బ్లాకేజెస్‌ చెక్‌ చేస్తారా?

Doctor Clarity On Pregnancy Rumors - Sakshi

మేడమ్‌! నా వయసు 32 సంవత్సరాలు, బరువు 80 కిలోలు. రీసెంట్‌గా డీ అండ్‌ సీ, ఇంకా రైట్‌ ఎక్టోపిక్‌ లాపరోస్కోపీ సర్జరీ జరిగింది. లాపరోస్కోపీ సర్జరీ అంటే ఏంటి? సర్జరీలో ఎఫెక్ట్‌ అయిన ట్యూబ్‌కే కాకుండా, సెకండ్‌ ట్యూబ్‌కి కూడా బ్లాకేజెస్‌ ఉన్నాయా అని చెక్‌ చేస్తారా? హెచ్‌ఎస్‌జీ టెస్ట్‌ చేయించాల్సిన అవసరం ఉందా? నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? గతంలో నాకు పీసీఓడీ కూడా ఉండేది. సర్జరీ తర్వాత స్కాన్‌ చేస్తే అందులో పీసీఓడీ సింప్టమ్స్‌ ఏమీ లేవు. ఇప్పుడు నేను ఎలాంటి కేర్‌ తీసుకోవాలి? ఎలాంటి డైట్‌ తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు.
– భావన (ఈ–మెయిల్‌)

బరువు 80కిలోలు అన్నారు. ఎత్తు ఎంత ఉన్నారు అని రాయలేదు. అయినప్పటికీ 80కిలోలు అంటే కొద్దిగా అధిక బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. అధిక బరువు వల్ల కూడా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి పీసీఓడీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పెల్విక్‌ స్కానింగ్‌లో రెండు రకాలుగా చేస్తారు. ట్రాన్స్‌అబ్డామినల్‌ స్కానింగ్‌ అంటే నీరు బాగా తాగిన తర్వాత పొట్టపైన నుంచి చేస్తారు. ఇందులో పొట్టలావుగా ఉండి పొత్తికడుపు దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు కొందరిలో నీటి బుడగలు పీసీఓడి, గర్భాశయంలో కొన్ని సూక్ష్మమైన సమస్యలు అంతగా తెలియకపోవచ్చు.

అలాంటప్పుడు కొన్ని గర్భాశయంలో, అండాశయంలో సమస్యలను గుర్తించలేకపోవచ్చు. పెళ్ళయిన వారికి ట్రాన్స్‌వెజైనల్‌ స్కానింగ్‌ (టీవీఎస్‌) అంటే యోని ద్వారం నుంచి స్కానింగ్‌ చేస్తారు. ఇందులో అండాశయంలో ఉండే నీటి బుడగల సమస్య, ఒవేరియన్‌ సిస్ట్‌లు, అవి ఎలాంటివి, గర్భాశయంలో గడ్డలు, కంతులు, ఇన్‌ఫెక్షన్‌లు, ఇంకా ఇతర చిన్నచిన్న సమస్యలను వివరంగా గుర్తించవచ్చు. నీకు ముందు పీసీఓడి ఉండి, ఇప్పుడు లేదు అంటున్నారు అంటే అబ్డామినల్‌ స్కానింగ్‌ చెయ్యడం వల్ల సరిగా కనిపించకపోయి ఉండవచ్చు, లేదా కొందరిలో వయసు పెరిగే కొద్దీ  అండాలు తగ్గే క్రమంలో అండాశయాలు మామూలుగా ఉండవచ్చు. మీకు పీరియడ్స్‌ నెలనెలా సక్రమంగా వస్తున్నాయా లేదా అనేది తెలియవలసి ఉంది.

నెలనెలా పీరియడ్స్‌ సక్రమంగా ఉంటే చాలావరకు ఒక నెల ఒక అండాశయం నుంచి, ఇంకొక నెల ఇంకొక అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. నీకు లాపరోస్కోపీ సర్జరీలో కుడిట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ రావడం (ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ) వల్ల ఆ ట్యూబ్‌ని తొలగించి ఉంటారు. కాబట్టి ఇంకొక ట్యూబ్‌ సరిగా ఉంటే, ఎడమవైపు అండం విడుదలయిన నెలలో గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. పొట్టలో కొన్నిరకాల సమస్యలకు, పొట్ట కోసి కాకుండా పొట్టపైన 25సెం.మీ గాటు పెట్టి కడుపులోకి కార్బన్‌డయాక్సైడ్‌ గ్యాస్‌ను పంపించి పొట్ట ఉబ్బిన తర్వాత 2 నుంచి 3, 0.5సెం.మీ గాట్లు పెట్టి టీవీలో చూస్తూ ఆపరేషన్‌ చెయ్యడం జరుగుతుంది. ఈ సమయంలో ఇంకొక ట్యూబ్‌ ఎలా ఉందని చెక్‌ చెయ్యడం జరుగుతుంది. ఇంకొక ట్యూబ్‌ సరిగా ఉంటే మళ్ళీ మామూలుగానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఒకవేళ అప్పుడు చెక్‌ చెయ్యకపోతే, అవసరమనుకుంటే హిస్టరోసాల్సింగ్‌గ్రామ్‌ (హెచ్‌ఎస్‌జి) పరీక్ష ద్వారా, ఇంకొక ట్యూబ్‌లో బ్లాకేజీలు ఉన్నాయా లేదా తెరుచుకుని ఉందా అని తెలుసుకోవడం జరుగుతుంది. మీకు ఆపరేషన్‌ ఈ మధ్యనే జరిగింది కాబట్టి, మూడునెలల తర్వాత మళ్ళీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. ఈ లోపల మీరు 80కేజీలు ఉన్నారు కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూ, కొద్దిగా వాకింగ్, చిన్న వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నం చెయ్యడం మంచిది. ఆహారంలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్‌) కొవ్వుపదార్థాలు తక్కువ తీసుకుంటూ, ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం మంచిది. మీ వయసు 32 సంవత్సరాలు కాబట్టి, ఎక్కువ సమయం వృథా చేయకుండా మూడు నుంచి ఆరు నెలలలో గర్భం కోసం ప్రయత్నించి తర్వాత గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వారి సలహాలను పాటిస్తూ, అండం విడుదల అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఫాలిక్యులార్‌ స్టడీ స్కానింగ్‌ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం మంచిది.

మేడమ్, నమస్కారాలు! నా వయసు యాభై సంవత్సరాలు. కొన్నాళ్లుగా సుగర్‌ ఉన్నందువల్ల వైద్యం చేయించుకుంటున్నాను. మెన్సెస్‌ ఆగిపోయి ఐదు సంవత్సరాలైంది. ఎడమరొమ్ములో చిన్న కంతి ఏర్పడి నొప్పిగా ఉంటోంది. నుదురుపై రెండు కాయలు ఉన్నాయి. ఈ మార్పులు కేన్సర్‌ లక్షణాలేమోనని భయంగా ఉంది. మీ సలహా కోసం ఎదురు చూస్తున్నాను.
–తంగేటి పాపాయమ్మ, ఏలేశ్వరం (తూ.గో.జిల్లా)

50 సంవత్సరాల వయసు కాబట్టి రొమ్ములో చిన్న కంతి నొప్పిగా కూడా ఉందంటున్నారు కాబట్టి మీకుమీరే భయపడుతూ అశ్రద్ధ, ఆలస్యం చేయకుండా ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి యుఎస్‌జి బ్రెస్ట్, మామోగ్రామ్, అవసరమైతే బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకుంటే ఈ కంతి సాధారణమైనదేనా లేక క్యాన్సర్‌కు సంబంధించినదా అని తెలుస్తుంది. కొందరిలో నొప్పితో కూడిన కంతి అంటే ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా చీముగడ్డ లాగా కూడా అయ్యిండవచ్చు. కాకపోతే ఈ గడ్డ చాలా రోజుల నుంచి లేదా ఈ మధ్యనే వచ్చిందా అనేది తెలియవలసి ఉంది.

సాధారణంగా రొమ్ములు అటూఇటూ కదిలే ఫైబ్రోఅడినోమా అనే గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే వాటిలో నొప్పి పెద్దగా ఏమీ ఉండదు. అవి మరీ పెద్దగా అయితే తప్ప, ముందు నుంచీ లేకుండా ఇప్పటికిప్పుడే కంతి అంటే సాధారణంగా అవి చీముగడ్డలు అయ్యిండవచ్చు. నుదిటి మీద కాయలు కూడా అనేక రకాల కారణాల వల్ల రావచ్చు. ఇవి ఈ మధ్యనే వచ్చాయా, లేక చాలా రోజుల నుంచి ఉన్నాయా అనేది చెప్పలేదు. ఏమైనప్పటికీ కూడా మీరు ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి కారణాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

- డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top