
బాలీవుడ్ నిర్మాత, అందాల నటి దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ (Anshula Kapoor) గోర్ ధన (నిశ్చితార్థం) వేడుకలో తన దివంగత తల్లి మోనా శౌరీ (Mona Shourie)పై చూపిన ప్రేమ నెట్టింట విశేషంగా నిలుస్తోంది.
బోనీ కపూర్ మొదటి భార్య దివంగత మోనా శౌరీ కుమార్తె అన్షులా కపూర్ తన చిరకాల ప్రియుడు రోహన్ ఠక్కర్‌ను త్వరలోనే పెళ్లాడనుంది. దీనికి సంబంధించి కపూర్ కుటుంబం గోర్ ధన వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకుంది అన్షులా. ఈ క్రమంలో తన దివంగత తల్లి మోనా శౌరీ కోసం అన్షులా కపూర్ ఒక సీటును ఖాళీగా ఉంచడం, అందులో తనతోపాటు తల్లి ఉన్న ఫోటోను ఉంచడం అందరి హృదయాలను కరిగించింది. తన జీవితంలో ముఖ్యమైన రోజున తన తల్లి మిస్ అవుతున్న వైనాన్ని చెప్పకనే చెప్పింది. అమ్మ ప్రేమ.. అప్పటికీ... ఎప్పటికీ తమ చుట్టూనే ఉంటుంది. ఆమె మాట, ఆమె మాటల్లో పువ్వుల్లో ఆమె సీటులో, మా గుండెల్లో ఆమె ఎప్పుడూ శాశ్వతమే అని పోస్ట్ చేసింది. పర్పుల్ లెహంగాలో దేవకన్యలా
ఈ వేడుక కోసం అర్పితా మెహతా రూపొందించిన పర్పుల్ కరల్ లెహంగా, దానికి మ్యాచింగ్ చోళీ, దుప్పట్టాలో అన్షులా ఒక దేవకన్యలా కనిపించింది. ఆమె అందమైన మేకప్ జడతో తన లుక్‌ను అందంగా అమిరాయి. మరోవైపు, రోహన్ నల్లటి షేర్వానీలో అందంగా కనిపించాడు. అంతేకాదు జాన్వీ కపూర్ , ఖుషీ కపూర్ (బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవి పిల్లలు) తమ సోదరి అన్షులా గోర్ ధన వేడుకకు హాజరై సందడి చేశారు. కాబోయే బావగారితో ఫోటోలకు పోజులిచ్చారు. అన్షులా-రోహన్ పెళ్లి ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్నట్లు సమాచారం.
కాగా బోనీ కపూర్ మొదటి భార్య మోనాకు విడాకులిచ్చి, 1996లో హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.అర్జున్ కపూర్, అన్షులా కపూర్ మొదటి భార్య మోనా పిల్లలు కాగా జాన్వీ, ఖుషి కపూర్ శ్రీదేవి పిల్లలు.