
చర్మ సౌందర్యానికీ డీఎన్‌ఏ ఆధారిత చికిత్సలు
అందుబాటులో అధునాతన పద్ధతులు కచ్చితమైన ఫలితాలు..
టీనేజ్ మొదలు పండు ముసలి వరకూ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని, నిత్య యవ్వనంగా ఉండాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం, వ్యాపారం, ఒత్తిళ్లు, రాత్రి షిఫ్ట్‌లలో విధులు, ఆహారం, లైఫ్ స్టైయిల్, వాతావరణ పరిస్థితుల్లో అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఖరీదైన బట్టలు, ఫ్యాషన్‌లుక్ ఉండే ఆభరణాలు ధరించినా ముఖ సౌందర్యం చాలా ముఖ్యం. మగవారిని ప్రధానంగా వేధిస్తున్న జుట్టు సమస్య, మహిళల్లో మొటిమలు, హార్మోన్ సమస్యలు కుంగదీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఇటువంటి వారి కోసం ఇప్పటికే మార్కెట్‌లో పలు రకాల చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా డీఎన్‌ఏ ఆధారిత చికిత్సలకు భాగ్యనగరం వేదికగా మారింది. డీఎన్‌ఏ అనాలసిస్‌తో సమస్యకు కచి్చతమైన కారణాలను అన్వేషించడంతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, సిటీ బ్యూరో
ప్రతి వ్యక్తికీ డీఎన్‌ఏ యూనిక్‌గా ఉంటుంది. జీన్ అనాలసిస్ చేసి, ఆ ఫలితాల ఆధారంగా చికిత్సలు తీసుకునే కొత్త పద్దతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకే రకమైన సమస్యకు అందరికీ ఒకే రకమైన చికిత్సలు అందించడం మంచిది కాదు. ఫలితాల్లోనూ తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. సామాజిక మాధ్యమాలకు ప్రభావితం కావొద్దు. సౌందర్య రంగంలో అధునాతన పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. జీన్స్ ఆధారంగా చికిత్సలు తీసుకోవడం ఉత్తమం. ఖచ్చితత్వంతో పనిచేసే అవకాశం ఉంటుంది. – డా.రేఖా సింగ్, చర్మ సౌందర్య నిపుణురాలు
హైదరాబాద్ వాసులు సౌందర్యంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. అందుకు తగ్గట్లే నగరంలో గల్లీకో బ్యూటీ పార్లర్, స్కిన్ కేర్, ఏస్తటిక్స్ వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా డీఎన్‌ఏ ఆధారిత సౌందర్య కేంద్రాలు వెలుస్తున్నాయి. పురుషుల్లో అత్యధికంగా జుట్టు రాలే సమస్యలు కనిపిస్తున్నాయి. రెండు పదుల వయసులోనే జుట్టు రాలడం మొదలైపోతోంది. వివిధ రకాల నూనెలు, ఇతర థెరఫీలను ఆశ్రయిస్తున్నారు. మహిళల్లో ముఖంపై పింపుల్స్, మచ్చలు రావడం, చర్మ సమస్యలు వస్తున్నాయి.
చదవండి: ఎంగేజ్‌మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!
బరువు పెరగడం, నిద్రలేమి, ఆహారం, వయసులో మార్పులు, హార్మోన్ సమస్యలు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీని వల్ల వ్యక్తుల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ దెబ్బతింటున్నాయని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. డీఎన్‌ఏ ఆధారిత చికిత్సల్లో వ్యక్తుల లాలాజలం నుంచి నమూనా సేకరించి డీఎన్‌ఏ పరీక్షకు పంపిస్తాం. నివేదికలు రావడానికి సుమారు నాలుగు వారాలు పడుతుంది. బాడీకాంపొజిషన్ అనాలసిస్ (బీసీఏ) చేపట్టి, వ్యక్తి ఎత్తు, వయసు ఆధారంగా ఏ పరిమాణంలో ఉండాలి, ప్రస్తుతం ఎంత ఉందనేది నిర్ధారించుకుని, ఆపై నిపుణులైన డెర్మటాలజీ, న్యూట్రిషిన్లు పరంగా చికిత్సలు అందిస్తారు.