నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే కొండనైనా పిండి చేస్తారు. తెగింపు వస్తే ప్రభుత్వాలను కూడా ఒణికిస్తారు. పైకి కనిపించే ఆత్మవిశ్వాసం కాని లోలోన ఒంటరితనం. సోషల్ మీడియా నోటిఫికేషన్లు.. చదువుల్లో గొర్రెదాటు పోటీ... ముందుండాలనే తాపత్రయం... వర్తమానం పట్ల చైతన్యం తెలియని ఉక్కిరిబిక్కిరి. జెన్‌జి మానసిక ఆరోగ్యం గురించి వాళ్లు మాత్రమే కాదు తల్లిదండ్రులు కూడా ఒక కన్నేసి పెట్టాలి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనసులోకి చూద్దాం.
హలో జెన్–జీ, ఎలా ఉన్నావ్?
జెన్–జీ... జంతర్ మంతర్ ఆందోళన తర్వాత బాగా పాపులర్ అయిన పదం. ఎవరీ జెన్ జీ అంటే.. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వాళ్లు. టెక్నాలజీలో పుట్టి పెరిగిన ఈ తరానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అయితే, వాటితోపాటు కొన్ని కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.
చేతిలో స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాలో వేల మంది స్నేహితులు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం. అయినా, నేటి యువతలో చాలామంది ఏదో తెలియని ఆందోళనతో, ఒత్తిడితో సతమతమవుతున్నారు. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, లోపల ఎన్నో ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే నేటి జెన్ జెడ్ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటి.
సోషల్ మీడియాలో అందరి జీవితాలూ బాగున్నట్టే!
ఇన్ స్టాగ్రామ్‌లో స్నేహితుల ఫొటోలు, విజయాలు, విదేశీ ప్రయాణాలు చూస్తుంటే మన జీవితం కూడా అలాగే ఉండాలని అనిపించవచ్చు. ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం మొదలుపెడితే, మన దగ్గర ఉన్నవాటికంటే లేనివే ఎక్కువగా కనిపిస్తాయి. ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది మనల్ని గుర్తించారు... అనే విషయాలు మన విలువను నిర్ణయించే స్థాయికి చేరితే ఆత్మవిశ్వాసం తగ్గవచ్చు. ఆన్ లైన్ లో ఎంతోమందితో మాట్లాడుతున్నా, మనసులోని బాధను చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేరనే భావన కొందరిని వెంటాడుతోంది. అందరితో కలిసున్నా ఒంటరిగా అనిపించడం కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయమే.
చదువు, ఉద్యోగం, భవిష్యత్తు... ఎన్నో ఆలోచనలు!
మంచి మార్కులు రావాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, జీవితంలో త్వరగా స్థిరపడాలి. తల్లిదండ్రుల ఆశలు, సమాజం అంచనాలు, స్నేహితులతో పోల్చుకోవడం ఇవన్నీ యువతపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఏదైనా ప్రయత్నించి విఫలమైతే ఏమవుతుందోననే భయం కూడా వారిని వెనక్కి లాగవచ్చు.
మనం ఏం చేయాలి?
ప్రతి సమస్యకూ వెంటనే సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వారు చెప్పేది ప్రశాంతంగా వింటే చాలు. తప్పు చేసినప్పుడు తిట్టకుండా, ఇతరులతో పోల్చకుండా, వారి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తగినంత నిద్ర, వ్యాయామం, స్నేహితులతో ముఖాముఖి మాట్లాడటం, ఫోన్ కు కొంత సమయం దూరంగా ఉండటం మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఆందోళన లేదా నిరాశ ఎక్కువకాలం కొనసాగి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం ఒక విషయం గుర్తుంచుకుందాం. యువతను వారి మార్కులు, ఉద్యోగాలు, విజయాలతో మాత్రమే అంచనా వేయకూడదు. వారి మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి. ‘‘ఎన్ని మార్కులు వచ్చాయి?’’ అని అడగడానికి ముందు, ‘‘నువ్వు ఎలా ఉన్నావు? ఏమైనా ఇబ్బందిగా ఉందా? నీతో మాట్లాడవచ్చా?’’ అని అడుగుదాం. మన పిల్లలకు, మన యువతకు అన్నీ సాధించాలనే ఒత్తిడి కంటే, ఏ పరిస్థితిలోనైనా మనం అండగా ఉంటామనే నమ్మకం ఎక్కువ అవసరం.ఎందుకంటే, యువత భవిష్యత్తు గురించి ఆలోచించడం ఎంత ముఖ్యమో, ఈ రోజు వారి మనసు బాగుండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.
– సైకాలజిస్ట్ విశేష్
సహాయం కోరడం బలహీనత కాదు
నేటి డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న జెన్ జీ యువత చదువు ఒత్తిడి, కెరీర్ అనిశ్చితి, సోషల్ మీడియా ప్రభావం, ఇతరులతో పోల్చుకోవడం, సంబంధాల్లో ఎదురయ్యే సమస్యల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. శారీరక ఆరోగ్యంతో సమానంగా మానసిక ఆరోగ్యానికీప్రాధాన్యం ఇవ్వాలి. తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే వాతావరణాన్ని తల్లిదండ్రులు, విద్యాసంస్థలు కల్పించాలి. మానసిక సమస్యలున్నప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడంలో సంకోచించకూడదు. సహాయం కోరడం బలహీనత కాదు.. ఆత్మవిశ్వాసానికి, ఆరోగ్యకరమైన జీవితానికి తొలి అడుగు. భావోద్వేగంగా ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో, సంతోషంగా జీవించేందుకు సమాజం సహకరించాలి.
– డా. సునీతా ప్రసాద్, సీనియర్ సైకాలజిస్ట్
వినడమే ప్రధానం
నేటి యువతరం ముఖ్యంగా జెన్‌జీ ల గురించి చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. వారి ఆలోచనలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయని, చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతారని, వారి మనస్తత్త్వం ఆందోళనకరం అని విమర్శిస్తుంటారు. కానీ, నేటి యువత ప్రవర్తన వెనుక ఉన్న భావోద్వేగాలు, సామాజిక పరిస్థితులు, మానసిక ఒత్తిళ్లను అర్థం చేసుకోకుండా విమర్శించడం సరైనది కాదని అంటున్నారు మానసిక నిపుణులు. మానసిక ఆరోగ్య సమస్యలను స్వయంగా ఎదుర్కొన్న వారి అనుభవాలను వినడం, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం, వారికి సంబంధించిన నిర్ణయాల్లో భాగస్వాములను చేయడం ఈ ఏడాది ప్రచారంలో ప్రధాన అంశం. ఇలాంటప్పుడు అర్ధం కావడం లేదనే ఈ తరాన్ని ముందుగా వినాలి.
→ తమ సమస్యలను చెబుతున్నప్పుడు వెంటనే తప్పులు వెతకడం, సలహాలు ఇవ్వడం, ఇతరులతో పోల్చడం మానుకోవాలి. వారి భావాలను శ్రద్ధగా వినాలి. వారు ఏం ఆలోచిస్తున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
→ తప్పు చేసినప్పుడు అవమానించడం, ప్రతి విషయానికీ ఆంక్షలు విధించడం కాకుండా.. తప్పుల నుంచి నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. తమ సమస్యలను భయం లేకుండా పంచుకోగల వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి.
→ డిజిటల్ వినియోగంలో సమతుల్యత పాటించడం, తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, ఆన్ లైన్ వేధింపుల నుంచి తమను తాము కాపాడుకోవడం నేర్పాలి.
→ మంచి ర్యాంకులు, ఎక్కువ జీతం, పెద్ద ఉద్యోగమే విజయానికి కొలమానం కాదని చె΄్పాలి. ఇతరులతో పోల్చకుండా, వైఫల్యాన్ని జీవితంలో ఒక భాగంగా
స్వీకరించేలా ్రపోత్సహించాలి.
→ తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల ఆహారం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. రోజువారీ జీవితంలో వీటికిప్రాధాన్యం ఇవ్వాలి.
→ ఆందోళన, నిరాశ, ఒంటరితనం, నిద్ర సమస్యలు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే నిపుణుల సహాయం తీసుకునేలా ్రపోత్సహించాలి. మానసిక ఆరోగ్య సమస్యల కోసం సహాయం కోరడం బలహీనత కాదని గుర్తు చేయాలి.
→ కుటుంబం, విద్యాసంస్థలు, ఆఫీసుల్లో ఈ తరం అభిప్రాయాలను వినాలి. బాధ్యతలు అప్పగిస్తూనే అవసరమైన మార్గదర్శకత్వం, స్వేచ్ఛ ఇవ్వాలి.
తమ మాటకు విలువ ఉందనే భావన వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
ప్రతి తరానికీ తనదైన ఆలోచనా విధానం, జీవనశైలి ఉంటాయి. సోషల్ మీడియా ప్రభావం, చదువు, ఉద్యోగ పోటీ, ఆర్థిక అనిశ్చితి, ఇతరులతో తమను తాము పోల్చుకోవడం వంటి అంశాలు నేటి యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. వారిలో సానుకూల మార్పును తప్పక ్రపోత్సహించాలి.
ముందు అర్థం చేసుకోవాలి..
జెన్ జీ తరాన్ని మార్చాలంటే ముందుగా వారిని అర్థం చేసుకోవాలి. వారి సమస్యలను తక్కువ చేసి చూడకుండా, అవసరమైనప్పుడు మార్గ
నిర్దేశం చేస్తూ, స్వతంత్రంగా ఎదిగేందుకు అవకాశమివ్వాలి. విమర్శ కంటే అవగాహన, ఆంక్షల కంటే సంభాషణ, ఒత్తిడి కంటే ్రపోత్సాహం.. యువతలో సానుకూల మార్పుకు బలమైన పునాదులు అవుతాయి.
– డాక్టర్ జ్యోతిరాజ, సైకాలజిస్ట్
– నిర్మలారెడ్డి


