Dhanya Sojan: ఆ ఒక్క కామెంట్‌ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది..!

Dhannya Sojan steals hearts with her verve, turns poster girl for India brides-to-be - Sakshi

21 ఏళ్ల ధన్య సోజన్‌ వధువుగా నటించిన యాడ్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ పర్సనాలిటీలతో మొదలు అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఎందుకు? ధన్య చావుతో పోరాడుతోంది. చావును గెలవాలనుకుంటోంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి, వెంట్రుకలు పూర్తిగా కోల్పోయిన స్థితి నుంచి అందమైన పెళ్లికూతురిగా మారడం ఇటీవలి గొప్ప కుతూహలపు కథ.

28 ఆగస్టు 2019లో ధన్య సోజన్‌ టొరెంటో (కెనడా)లో దిగింది. అక్కడ రెండేళ్లు పోస్ట్‌ డిప్లమో కోర్సు ఆమె చదవాలి. కేరళ ఇడుక్కి జిల్లాలోని తోడపుజ అనే చిన్న టౌన్‌ ఆమెది. తండ్రి జోసఫ్‌ మిల్క్‌బూత్‌ నడుపుతాడు. తల్లి శాంతి గృహిణి. హైస్కూల్‌లో చదివే ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి ఉన్న ధన్య బాగా చదువుకుని కెనడాలో సీటు సంపాదించుకుంది. కొన్ని నెలలు బాగా జరిగాయి.

సెమిస్టర్లు రాసింది. కాని 2020 ఆగస్టు నాటికి ఆమె వూరికూరికే స్పృహ తప్పి పడిపోవడం మొదలెట్టింది. అక్కడి డాక్టర్లు చూసి మొదట నిమోనియా అనుకున్నారు. కాని రిపోర్టులు చూసి ఆమెకు ‘కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌’ ఉందని తేల్చారు. ప్రమాదకరమైన గుండెజబ్బు. ఏ క్షణం ఏమైనా కావచ్చు. గుండె మార్పిడి తప్ప వేరే మార్గం లేదు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ధన్య. ఊరుగాని ఊరు. దేశం కాని దేశం. ఇప్పుడు ఏం చేయాలి?

హాస్పిటల్‌ రోజులు
20 ఏళ్ల హుషారైన అమ్మాయి ధన్య. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది. ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. ఆమెకు ఆక్సిజన్‌ సరిగా అందడం లేదు. జుట్టు కొన్నాళ్లు నిలవదని చెప్పారు. ఉన్న జుట్టును పూర్తిగా తొలగించారు. ఆమె స్టూడెంట్‌ వీసా మీద రావడం వల్ల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉపయోగించుకునే వీలు లేదు. అలాగని ఇంటినుంచి డబ్బు తెప్పించుకోలేదు. దారుణమైన పరిస్థితిలో పడింది ధన్య. అదృష్టం... ఆమె చేరిన హాస్పిటల్‌లో కేరళ నుంచి వచ్చిన నర్స్‌లు పని చేస్తున్నారు. వారు ధన్యను ఆదుకున్నారు. ధైర్యం చెప్పారు. ధన్య పరిస్థితిని టొరెంటోలో ఉన్న మలయాళీ సంఘం ‘హృదయపూర్వం’కు తెలియచేశారు.

హృదయపూర్వం వెంటనే ధన్య కోసం ఫండ్‌ రైజింగ్‌ మొదలెట్టింది. దాదాపు లక్షన్నర డాలర్లు (కోటి రూపాయలు) కలెక్ట్‌ అయ్యాయి. హాస్పిటల్‌ బిల్‌ అందులో నుంచే కట్టారు. అయితే సమస్య అదుపులో ఉంది కాని ట్రీట్‌మెంట్‌ కొనసాగాల్సి ఉంది. ఇండియాలో ట్రీట్‌మెంట్‌ చేయించుకోమని చెప్పారు. ఈలోపు హాస్పిటల్, యూనివర్సిటీ వాళ్ల సహకారం వల్ల హాస్పిటల్‌ నుంచి ఎగ్జామ్స్‌ రాసి పాసయ్యింది ధన్య. మార్చి వరకూ ఉంటే వర్క్‌ వీసాకు అర్హత వస్తుందని అప్పటి వరకూ అక్కడే ఉండి కొచ్చి చేరుకుంది. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా హాస్పిటల్‌కు వెళ్లి అడ్మిట్‌ అయ్యింది ధన్య.

మెరుపు కలలు
ధన్య ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా మెరుపు కలలు కనడం మానలేదు. ఆమెకు మోడలింగ్‌ చేయాలని కోరిక. అలాగే పాటలకు డాన్స్‌ చేయడం కూడా సరదా. హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉంటూ బోర్‌ పోయేందుకు కొన్ని సినిమా పాటలకు చేతులు కదిలించి డాన్స్‌ చేసి ఆ వీడియోలు రిలీజ్‌ చేసింది. అవి ఇన్‌స్టాంట్‌ హిట్‌ అయ్యాయి. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ వంటి నటులు ఆమె స్థితిని తెలుసుకుని ఆ స్థితిలో కూడా అంత హుషారుగా ఉన్నందుకు మెచ్చుకున్నారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మలుపుతిప్పిన ఘడియ
కొచ్చి చేరుకుని వైద్యం తీసుకుంటున్న ధన్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మలబార్‌ గోల్డ్‌’ వారి ‘బ్రైడ్స్‌ ఆఫ్‌ ఇండియా’ యాడ్‌ కాంపెయిన్‌ ప్రకటన కనిపించింది. ‘మీకు పెళ్లికూతురిలా కనిపించాలని ఉందా’ అనే ప్రశ్నకు 7000 మంది యువతులు ‘అవును’ అని ఉత్సాహపడి సమాధానం ఇచ్చారు. ధన్య కూడా ఇచ్చింది. ఆ సంగతి మర్చిపోయింది. కాని కొన్నాళ్లకు మలబార్‌ గోల్డ్‌ నుంచి ఆమెకు ఫోన్‌ వచ్చింది. తమ ప్రకటనల్లో కేరళ వధువుగా కనిపించమని వారు కోరారు. ధన్య సంతోషానికి అవధులు లేవు.

కేరళ క్రిస్టియన్‌ వధువుగా తెల్లగౌన్‌లో కనిపించడానికి అందుకు తగ్గ షూట్‌ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. మలబార్‌గోల్డ్‌ ఈ షూట్‌ కోసం అసలు సిసలు వజ్రాల నెక్లెస్‌ను వాడటానికి పంపింది. దానిని ధరించిన ధన్య ఎంతో ముచ్చటపడింది. ‘ఈరోజు నాకెంతో బాగుంది’ అని అద్దంలో చూసుకుని మురిసిపోయింది. ఆమె స్వచ్ఛమైన నవ్వు వధువు పాత్రకు అందం తెచ్చింది. ఇదంతా చూస్తున్న ఆమె తల్లిదండ్రులు ‘ఈరోజు మా అమ్మాయి పేషెంట్‌ అన్న సంగతే మర్చిపోయింది’ అని ఎంతో సంబరంగా ఆమెను చూశారు. నిరాశలో కూడా ఒక ఆశ చేతికి దొరుకుతుంది. అంతవరకూ ఓపిక పట్టమని ధన్య నవ్వు అందరికీ చెబుతోంది.                

విశేష స్పందన
‘స్పెషల్‌ బ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’గా మలబార్‌ గోల్డ్‌ వారు విడుదల చేసిన ధన్య యాడ్‌ విశేష స్పందన పొందింది. ఆ యాడ్‌లో ధన్య ఎంతో అందంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. ఆమె నవ్వుకు ఎందరో ఫాన్స్‌ అయ్యారు. ఇవాళ ధన్య సెలబ్రిటీ అయ్యింది. తన అనారోగ్యాన్ని గెలిచి తీరగలననే ఆత్మవిశ్వాసం పొందింది.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top