పచ్చగా ఉందాం | Environmental enthusiasts are raising awareness zero waste and recycling | Sakshi
Sakshi News home page

పచ్చగా ఉందాం

Jun 5 2026 2:49 AM | Updated on Jun 5 2026 2:49 AM

Environmental enthusiasts are raising awareness zero waste and recycling

మంచి చెప్పాలనే ఆలోచన కొందరిలోనైనా మార్పు తీసుకురావాలనే తపన వారిని పర్యావరణ ప్రేమికులుగా మార్చింది. ‘భూమాతకు జవం జీవం కల్పించండి’ అంటూ 
సోషల్‌మీడియా ద్వారా సస్టెయినబులిటీ, జీరోవేస్ట్, రీ సైక్లింగ్‌ గురించి వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇళ్లలో పోగవుతున్న చెత్త
ఫ్రెంచ్‌ సబ్జెక్ట్‌లో పిల్లలకు పాఠాలు చెబుతుంది విధి. ఐదేళ్లక్రితం పర్యావరణ అనుకూల జీవనంవైపు ప్రయాణం ఆరంభించింది. మిలియన్‌కు పైగా వీక్షకులు ఉన్న విధి ట్రేషీ సిస్టర్‌ పేరుతో బోలెడన్ని ఇంటి చిట్కాలు చెబుతుంది. ‘మహిళలు ఉపయోగించే మెనుస్ట్రువల్‌ కప్‌ను కనుక్కోవడంతో ఈ దిశగా నా ఆలోచనలు సాగాయి. మహిళలు రుతుక్రమ సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యా డ్స్‌ వల్ల చెత్త ఎంత ఎక్కువగా వస్తుందో గ్రహించాను. దీంతోపాటు వివిధ రకాల వ్యర్థాలు పర్యావరణంపైనే కాకుండా మన ఆరోగ్యంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకున్నాను. ఇళ్లలో పోగవుతున్న చెత్త గురించి నా పేజీ ద్వారా మాట్లాడుతుంటాను. చిరిగిన బట్టలు, అరిగిన చెప్పులు, వాడేసిన టూత్‌బ్రష్షులు, గడువు ముగిసిన ఉత్పత్తులు.. వీటన్నింటినీ తిరిగి ఎలా ఉపయోగించుకోవచ్చో చెబుతుంటాను. నా కంటెంట్‌ చూసి, ఒక్కరు మారినా చాలు’ అంటుంది విధి.

ప్రకృతి ప్రేమికురాలు.. 
స్టోరీ టెల్లర్, రైటర్, క్లైమేట్‌ ఛేంజ్‌ అడ్వకేట్, ఫొటోగ్రాఫర్, సస్టెయినబిలిటీ ఇన్‌ఫ్లూయెన్సర్‌ గా పేరొందారు శివ్యానాథ్‌. సోలో ట్రావెలర్‌ అయిన శివ్యా పదేళ్లుగా మాంసాహార ఉత్పత్తుల నుంచి దూరమై వీగన్‌ ఫుడ్‌వైపుగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. వాయిసెస్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థకు కో–ఫౌండర్‌గా వర్క్‌ చేస్తున్నారు. రూరల్‌ స్టోరీ టెల్లర్‌గా తన గొంతుకను వినిపిస్తున్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా లక్షల్లో ఫాలోవర్లు ఉన్న శివ్యా సోలో ట్రావెలర్‌గా ప్రకృతి, పర్యావరణం గురించి తన అనుభవాలన్నీ ఇందులో జోడిస్తుంది.

చెట్లను రక్షిద్దాం..
హిమాచల్‌ప్రదేశ్‌ వాసి శివాని కన్వర్‌ స్వచ్ఛభారత్‌ మిషన్‌లోనూ వర్క్‌ చేస్తుంది. వేస్ట్‌ మేనేజ్‌మెంట్, సస్టెయినబిలిటీ మీద కంటెంట్‌ క్రియేట్‌ చేస్తుంది. అమృత్‌సర్‌ జిల్లాలోని మజీతాలోని స్థానిక సంస్థలలో చేసిన కృషికి గాను ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రాన్నీ పొందింది. ‘చెట్లను నాటడం ముఖ్యం. కానీ, ఇప్పటికే ఉన్న పెద్దచెట్లను రక్షించడం మరింత కీలకం. ఒక చెట్టుకు హాని జరుగుతుంటే చూస్తూ మౌనం వహించకండి. దానిని రక్షించండి. ఇలా దేశమంతటా చేస్తే పచ్చదనాన్ని కాపాడుకున్నవారం అవుతాం. ఎవరైనా అక్రమంగా చెట్లను నరుకుతుంటే దాని గురించి పోలీసులకు తెలియజేయండి. ఒక్క ఫోన్‌ కాల్‌ ఒక చెట్టును కాపాడగలదు. కాపాడిన చెట్టు తరతరాలకు ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని ప్రచారం చేసే శివానీ ఎకో ఎఫర్ట్స్‌ పేరుతో పర్యావరణ హితానికి కృషి చేస్తోంది.

రీ యూజ్‌
ప్రకృతిలో మమేకం అవుతూ ఎలా జీవించవచ్చో తన పేజీ ద్వారా విరిస్తుంది ఇండోర్‌వాసి ‘శ్వేత కటారియా’. వీగన్‌ న్యూట్రిషన్‌పై వర్క్‌ చేస్తున్న శ్వేత తన పేజీ ద్వారా సస్టెయినబిలిటీ జీవన విధానాల గురించి వివరిస్తుంది. వంటగదిలో వాడే క్లీనింగ్‌ ప్రొడక్ట్స్, వేస్టేజ్, రీయూజ్‌ దుస్తుల గురించి మొక్కల పెంపకం, చెట్ల ప్రాముఖ్యత.. ఇలా ప్రతిదీ వివరిస్తుంది. లక్షకు పైగా ఫాలోవర్లు తన కంటెంట్‌ను ఫాలో అవుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement