ఇది సాధారణమేనా? | Doctor's advice about baby crying | Sakshi
Sakshi News home page

ఇది సాధారణమేనా?

Jul 5 2026 6:14 AM | Updated on Jul 5 2026 6:14 AM

Doctor's advice about baby crying

డా‘‘ కె. పవన్‌ కుమార్‌ , సీనియర్‌ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్‌ అలర్జిస్ట్, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ 

డాక్టర్‌ గారు, నా రెండున్నరేళ్ల బిడ్డ ప్రతి చిన్న విషయానికీ ఏడుస్తోంది. తనకు కావాల్సింది వెంటనే ఇవ్వకపోయినా, నేను కాసేపు కనిపించకపోయినా నేలపై పడుకుని మారాం చేస్తోంది. ఇది సాధారణమేనా? లేక ఏదైనా సమస్యకు సంకేతమా? – శైలజ, విజయవాడ.
మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండున్నర సంవత్సరాల వయసులో పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన చాలా సాధారణం. ఈ దశను చాలామంది నిపుణులు టెరిబుల్‌ టూస్‌ అని పిలుస్తారు. ఈ సమయంలో పిల్లలు తమ స్వతంత్రతను చూపించాలని కోరుకుంటారు. కానీ తమ భావాలను పూర్తిగా మాటల్లో చెప్పలేకపోవడం వల్ల ఏడుపు, కోపం, మారాం, నేలపై పడుకోవడం వంటి ప్రవర్తనలు కనిపిస్తాయి. మీరు చెప్పిన లక్షణాలు ఎక్కువగా టెంపర్‌ టాంట్రమ్స్‌గా కనిపిస్తున్నాయి. పిల్లలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? అంటే, ఈ వయసులో పిల్లల కోరికలు, భావోద్వేగాలు బలంగా ఉంటాయి. కానీ వాటిని నియంత్రించే మెదడు భాగం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. అందుకే చిన్న విషయాలే వారికి పెద్ద సమస్యలుగా అనిపిస్తాయి. 

ఉదాహరణకు ఇష్టమైన బొమ్మ ఇవ్వకపోవడం, టీవీ ఆపేయడం, పార్క్‌ నుంచి ఇంటికి తీసుకురావడం, తల్లి కొద్దిసేపు కనిపించకపోవడం, ఆకలి లేదా నిద్ర ఉండడం ఇలాంటి సందర్భాల్లో పిల్లలు తమ నిరాశను ఏడుపు లేదా మారాం ద్వారా వ్యక్తపరుస్తారు. ఇలాంటప్పుడే, తల్లిదండ్రులు కొన్ని పనులు చేయాలి.

ప్రశాంతంగా ఉండండి
పిల్లవాడు కోపంగా ఉన్నప్పుడు మీరు కూడా కోప్పడితే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.

పిల్లల భావాన్ని అర్థం చేసుకోండి
ఏడవకు అని చెప్పడం కంటే, నీకు ఆ బొమ్మ కావాలని ఉంది కదా లేదా అమ్మ వెళ్లడంతో నీకు బాధగా ఉంది కదా అని చెప్పడం వల్ల పిల్లలు తాము అర్థం చేసుకున్నారని భావిస్తారు.

ఏడుస్తున్నాడని వెంటనే కోరిక తీర్చవద్దు
లేకపోతే ఏడిస్తే పని అవుతుంది అనే అలవాటు ఏర్పడుతుంది.

సురక్షితంగా ఉండేలా చూడండి
నేలపై పడుకున్నా, అరుస్తున్నా గాయపడకుండా చూసుకోవాలి. కానీ ఎక్కువగా వాదించడం లేదా బెదిరించడం అవసరం లేదు.

తర్వాత మాట్లాడండి
టాంట్రమ్‌ జరుగుతున్న సమయంలో బోధించడం ప్రయోజనం ఉండదు. ప్రశాంతమైన తర్వాత మాత్రమే వివరించాలి.అంతేకాదు, టాంట్రమ్స్‌ తగ్గించడానికి తగినంత నిద్ర ఉండాలి, ఆకలిగా ఉండనివ్వకూడదు, రోజూ ఆటలు, శారీరక చలనం ఉండాలి. మొబైల్, టీవీ వినియోగాన్ని పరిమితం చేయాలి. తల్లిదండ్రులతో ప్రత్యేక సమయం గడపాలి. చిన్న చిన్న ఎంపికలు ఇవ్వాలి. ఉదాహరణకు, ఎరుపు డ్రెస్‌ వేసుకుంటావా లేక నీలం డ్రెస్‌ వేసుకుంటావా? లేదా పాలు ఇప్పుడు తాగుతావా, ఐదు నిమిషాల తర్వాత తాగుతావా? అని అడగవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో నియంత్రణ భావన పెరుగుతుంది.

అయితే, ఇలా కాకుండా.. రోజుకు అనేకసార్లు తీవ్రమైన టాంట్రమ్స్‌ రావడం, అవి ఇరవై నుంచి ముప్పై నిమిషాల కంటే ఎక్కువ కొనసాగడం, తనను తాను గాయపరుచుకోవడం, ఇతరులను కొట్టడం లేదా కరవడం, మాటల అభివృద్ధి ఆలస్యం ఉండటం, పేరు పిలిచినా స్పందించకపోవడం. కళ్లలోకి చూడకపోవడం, ఇతర పిల్లలతో కలవకపోవడం. ఇవన్నీ వారి వయసు నాలుగు సంవత్సరాల తర్వాత కూడా కొనసాగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే, పిల్లల వైద్యుడిని లేదా చైల్డ్‌ సైకాలజిస్టును సంప్రదించడం మంచిది. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లవాడు మొండివాడు లేదా చాలా అల్లరి అని అనుకుంటారు. 

కానీ నిజానికి ఈ వయసులో పిల్లలు తమ భావోద్వేగాలను ఎలా నియంత్రించాలో నేర్చుకుంటున్నారు. ఇది ఎదుగుదలలో భాగమైన సహజ దశ. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పిల్లవాడు కావాలనే ఇబ్బంది పెట్టడం కాదు. తనలో ఉన్న భావోద్వేగాలను ఎలా వ్యక్తపరచాలో ఇంకా నేర్చుకుంటున్నాడు. ఈ సమయంలో తల్లిదండ్రుల ఓర్పు, ప్రేమ, స్థిరత్వమే అతనికి అత్యంత అవసరం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement