Ganesh Chaturthi 2023: వినాయకుడి ఒడిలో కృష్ణుడు ఉన్న దేవాలయం... ఎక్కడుందో తెలుసా?

Do You Know Malliyoor Sree Maha Ganapathy Temple in kerala - Sakshi

విశిష్ట గణపతికి ... వైవిధ్య రూపాలతో పూజలు

పురాణేతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పార్వతీ దేవికి సోదరుని వరస. వినాయకుడు పార్వతీ తనయుడు. శ్రీ కృష్ణుడు మహావిష్ణువు అవతారం. ఈ వరస మేరకు కృష్ణుడు వినాయకుని మేనమామ.అలాటి మేనమామ తన మేనల్లుడి ఒడిలో కూర్చున్న అపూర్వ దర్శనం మీకెప్పుడైనా జరిగిందా ? అలాటి పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలియాలంటే మనం కేరళలోని మళ్ళియూర్‌ వూరికి వెళ్ళాలి. అక్కడి ఆలయంలో వినాయకుని ఒడిలో బాలకృష్ణుడు ఆసీనుడై భాగవతం వింటున్న అపూర్వ దృశ్యాన్ని మనం చూడగలం.ఇటువంటి దృశ్యం మరెక్కడా దర్శించలేము.వేలసంవత్సరాల ప్రాచీనమైన ఈ ఆలయంలో బీజ గణపతి రూపంలో వినాయకుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయం ప్రసిద్ధి చెందడానికి భాగవత అంశగా ప్రసిద్ధి చెందిన శంకరన్‌ నంబూద్రియే ముఖ్య కారణంగా చెపుతారు.

శంకరన్‌ నంబూద్రి గణపతి విగ్రహం పక్కనే సాలగ్రామాన్ని పెట్టుకుని పూజిస్తూండేవారు. నిత్యం భాగవత పారాయణం చేసేవారు. ఒకనాడు ఆయనకు తన పూజలో వినాయకుని విగ్రహంలో బాలకృష్ణుని రూపం స్పష్టంగా గోచరించింది. ఆయన తాను చూసిన దృశ్యాన్ని యదాతధంగా చెక్కిన రూపమే ఈనాడు ఆ ఆలయంలో దర్శనమిచ్చే విగ్రహం. తొండం చివర నిమ్మపండు, హస్తాలలో కొడవలి, అంకుశం, తనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు చేత ధరించి తనకు మామ అయిన బాలకృష్ణుని తన ఒడిలో వుంచుకొని దర్శనానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు. గర్భగుడిలో ఇతర దైవ విగ్రహాలు ఏవీ వుండవు. భక్తుల కోరికలను తక్షణమే నెరవేర్చే వరప్రసాది మళ్ళియూరు మహాగణపతి. 

ఇక్కడ ఇష్టసిద్ధికై చేసే పూజలను ముక్కుట్రి పుష్పాంజలి అంటారు. సకల ఐశ్వర్యాలు కలగడానికి ఉదయాస్తమ పూజ జరుగుతున్నది. కష్టాలు తీరడానికి సహస్ర కలశాభిషేకం జరిపించుకుంటారు.వివాహ అడ్డంకులు లేకుండా వుండడానికీ పళ్ళమాలలు సమర్పిస్తారు. 27 కదళీ ఫలాలతో కట్టే యీ మాలను నక్షత్ర మాల అంటారు. అనారోగ్యాల నివారణకై దడి నివేదన చేస్తారు. బియ్యప్పిండి, చక్కెర, కొబ్బరి కలిపి మోదకంగా తయారు చేసి ఆవిరిలో ఉడికించి నివేదిస్తారు. దీనికే దడి నైవేద్యమని పేరు.

ఈ ఆలయంలో పితృదోష పరిహారాలు జరుపుతారు. చవితినాడు చతుర్ధియూటు అనే పితృదోష పరిహార పూజలు జరుపుతారు. సంతాన భాగ్యం కోసం పాలు పాయసం నివేదించి పూజిస్తారు. తులాభార మొక్కు లు కూడా తీర్చుకుంటారు. ఈ ఆలయంలో తొమ్మిది రోజుల ఉత్సవం ఫాల్గుణ మాసంలో ఆరంభమై చైత్రమాసంలో వచ్చే విషూ పండుగతో సంపూర్ణమౌతాయి. వినాయకచవితి పండగను ఘనంగా జరుపుతారు.కేరళలోని కొట్టాయం .. ఎర్నాకుళం మార్గంలో కురుప్పన్దర అనే చోట దిగితే 2 కి.మీ దూరంలోను, కురుప్పన్దర రైల్వేస్టేషన్‌ నుండి 1/2 కి.మీ దూరంలో మళ్లియూరు మహాగణపతి ఆలయం వున్నది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top