
ఫెర్టిలిటీ సమస్యలకు ప్రత్యామ్నాయం టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇది మానవ జీవితాన్ని గట్టిగానే ప్రభావితం చేస్తోంది. మానవ మనుగడకు తోడ్పాటునందిస్తోంది.. కాలుష్యం, రసాయనాల ప్రభావంతో పాటు తీవ్ర ఒత్తిడి అనేక రుగ్మతలకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సంతానోత్పత్తిపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తోంది.. దీనికి పరిష్కారంగా అనేక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగినది ఐవీఎఫ్ పద్ధతి. చదువులు, ఉద్యోగాలు, భారీ జీతాల కోసం భారీ లక్ష్యాలతో వివాహ వయసు దాటిపోతోంది. దీంతో గతంలో మహిళలనే ఇబ్బంది పెట్టిన ఇన్‌ఫెర్టిలిటీ సమస్య మగవారిలోనూ కనిపిస్తోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు తేడాలేకుండా సగటున 50 శాతం మందిలో ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా యుక్త వయసులోనే పురుషులు శుక్ర కణాలను, మహిళలు అండాలను భద్రపరుచుకునే వెసులుబాటు వచ్చేసింది.
మారుతున్న కాలంలో పాటే అధునాతన చికిత్సలు అందుబాలోకి వచ్చేశాయి. ఆలస్యంగా వివాహాలు చేసుకునే వారి వేధించే ఇన్‌ఫెర్టిలిటీ సమస్యకు పరిష్కారంగా ఎంబ్రియో ఫ్రీజింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి. మెట్రోనగరాల్లో ఒకటైన మన నగరంలోనూ ఈ వెసులుబాటు వచ్చేసింది. శుక్ర కణాలు, ఎగ్ (జీవ కణం) క్వాలిటీలో ఎలాంటి ఇబ్బందులూ లేనివారు యుక్త వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీటిని ఫ్రీజ్ చేసుకుంటున్నారు.
ఇలా ఫ్రీజ్ చేసిన వాటిని ఐదు నుంచి పదేళ్లలో ఎప్పుడైనా గర్భాశయంలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనివ్వవచ్చు. దీంతో విద్య, ఉద్యోగం వంటి కారణాలతో అనేక మంది వివాహాన్ని ఆలస్యం చేస్తున్నారు. ఇది సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో నగర ప్రజలు ఐవీఎఫ్ కేంద్రాలకు క్యూ కట్టేవారు.. దీనికి పరిష్కారంగా అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడంతో ఫ్రీజింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.
40 శాతం దంపతుల్లో సంతాన సమస్యలు..
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, ఒత్తిడి, సంపాదన, లైఫ్‌స్టైల్, కుటుంబ పరిస్థితులు, కాలుష్యం, ఆహారం, మైక్రో ప్లాస్టిక్, హార్మోన్ల సమతుల్యత, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మద్యం సేవించడం, పొగ తాగడం, రక్త సంబందీకులను పెళ్లి చేసుకోవడం, జన్యుపరమైన, ఇతర సమస్యలతో సుమారు 40 శాతం కొత్తగా పెళ్లైన జంటల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇందులో పురుషుల్లో 50 శాతం మందిలో, 45 శాతం మంది స్త్రీలల్లో పునరుత్పత్తి సమస్యలు గుర్తిస్తున్నారు. ఇద్దరిలోనూ సమస్యలు ఉన్న జంటలు సుమారు 15 శాతం నుంచి 20 శాతం ఉంటున్నాయి. ఈ సమయంలో కొంత మంది మానసికంగా కుంగిపోవడం కనిపిస్తోంది. ఐవీఎఫ్ పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. 30 ఏళ్లు వయసుగల వారిలో ఐవీఎఫ్ పద్దతులు సుమారు 60 శాతం నుంచి 70 శాతం సక్సస్ రేటు ఉండగా, ఆపై వయసున్న వారిలో సుమారు 40 శాతం నుంచి 50 శాతం ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.
జీవ కణం పదేళ్లు..
ఆరోగ్య రంగంలో ప్రపంచానికే మార్గదర్శిగా వెలుగొందుతున్న హైదరాబాద్ సంతాన సమస్యలకు చెక్ పెట్టే అధునాతన పద్ధతులను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ కంటే అధునాతన చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచి్చంది. దంపతుల నుంచి సేకరించిన ఎగ్స్, శుక్రకణాలను ఎంబ్రియాలజీ ల్యాబ్‌లో మైక్రోస్కోప్ కింద పిండాన్ని (జీవ కణం) తయారు చేస్తారు. ఐదు నుంచి ఆరు రోజుల్లో పిండం సిద్ధమైపోతుంది. ఇలా తయారు చేసిన పిండాన్ని పదేళ్లలోపు ఎప్పుడైనా మహిళ గర్భాశయంలోకి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.
వైరల్ మార్కర్ టెస్టులు..
పెళ్లికి ముందు, లేదా వివాహం నిశ్చయించుకున్న జంటలు ముందుగా వైరల్ మార్కర్, ఏఎంహెచ్ వంటి టెస్టులు చేయించుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒక వేళ ఇద్దరిలో ఎవరికైనా సమస్యలు ఉంటే ముందుగానే వాటికి చికిత్సలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతల్లో పనిచేసే వారిలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుందట. మహిళల్లో 25 ఏళ్ల లోపు ఎగ్ రిలీజ్ బాగుంటుందని, తరువాత తగ్గిపోతుందని చెబుతున్నారు. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ వివాహానికి ముందే చేసుకుంటే మంచిది. ఏడాది వరకూ సహజంగానే ట్రై చేసుకోవచ్చు.
ఇది డే కేర్ ప్రొసీజర్..
పట్టణ ప్రాంతాల్లో జీవన శైలి, ఇతర అలవాట్లతో సంతాన సమ్యలు సర్వసాధారణం అయిపోయాయి. దీంతో కొందరు ఐవీఎఫ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. శుక్రకణాలు, అండం, పిండాన్ని ఫ్రీజ్ చేయడం, ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసే ప్రొసీజర్లు కొనసాగుతున్నాయి.
శుక్ర కణాలు, ఎగ్స్ ఎంబ్రియాలజీ ల్యాబ్‌లో మైక్రో స్కోప్ కింద కలిపి పిండం (జీవకణం) తయారు చేస్తాం. దీన్ని ఇక్సీ పద్ధతి అంటారు. మహిళకు నొప్పి లేకుండా డే కేర్ ప్రొసీజర్‌లో పూర్తయిపోతుంది. మరుసటి రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు.
– పీ.స్వాతి, రీప్రొడక్టివ్ మెడిసిన్, కన్సల్టెంట్ రైన్‌బో హాస్పటల్స్
(చదవండి: సైక్లింగ్ పర్యావరణ హితం.. ఆరోగ్యం కూడా..!)