసకృత్తుల కోసం పాలు, గుడ్లు, అవకాడో వంటి తేలికపాటి ప్రత్యామ్నాయ ప్రోటీన్‌ వనరులను ప్రయత్నించవచ్చు. 
-డాక్టర్‌ రాజేశ్‌ ఉక్కాల, సీనియర్‌ కన్సల్టెంట్‌ , జనరల్‌ ఫిజీషియన్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top