Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'! | Sakshi
Sakshi News home page

కథ.. 'ఎట్టి మాలోళ్ల ఈరన్న'!

Published Sun, May 26 2024 11:48 AM

Etti Malolla Eranna Sunday Special Story Written By Surendra Sheelam

‘ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న, నిన్నటి దాంక బిస్సగా ఉండ్య?’ అని పెద్దింటి మనిషిని అడిగాడు తగ్గుబజారు మనిషి. మాటలు వినపడేంత దూరంలోనే యేటి తగ్గున దొడ్డికి కూచ్చోని మాట్లాడుకుంటున్నారిద్దరూ. ప్రొక్లెయినర్‌తో ఏటి గట్టునున్న కంప ఉన్న కంపచెట్లను పీకించేసరికి వరిమళ్లు నున్నగా కనపడతున్నాయి. చింతట్టు మీంద నుంచి తెల్ల కొంగల గుంపొకటి వరిమళ్లల్లోకి దిగింది. గుడ్ల మాడి ఇంటి బరుగోళ్ళు యేట్లో సల్లగా పనుకొని నెమురేచ్చా ఉండాయి.

బీడీ పొగ గాల్లోకి ఊత్తా ‘నిన్న పెత్తల్ల అమాస గదరా.. కేజీ మటన్, సీపు లిక్కర్‌ తెచ్చుకున్యాడంట, ఒక్కడే తిని తాగి సచ్చినాడు. ఉబ్బరం పట్టకల్యాక నిద్రలోనే గుండె పట్టుకుందంటా. మంచి సావు సచ్చినాడులే ముసిలోడు’ అన్యాడు పెద్దింటి మనిషి.
      ‘ఎంత సావొచ్చరా వానికి, డెబ్బై ఏళ్ళు వొచ్చినా మనిషి తుమ్మసెక్క ఉన్యట్టు ఉండ్య’ అనుకుంటా ఇద్దరూ ఒకేపారి లేసి యేట్లోకి పోయివచ్చినారు. ‘తొందర పోదాం పారా, ఎత్తేలోపే ఒకసారి సూసోద్దామ’ని ఊళ్ళోకి దావ పట్టినారు.

      ముసిలోల్లు, సావాసగాళ్లు అందరూ నాగన్నను సూన్నీకి పోతనారు. యాపసెట్టు కొమ్మల మద్దే నుంచి పడ్తన్య ఎండలో నాగన్నను రగ్గు మీంద పండుకోబెట్టినారు. తలాపున ఊదిగడ్లు పట్టుకుని కూచ్చోని ఉంది నడిపి కోడలు. వచ్చినోళ్లకు నీళ్ళు, కాపీ అందించా సేలాకీగా ఉంది సిన్న కోడలు. మొగుని కాళ్ళ కాడ కూచ్చోని ‘మటన్‌ కూరాకు, మటన్‌ కూరాకు అని కలవరిచ్చా ఉన్యాడు మూడు దినాల నుంచి. ఉన్నది అంత తిని సచ్చిపోయే గదరా’ అని ఏడుచ్చాంది నాగన్న పెళ్ళాం.

      నాగన్న మొఖం సచ్చిపోయినాంక గూడా కళతోనే ఉంది. వచ్చినోళ్ళు అందరూ దాని గురించే మాట్టాడుకుంటా పోతనారు. నాగన్న సిన్నకొడుకు మాటికి ఒకసారి ఇంట్లోకి పోయొచ్చా మూతి తుడుసుకుని వాళ్ళ నాయనను తలుసుకుని కుమిలిపోతనాడు. మిగిలిన ఇద్దరు కొడుకులు తలకాయ న్యాలకేసి నిలబన్యారు. మనువళ్లు మిగతా పనులు సూసుకుంటా ఉండారు. 
      ఊరు సర్పంచు సెండుమల్లె దండ నాగన్న మీందేసి ఒక పక్కన నిలబడి ‘ఎట్టి మాలోళ్లకు సెప్పినారా?’ అని పెద్దరికం నిరూపించుకున్యాడు. 
నాగన్న పెద్దకొడుకు ముందుకొచ్చి ‘మా పిల్లోల్లు సెప్పనీకి పోయినారు సామీ’ అన్యాడు. 
ఇంతలోనే ఊరి నుంచి కూతురు ఏడ్సుకుంటా వచ్చి వాళ్ళ నాయన మీంద పడింది. పెద్దింటి మనిషి, తగ్గుబజారు మనిషి ఇద్దరూ గూడా నాగన్న మొఖం దిక్కు సూసి ఒక పక్కన నిలబన్యారు.

కోపంగా ఇంటికాడ బగ్గి ఆపి దిగినారు నాగన్న మనువళ్లు. యాప సెట్టు మీందున్న కాకులు అరుసుకుంటా పైకి లేసినాయి. శాంచేపు నుంచి గాడిపాట్లో ఉండే బరుగోళ్ళు రెండు కొట్టుకుంటా ఉండాయి. వాళ్ళ నాయన కాడికి వచ్చి ‘ఈరన్న గుంత తియ్యనీకి రాడంట’ అన్యారు. ఆడ ఉన్య అందరూ వచ్చినోళ్ల దిక్కేమొఖం పెట్టినారు. 
      ‘ఏంటికి?’ అని అడిగినాడు నాగన్న పెద్దకొడుకు.
‘ఏమో నాయన! ఏం ఏంటికి గుంత తియ్యవు అని అడిగితే ఏం పలకల్యా.’
      ‘ఏం వానికి పొగరు ఎక్కిందంటనా’ అన్యాడు పసిడెంట్‌. 
‘లెక్క జాచ్చి ఇయ్యాలేమో లేరా’ అన్యాడు నిలబన్య పెద్దమనిషి.
      ‘ఆడికి అది గూడా సెప్పినాం మామా, నీ లెక్క నా పుల్లాతుకు సమానమని ఎచ్చులు పోయినాడు.’
‘బలసినట్టు ఉందే.. ఎవరు అనుకోని మాట్టాడ్తానాడంట? కాళ్ళు ఇర్సాలేమో’ అని మీసం తిప్పినాడు నాగన్న నడిపి కొడుకు. 
      ‘ఒర్యా నడిపే.. ఇది కొట్టాట టైమ్‌ కాదు.. వాని అవసరం మనది. నువ్వు మీయన్న పోయి మాట్టాడి రాపోరి’ అన్యారు రొంత మంది. కొడుకులు ఆలోచనలో పన్యారు. 
      ‘ఇంగో ఇద్దరూ పెద్ద మనుషులు గూడా పోరి’ అన్యాడు పసిడెంట్‌. గుంత తీసే ఈరన్నను తిట్టుకుంటా పోయినారు నలుగురు.

‘ఏం వచ్చి సచ్చింది గుంత తీనీకి పోయే.. లెక్కన్నా వచ్చాది. పెద్ద మాంసం తెచ్చుకుందాం’ అంది మంచంలో నెత్తి దూక్కుంటా ఈరన్న పెళ్ళాం. ఇంటి పక్కన ఉన్య కానుగ సెట్టు కింద కూచ్చోని హరిశ్చంద్ర పద్యం పాడుకుంటా తాడు పేన్తా ఉండాడు ఈరన్న. 
      ‘వీళ్ళ బజార్లు బాగుంటాయి ప్పా.. నీట్‌గా ఉండాయి సూడు.. మన బజార్లు సచ్చినాయి ఎప్పుడూ సూసినా కుళాయి నీళ్ళు పార్త బురద బురద ఉంటాయి’ అన్యాడు నాగన్న కొడుకులతో పాటు వచ్చన్య మొదటి పెద్దమనిషి.

ఆయన సెప్పినట్టే రోడ్డుకు రెండేపులా సెట్లు ఏపుగా పెరిగి ఉండాయి. ఎండ భూమి మీందకు దిగకుండా ఉంది. ఇంటి దిక్కే వచ్చన్య నలుగురును సూసి మంచం మీంద నుంచి దిగి నమస్కారం సేసింది ఈరన్న పెళ్ళాం. ఈరన్న ఏం పలకనట్టు కూచ్చున్యాడు. హరిశ్చంద్ర పద్దెం గొంతు పెంచి అందుకున్యాడు. జనం రొంత గుంపు అయినారు. 
      ‘ఈరన్న.. ఓ ఈరన్న’ అని పిల్సినాడు నాగన్న పెద్దకొడుకు. 
‘ఎవరోళ్ళు..’ అన్యాడు ఈరన్న. 
      ‘బంద నాగన్న కొడుకులం’ అన్యాడు నాగన్న నడిపి కొడుకు. 
‘సెప్పండి సామీ’ అని అరుగు దిగినాడు. 
      ‘సెప్పనీకి ఏం ఉంది ఈరన్న.. నాగన్న సచ్చిపోయినాడు తెల్దా ఏందీ?’ అన్యాడు రెండో పెద్దమనిషి. 
‘తెల్సు సామీ!’
      ‘మరేందీ ఈరన్న.. పిల్లోల్లు వచ్చే గుంత తియ్యవనీ సెప్పినావంట?’
‘అవును తియ్యను సామీ.’

‘యేంది ఈరన్న.. ఏం కావాలా సెప్పు? ఐదు వేలు లెక్క.. రెండు కోటర్లు మందు ఇచ్చాం రా.. టైమ్‌ ఐపోతాందీ’ అన్యాడు నడిపి కొడుకు.
      ‘నాకు పదివేలు ఇచ్చినా గుంత తీయను’ అని తెగేసి సెప్పినాడు ఈరన్న. 
‘ఏం ఎందుకు ఈరన్న.. మా తాత సచ్చిపోయినప్పుడు నువ్వే గదా తీసినావ్‌? మా పెద్దనాయన సచ్చిపోయినప్పుడు నువ్వే తీసినావ్‌? మా ఇల్లు నీకే కదా.’
      ‘అవ్‌ వాళ్ళందరివి తీసిన. రేప్పొద్దున మీలో ఎవరు సచ్చినా గుంత తీచ్చా, కానీ ఈ గుంత తియ్యను.’
భుజం మీందున్న టువాలా సర్దుకుంటూ ‘యేందిబీ.. మాటలు యాడికో పోతనాయి. రొంత సూసుకొని మాట్టాడు’ అన్యారు పెద్దమనుషులు. 
      ‘సూడు అయ్యా.. నా మాటలు యాటికి పోలా. నేను గుంత తియ్యను. నన్ను యిడ్సిపెట్టండి.’
‘ఏమైందో సెప్పమంటే ఇకారాలు పోతనాడు, ఈడు రాకపోతే వేరేవాళ్ళు రారా యేంది. వాళ్ళను  పిల్సుకొని పోదాం’ అన్యాడు నడిపి కొడుకు. 
      ‘ఆ... అట్నే పోండి సామీ’ అని తాడు పేనే పనిలో పడ్డాడు ఈరన్న. మెత్తగా ‘పెద్దోళ్ళు వచ్చినారు, పోకూడదా’ అంది ఈరన్న పెళ్ళాం.

‘నీ యమ్మ నిన్ను నరికి, ఈన్నే గుంత తీసి పూడుచ్చా అతికేం మాట్టాన్యావంటే’ అని ఒంటి కాలు మీంద పెళ్ళాం పైకి లేసినాడు ఈరన్న.
      ‘నీ దినం కూడు కుక్కలు తినా. ఏమన్యానని నా మీందకు వచ్చనావు? పోయేకాలం వచ్చిందిలే నీకు. పెద్దోళ్ళతో పెట్టుకుంటనావు’ అని తిట్టుకుంటా మంచంలో మళ్ళా కూచ్చుంది.

నలుగురు ఎదురుగా ఉన్య ఇంటి కాడికి పోయి నిలబన్యారు. ‘అయ్యా.. ఆ ఈరన్న గానీ ఇల్లుకు మేము పోయినామంటే.. వాడు తాగి అమ్మనక్కను తిడ్తాడు. వాన్తో మాకు కొట్టాట వొద్దు అయ్యా.. వానికి ఏం కావాలో ఇచ్చి వాణ్ణే పిల్సుకొని పోండి’ అన్యాడు ఈరన్న ఎదిరింటి మనిషి.

రొంత దూరంలో నిలబన్య ఈరన్న అన్న కొడుకు కెళ్ళి సూసేసరికి వాడు సేసేది ఏంల్యాక తలకాయ దించుకున్యాడు. సెప్పనీకి సూసినా వాళ్ళ మనుషుల మీంద మాటలతో పెద్దపులి పడినట్టు పన్యాడు ఈరన్న. ఎవ్వరూ గూడా నోరెత్తల్యా. సెవులూ కొట్టుకుంటా వెనక్కి పోయినారు నలుగురూ. ఈరన్న పెళ్ళాం భయపడ్తా మొగుని దగ్గరకొచ్చాంటే సింత నిప్పుల మాదిరి ఉన్య ఈరన్న కళ్ళు సూసి దూరం నిలబడి జరగబోయేది తలుసుకొని బిత్తర సూపులు సూచ్చాంది

నాగన్న తలకాయ కాడ ఉన్య బియ్యం గ్లాసులో కొత్త ఊదిగడ్లు నుంచి పొగ దట్టంగా లేచ్చా అప్పుడే లేపిన షామియానాను తాకుతాంది. రెండు మూడు కొత్త పూల దండలతో నాగన్న మొఖం యింగా వెలిగిపోతాంది. గాడిపాడు ఖాళీ అయ్యింది. 
‘వాడు రాడంట!’ అని నలుగురు తలకాయలు దించుకున్యారు. 
‘ఆ నావట్టకు ఏం పోయేకాలం వచ్చిందో సూడు క్కా’ అని పక్కన కూచున్య బండకాడ కూరగాయాల ఆమెతో బంకామె కళ్ళు పెద్దవి సేసి సెప్పింది. 
‘వాడు ల్యాకపోతే ఏంది? వేరే వాళ్లు లేరా’ అన్యాడు పసిడెంట్‌. 
‘వాని దెబ్బకు ఎవరూ రాకుండా ఉండారు.’

నాగన్న పెళ్ళాం ఏడుపు యాపసెట్టు అంతా అయింది. ఉన్య రెండు మూడు కాకులు గూడా ఎగిరిపోయినాయి. ‘ఎంత సేపు పెడ్తార్రా.. వాణ్ని పిల్సి ఈపు పగలగొట్టకుండా? ఇదే మా ఊర్లో అయ్యింటే బొడ్డాలు పగలగొట్టే వాళ్ళం. పెద్దమనుషులు ఉండారా? మా మామతో పాటు సచ్చినారా’ అన్యాడు సావు సూన్నీకి వచ్చిన సుట్టం.

అది యిన్య పెద్ద మనుషుల మొఖంలో నెత్తుర సుక్క ల్యాకుండా పోయింది. దొంగకోళ్ళు పట్టే మాదిరి ఒకరి మొఖం ఒకరు సూసుకుని బెల్లం కొట్టిన రాయిలా నిలబన్యారు. పరువు మీందకు వచ్చేసరికి కోపంగా ఈరన్నను పిల్సుకొని రమ్మని పసిడెంట్‌ మనిషిని పంపినాడు. విషయం ఊరంతా పాకింది. ఊర్లో యాసావు అంత మంది జనాన్ని సూసిండదు. ఏం అయితాదని జనాలు పనులు పోకుండా కూచ్చున్యారు. తిన్నాల ఉన్నట్టు ఉంది సావు. ఏడ్సి ఏడ్సి నాగన్న పెళ్ళాం సోయి ల్యాకుండా పడిపోయింది.

తప్పెటోల్లు రెండు పెగ్గులేసుకొని ఒక మూలకు కూచున్యారు. ఏం సెయ్యాలో తెలీక కొడుకులు గమ్మున నిలబడి ఉండారు. నాగన్నకు నలుగురు కొడుకులు అందరికి సమానంగా భూమి పంచి ఇచ్చి సోడమ్మ దేళంలో పూజారి పని సేచ్చా ఉండ్యా. దేళంకి చందాలు వసూలు చేయడం, దేళం బాగోగులు సూసుకుంటా సంతోషంగా బతుకుతుండ్యా. సోడమ్మ దేళంలో దీపం వెలగని రోజు లేదు.

పనికోసం యా రోజు ఒకరికోసం సెయ్యి స్యాసింది ల్యా. అంత వయసులో కూడా  ఎద్దులతో ఆరు ఎకరాల భూమి పండిచ్చా ఉన్యాడు. రోజుకు రెండు సెంబుల కాఫీ తాగుతా, నాలుగు కట్టలు వకీలా బీడీలు కాల్చేవోడు. పెళ్ళాంతో యారోజు మాట్టాడింది ల్యా ఎప్పుడూ కొట్టాడ్త ఉండేవాడు. ఊర్లో ఉన్నన్ని రోజులు ఉత్తపైనే ఉండేటోడు సంతకు పోవాల్సి వచ్చే కొత్తపెళ్ళికొడుకు మాదిరి పోయేటోడు నాగన్న.

ఎండ ఎక్కువైంది. సేతీకి ఉన్య పారేన్‌ వాచ్‌ పదే పదే సూసుకుంటా ఉండాడు పసిడెంట్‌. ఈరన్న పేనే తాడు భుజానేసుకుని నిమ్మళంగా వచ్చి రోడ్డు మీందనే నిలబన్యాడు. ఈరన్న వొచ్చినాడని గందరగోళం అయింది. ఊరి పెద్దోళ్లనే మల్లెసినా మొగోడు ఎవడాని కొత్తగా వచ్చిన సుట్టాలు ఈరన్న దిక్కు నోరెళ్ళబెట్టి సూచ్చనారు. వొంటి మింద కేజీ కండ గూడా లేదు. తాగి తాగి ఎముకలు బయట పన్యాయి. మూతి మొత్తం తిప్పినా మీసాలే. కళ్ళు ఎండిపోయిన కుందు యేరు మాదిరి ఉండాయి.

‘యేరా ఆన్నే రోడ్డు మీంద నిలబన్యావ్‌? రా ఇట్టా’ అన్యాడు పసిడెంట్‌. 
      ఈరన్న పసిడెంట్‌ మాటకు ఎదురుసెప్పల్యాక నీళ్ళు నములుతా ఉండాడు. 
‘యేందిరా?’ అని కళ్ళు పెద్దవి సేసినాడు పసిడెంట్‌. 
      రోడ్డు మీందకు కళ్ళేసి ‘నేను ఆడికి రాను రెడ్డి’ అని సెప్పినాడు. కొత్త ఊరోళ్ళు పసిడెంట్‌ కెళ్ళి సూసినాడు. పసిడెంట్కు తలకాయ కొట్టేసినట్టు అయింది. పెద్దమనుషులు పసిడెంట్‌కు సర్ది సెప్పినారు. అందరూ రోడ్డు మీందకు వచ్చినారు. 
      ‘సూచ్చనా సూచ్చనా శానా ఇకారాలు పోతనావ్‌? యేంది వాయ్‌ కథ’ అన్యాడు పసిడెంట్‌. 
అందరూ తల ఒకమాట ఏసుకున్యారు. ఈరన్న ఏం పలకకుండా నిలబన్యాడు. పీర్ల పండగ గుండం మాదిరి నిప్పులు కక్కుతా  ఇద్దరు ముగ్గురు సెయ్యి పైకి లేపినారు.

‘లాస్ట్‌ సారి మర్యాదగ సెప్తనా.. పోయి గుంత తీపో’ అన్యాడు పసిడెంట్‌. 
      ‘నా గొంతు కోసినా.. నేను గుంత తియ్యను రెడ్డి’ అని పసిడెంట్‌ కళ్ళల్లోకి సూటిగా సూచ్చా సెప్పినాడు. ఈరన్న దొమ్మ పొగరు ఊరు మొత్తం సూసింది. ఇట్టా కాదని కోటోళ్ల  తాత ముందుకు వచ్చి 
      ‘ఒర్యా... నీకు, నాగన్నకు ఏమైనా తకరారు అయిందా?’ అని అడిగినాడు. ఈరన్న అందరి దిక్కు సూచ్చా తలకాయ ఊపినాడు.

‘ఓర్నీ పాసుగూలా.. ఈ మాట ముందు సేప్తే పోయేది గదరా. ఏం కొట్టాట అయింది’ అని అడిగినారు. ఈరన్న ఏం మాట్టాడకుండా రోడ్డు వెంబడి నడ్సుకుంటా పోతాంటే జనం ఈరన్న దిక్కు సూచ్చా పోయినారు. పెద్దమనుషులు ఈరన్న పీక మీంద కాలేసి తొక్కేమాదిరి ఉండారు. గాడ్దెంకా దాటి సోడమ్మ దేళం ముందు రోడ్డు కాడ ఆగినాడు ఈరన్న. జనం గూడా ఏం సెప్తాడ అని కాసుకొని ఉండారు. ఈరన్న ఊరి మంది దిక్కు సూచ్చా పదేళ్ళ కింద మాట ఇదని మొదలుపెట్టినాడు.

ఆ పొద్దు ఇంగా సరిగ్గా తెల్లవారాల్య. ఊర్లో సారాయి బాలన్నను పోలీసులు పట్టకపోయినాంక సారాయి కోసం  జనం అందరూ పక్క ఊరికి పోతాండారు. రెండు రోజుల నుంచి సారాయి ల్యాక న్యాలుకా పీక్తాంటే  నేను సోడమ్మ వెనక దావ గుండా సచ్చా బతుకుతా పక్క ఊరికి పోయినా. కాళ్ళకు సెప్పులు లేవు. అడ్డదావాలో ముల్లులు ఉండాయని సోడమ్మ ముందు దావ వెంబడి ఊళ్ళోకి వచ్చాంటే పొద్దున పూజ సేసుకొనికీ వచ్చిన నాగన్న దావన పోతన్య నన్ను సూసి ‘ఒర్యా ఈరన్న.. ఒర్యా’ అని క్యాకేసినాడు.  ఎవరోబ్బా ఇంత పొద్దునా అని నేను ఆగి తలకాయ తిప్పి సూసినా. ‘మాల నాకొడాకా యా దావ నుంచి రా నువ్వు పొయ్యేది’ అన్యాడు.‘ఓ నాగన్న... మాటలు మర్యాదగా రానీ’ అన్య కైపు బిస్సన.

‘తాగుబోతు నా కొడకా నీకు మార్యాద యేందిరా, మీకు వెనక దావ ఉంది గదరా.. పెద్దరెడ్డి మాదిరి ఎవరూ సూల్లేదని ముందు నుంచి పోతానావ్‌’ అన్యాడు. నాకు కైపు అంత యిడ్సిపోయి కోపం అరికాళ్ళల్లో నుంచి మెదుడులోకి పాకింది.. ‘నీ యబ్బా కట్టిచ్చినాడా రోడ్డు.. ఇది అందరికీ’ అని సెప్పినా. అంతే కోపంతో ఎగిచ్చి తన్యాడు కాల్తో. నా కొడకా.. మళ్ళా మాట్టాడ్తనావే.. మీ బతుకులెంత? మీరెంత? యాపొద్దు పోంది, ఈ పొద్దు ఇట్టా ఎందుకు పోతనావ్‌ వాయ్‌ అని కుతిక మీంద కాలేసినాడు. సాచ్చం ఆ సోడమ్మ తల్లే. ‘మీకు ఒక దావ.. మాకు ఒక దావ ఎందుకు?’ అని అడిగినా. ‘మీరు మేము ఒకటేనా వాయ్‌. మేము ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారావ్‌’ అన్యాడు.

‘మేము గూడా ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారవ్‌.. మీ పీనుగ కూడా లేయ్యదు’అని సెప్పినా.
      ‘అంతా మొగోనివా?’ అన్యాడు. ‘సరే అయితే సెప్తండా సూసుకో.. ఇదే ఆకాశం, ఇదే నేల, ఇదే సోడమ్మ, ఎదురుగా ఉన్య మారెమ్మ మీంద ఒట్టేసి సెప్తనా.. రెండు దావలు పోయి ఒకే దావ వచ్చేగానీ నీ పీనుగకు నేను పికాసి ఎత్తను, పారా ముట్టను’ అని గట్టిగా అర్సి తొడ కొట్టి, మీసం తిప్పినా. ‘పో.. పో వాయ్‌ సూసినావ్, నీ మూడకాసు మాటలు’ అని నన్ను వెనక దావలోకి మెడకాయ పట్టుకొని గుంజకపోయినాడు’ అని జెప్పి.. సాచ్చం అద్దో ఆ మారెమ్మ తల్లే అని పోతురాజు మాదిరి మారెమ్మ దేళంకెళ్ళి సెయ్యి సూపిచ్చినాడు.

జనాలు అందరూ కిక్కురుమనుకుండా సినిమా సూసినట్టు సూసినారు. సోడమ్మ కటాంజన్‌కు కట్టిన ఎర్ర గుడ్డ గాలికి ఊగుతా ఉంది. పొద్దున్నుంచి దీపం ల్యాక దిగులుగా ఉన్నట్టు ఉంది. సాచ్చం యాడ అడుగుతారో అని సోడమ్మ కళ్ళు మూసుకుని ఏం ఎరగనట్టు వింటా ఉంది. సోడమ్మ వెనక దావాలో నిలబన్య ఈరన్న మనుషులు దీనంగా మొఖం పెట్టినారు.

‘మళ్ళా మీకు ఆ దావ ఉంది గదరా.. నువ్వు ఎందుకు ఈ దావలో నడ్సినావ్‌’ అన్యారు పెద్దమనుషులు. 
      ‘మళ్ళా మీరు అదే పాట పాడ్తారు. నేల అంతా ఒకటే అయినప్పుడు మీకు ఒక దావేంది, మాకు ఒక దావేంది రెడ్డి’ అన్యాడు ఈరన్న ఊగిపోతా. 
‘ఇప్పుడు ఏం అంటావ్‌ రా’ అని పళ్ళు నూరినారు పెద్దమనుషులు.
      ‘నేను సేప్పేది ఏం లేదు రెడ్డి.. నన్ను యిడ్సిపెడ్తే నా పని నేను సూసుకుంటా!’
‘సూడు ఈరన్న అయిపోయిందేందో అయిపోయింది. రా వచ్చి గుంత తీయ్‌. మా నాయన తరుపున పెద్ద కొడుకుగా నేను నిన్ను క్షమాపన అడుగుతనా’ అన్యాడు నాగన్న పెద్దకొడుకు.

‘ఎట్టా అయిపోతాది సామీ.. పది సంవత్సరాల నుంచి గుండెకాయ కాల్తానే ఉంది. ఉప్పు కారం మీకన్నా రొంత ఎక్కువే తిన్యా. కుందరాగు నర్సన్న పెద్దకొడుకు కుందరాగు ఈరన్నను నేను, మాట అంటే పానం లెక్క. మీరు సెప్పినట్టే మా బతుకులా? మీకేమో తారోడ్డులు, మాకేమో మట్టి దావలా? మారాల మారి తీరాల.’
అందరూ అర్థంకానట్టు సూచ్చనారు. పసిడెంట్‌ ముందుకు వచ్చి ‘ఇప్పుడు ఏం కావాలి రా నీకు?’

‘అందరికీ ఒకే దావా కావాలా!’
      ‘తంతే నాకొడకా యేట్లో పడ్తావ్‌.. అందరికీ ఒకే దావ యేంది రా.. తలకాయ తిరుగుతుందా?’
‘నాకు ఏం తిరగల్యా సామీ.. ఇప్పుడే సక్కగా పనిసేచ్చాంది. మేము గూడా ముందు దావలో నుంచే నడుచ్చాం.’
      ‘నడసనియ్యక పోతే..’
‘మీ గుంతలు మీరే తవ్వుకోండి.. మీ పీనుగులు మీరే బూర్సుకోండి!’

ఈరన్న మనసు అందరికీ అర్థం అయింది. పెద్దమనుషులు అందరూ గుంపు అయి గుస గుసలాడ్త ఈరన్న దిక్కు సంపేమాదిరి సూచ్చాండారు. ఎండ నెత్తి మీందకు వచ్చింది. నాగన్న తలకాయ కాడ ఊదిగడ్లు మారుతానే ఉండాయి. బయట ఊరోళ్ళు పెద్దమనుషుల దిక్కు మనుషుల్లానే సూడకుండా ఉండారు. ఈరన్న దిక్కు వాళ్ళ మనుషులు వచ్చి బలంగా నిలబడి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్యారు. దమ్ములు ఇరిసి నిలబన్య ఈరన్న దిక్కు పెళ్ళాం కళ్ళు ఆర్పకుండా సూచ్చాంది. వాళ్ళళ్ళో వాళ్ళు కొట్టుకుంటా అర్సుకుంటా ఉంటే తాపకొకసారి మీసం తిప్పుతా బుసలు కొడ్తా ఉండాడు ఈరన్న.

కొంతమంది ఈరన్న సంగతి సూజ్జామని పంచెలు ఎగ్గొట్టుకోని తిరిగి పోయినారు. సెసేది ఏం ల్యాక పెద్దమనుషులు సల్లు పోయినారు. సోడమ్మ వెనక దావకి కంపసెట్లు అడ్డంగా పెట్టినారు. ఈరన్నను ఎత్తుకుని క్యాకలేసినారు వాళ్ళ మనుషులు. అప్పుడే గుళ్ళో పెట్టిన దీపం వెలుగులో సోడమ్మ నవ్వుతా ఉన్యట్టు ఉంది. ఊళ్ళోదావ గురించి దండోరా యినపడ్తాంటే పికాసీ, పారా తీసుకొని యేటి పడమటి దిక్కు శ్మశానం కెళ్ళి ఈరన్న ఉదయిస్తా పోయినాడు. – సురేంద్ర శీలం

Advertisement
 
Advertisement
 
Advertisement