
నివాళి
‘చింపాంజీల నుంచి మనిషి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’.... ఈ మాట అనడంతో జేన్ గుడ్ ఆల్ ‘కోతి నుంచి మానవుడు పుట్టాడు’ అనే సిద్ధాంతాన్ని ఒక విధంగా ప్రశ్నార్థకం చేసింది. ‘మానవులకు అతి సమీపంగా నివసించే చింపాంజీల గురించి నేను పరిశోధన చేసే వరకూ లోకానికి ఏమీ తెలియదు’ అంటుంది జేన్ గుడ్‌ఆల్. ఈ బ్రిటిష్ పర్యావరణవేత్త ఆఫ్రికాలో చింపాంజీల గురించి ‘సుదీర్ఘమైన’ ఫీల్డ్‌వర్క్ చేసింది. 91 సంవత్సరాల వయసులో అక్టోబర్ 1న కన్ను మూసిన జేన్ గుడ్‌ఆల్
ఎందరో పర్యావరణ ప్రియులకు స్ఫూర్తి.
‘చింపాంజీలను చూసి బిడ్డకు తల్లి ఇవ్వాల్సిన భరోసాను నేర్చుకోవచ్చు. చింపాంజీలలో తల్లి తన బిడ్డను ఎప్పటికీ వదలదు... అది పెద్దయ్యి రెండు మూడు నమ్మదగ్గ స్నేహితులను సం పాదించుకునే వరకు. అలాగే తగువులాడి తిరిగి కలిసి పోవడంలో చింపాంజీలు చాలా పెద్ద మనసు చూపుతాయి. మనుషులు కొట్లాడుకుంటే తిరిగి కలిసే విషయంలో చాలా భేషజం చూపుతారు’ అంటారు జేన్ గుడ్ ఆల్. టాంజానియాలో 1960 నుంచి 30 ఏళ్లకు పైగా చింపాంజీల గురించి పరిశోధన చేసిన జేన్ గుడ్ ఆల్ ఇంగ్లాండ్‌లోని బోర్‌మెత్ అనే పట్టణంలో జీవిస్తూ అమెరికా పర్యటనలో అక్కడే కన్నుమూశారు.
ఎవరు జేన్ గుడ్ ఆల్?
జేన్ గుడ్ ఆల్ పూర్తి పేరు వాలెరీ జేన్ మోరిస్–గుడ్ ఆల్. 1934 ఏప్రిల్ 3న లండ న్ లో జన్మించారు. తండ్రి హార్బర్ట్ మారిస్ వ్యా పారి. తల్లి మార్గరెట్ జోసెఫ్ నవలా రచయిత్రి. సంపన్న కుటుంబంలో పుట్టిన గుడ్ ఆల్ కోసం ఓసారి ఆమె తండ్రి ‘జూబ్లీ’ అనే చింపాంజీ బొమ్మను కానుకగా ఇచ్చాడు. దాన్ని చూసి తోటివాళ్లు భయపడి అసహ్యించుకున్నా గుడ్ ఆల్ మాత్రం ఆ΄్యాయంగా హత్తుకుంది. తనకు చింపాంజీల మీద ప్రేమ కలిగేందుకు కారణమైన తొలి సంఘటన అదే అంటారామె. 1957లో కెన్యాలో తన స్నేహితురాలి పొలానికి వెళ్లడం జేన్ గుడ్ ఆల్ జీవితంలో మేలి మలుపు. అక్కడ కెన్యా పురావస్తు శాస్త్రవేత్త, పాలియెంటాలజిస్ట్ (శిలాజాల అధ్యయనవేత్త) అయిన లూయిస్ లీకీని ఆమె కలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన కోతులపై అధ్యయనం చేస్తున్నారు. తన అధ్యయానికి గుడ్‌ఆల్ సహకారం అందించగలదని ఆయన భావించారు. అలా ఆయన వద్ద ఆమె సెక్రటరీగా చేరారు. ఆయన వద్ద పని చేస్తున్న సమయంలో ఆమె ఓర్పు, నేర్పులను పరిశీలించిన ఆమెను టాంగన్యికా (ప్రస్తుతం టాంజానియా) కు పం పారు లూయీస్ లీకీ.
అదే ఆమె కార్యక్షేత్రం
1960 జూలై 14న గుడ్ ఆల్ తొలిసారి టాంజానియాలోని గోంబే స్ట్రీమ్ నేషనల్ పార్క్‌కు వెళ్లారు. అది ఆమె జీవితానికి కీలకమైన ఘట్టం. ఆ సమయంలో ఆమె తల్లి కూడా వెంట ఉండి, ఆమెను తన కెరీర్లో ప్రోత్సహించడం చెప్పుకోదగ్గ విషయం. అడవుల్లో తిరుగుతూ, జంతువులను మచ్చిక చేసుకుని, వాటిపై పరిశోధన చేయడం మగవాళ్ల పని అని భావించే కాలంలో తల్లి తనకు అందించిన సహకారానికి కృతజ్ఞత తెలిపేవారు.
గోంబే స్ట్రీమ్ నేషనల్ పార్క్‌లోని ‘కసకేలా చింపాంజీ కమ్యూనిటీ’తో ప్రారంభించి చింపాంజీ సామాజిక, కుటుంబ జీవితాన్ని అధ్యయనం చేశారు గుడ్‌ఆల్. చింపాంజీలు కేవలం జంతువులు అన్న ధోరణిని కాదని, ‘వాటికి కూడా వ్యక్తిత్వం ఉంది. చింపాంజీలకూ ఆనందం, దుఃఖం వంటి భావోద్వేగాలు ఉంటాయి’ అని ఆమె కనుగొన్నారు. మానవ చర్యలుగా భావించే కౌగిలింతలు, ముద్దులు, వీపుమీద తట్టడం, చక్కిలిగింతలు చిం పాజీల్లోనూ ఉంటాయని గమనించారు. ఇదంతా ఒక్క రోజులో సాధ్యపడ్డ సంగతి కాదు. ఎన్నో రోజుల పాటు వాటి మధ్య మెలిగి, వాటిని గమనిస్తూ తెలుసుకున్న సంగతులు.
ఆమె పరిశోధనలు
గుడ్‌ఆల్ చేసిన పరిశోధనల కారణంగా అప్పటి దాకా చింపాంజీల గురించి ప్రపంచం నమ్మిన రెండు విషయాలు అబద్ధాలని తేలింది. ఒకటి చింపాంజీలు శాకాహారులు అనుకోవడం, మరొకటి చింపాంజీలు ఏ సాధనాలనూ తయారు చేయలేవు అని భావించడం. అయితే చింపాంజీలు చెదపురుగులను తినడాన్ని ఆమె గమనించారు. చింపాంజీలు చెట్ల నుండి కొమ్మలను తీసుకొని ఆకులను తీసేసి, వాటిని తమ కోసం వాడుకోవడం గుర్తించారు.
మనుషులు మాత్రమే ఒక వస్తువు నుంచి మరో వస్తువు తయారు చేయగలరన్న విషయం అబద్ధమని, చింపాంజీలకూ ఆ శక్తి ఉందని నిరూపించారు. చింపాంజీ దళాల్లో దూకుడు, హింస, అడవిలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇతర ఆడపిల్లల పిల్లలను ఉద్దేశపూర్వకంగా చంపడం వంటివన్నీ గుడ్‌ఆల్ చేసిన పరిశోధనల ద్వారానే ప్రపంచానికి తెలిశాయి. 1990లో ఆమె రాసిన ‘త్రూ ఎ విండో: మై థర్టీ ఇయర్స్ విత్ ది చింపాంజీస్ ఆఫ్ గోంబే’లో ఆ అనుభవాలన్నీ ఆమె పొందుపరిచారు.
చింపాంజీల ఫ్రెండ్
చింపాంజీలు మనుషుల్ని అంత సులభంగా తమతో కలుపుకోవు. అయితే గుడ్‌ఆల్‌ని మాత్రం తమ తోటి ప్రాణిగానే భావించాయి. ఏళ్ల తరబడి వాటితో మమేకమై పోయిన ఆమె వాటి కోసం ఎంతో తపన పడేవారు. ’ఖీజ్ఛి ౌn y జిuఝ్చn ్ఛఠ్ఛిట ్చఛిఛ్ఛిp్ట్ఛఛీ జీn్టౌ ఛిజిజీఝp్చn్డ్ఛ్ఛ టౌఛిజ్ఛ్టీy’ అంటూ అందరూ ఆమెను పొగిడేవారు. చింపాంజీలకు పేర్లు పెట్టడం, వారి మధ్య గొడవలు వస్తే తీర్చడం, వాటి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వాటి మూడ్‌ని బట్టి వాటికి ఇష్టమైన పనులు చేయడం, వాటితో కలిసి షికారుకు వెళ్లడం వంటివన్నీ ఆమె చేసేవారు.
చింపాంజీల మీద జరిగే పరిశోధనల కోసం ‘జెన్ గుడ్‌ఆల్ ఇ న్ స్టిట్యూట్’ను స్థాపించిన ఆమె రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చింపూగా చింపాంజీ రిహాబిలిటేషన్ కేంద్రం ప్రారంభించారు. ఇందులో వందలాది చింపాంజీలను సంరక్షిస్తున్నారు. అడవుల నరికివేత కారణంగా తిండి, నివాసం కోల్పోయిన చింపాంజీలను గుర్తించేందుకు, వాటి పట్ల జనానికి అవగాహన కల్పించేందుకూ గుడ్ ఆల్ చర్యలు చేపట్టారు. దేశవిదేశాల్లో అనేక సదస్సులు నిర్వహించి పర్యావరణ పరిరక్షణ గురించి, చింపాంజీల జీవన విధానం గురించి వివరించారు. ఆమె కృషికి ఫలితంగా అనేక అంతర్జాతీయ పురస్కారాలు ఆమెను వరించాయి. ‘సృష్టిలో ప్రాణులన్నీ సమానమే. ఇందులో మనిషి అధికుడు, జంతువులు తక్కువ అన్న భావన సరికాదు. మనం ప్రేమ పంచగలిగితే అందుకునేందుకు మూగజీవులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి’ అనేది ఆమె మాట.