చుట్టు పక్కల చూడరా..! | The connections and intimacy of yesteryear are gone | Sakshi
Sakshi News home page

చుట్టు పక్కల చూడరా..!

Jan 27 2025 12:10 PM | Updated on Jan 27 2025 12:10 PM

The connections and intimacy of yesteryear are gone

నాటి అనుబంధాలు, ఆత్మీయతలు కరువు

ఎవరికి ఎవరో అన్నట్లు జీవనం

ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే కారణం

 ఇరుగు పొరుగు పలకరించుకోని వైనం

ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తున్న నాటి పెద్దలు

కర్నూలు: మానవ సంబంధాల పేరుతో మనిషన్నవాడు మాయమవుతున్నాడు. అందరూ బాగుంటేనే సమాజం అన్న ధోరణి నుంచి నా కుటుంబం బాగుంటే చాలనే ధోరణితో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో చివరికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లలను సైతం దూరం చేసుకుంటున్నాడు. కేవలం భార్యాబిడ్డలు బాగుంటే చాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు పక్కింట్లో పెళ్లంటే ఆ వీధిలో ఉన్న వారందరూ తలోచేయి వేసి ఇంట్లో మనుషుల మాదిరిగా పనులు చేసేవారు. ఇప్పుడు అయిన వారు కూడా చుట్టపుచూపుగా వస్తున్నారు. 

అయిన వారు అందరూ ఉన్నా పనులన్నీ ఈవెంట్‌ మేనేజర్లు చూసుకుంటున్నారు. పట్టణీకరణ పేరుతో మనుషులు దూరం అవుతున్నారు. కానీ ఇప్పటికీ పల్లెలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఒకప్పటి అనుబంధాలు, ఆత్మీయతలు కొనసాగుతుండటం గమనార్హం. ఉన్నత చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు మనుషులను దూరం చేయడానికా లేదా దగ్గర చేయడానికా అని ఆనాటి పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఎవ్వరికై నా ఏదైనా కష్టం వస్తే బంధువుల కంటే ముందు ఇరుగుపొరుగు వారే ముందుగా వచ్చి ఆదుకునేవారు.

 ఇంట్లో ఎవ్వరైనా చనిపోతే పక్కింటి వారే ఆ కుటుంబానికి అవసరమైన ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లలో, అద్దె ఇళ్లల్లో సైతం మృతదేహాన్ని ఉండనీయని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, చిన్న కుటుంబాలు ఏర్పడటం, చిన్నతనంలో పిల్లలను హాస్టల్‌లో, వృద్ధాప్యంలో పెద్దలను ఆశ్రమాల్లో ఉంచడంతో కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి. ఉన్నత చదువుల పేరుతో ఆధునికత సంతరించుకోవడంతో ఎవ్వరికి వారే అన్న రీతిలో సమాజంలో జీవిస్తున్నారు.

                     సమాజంలో ప్రస్తుతం మానవసంబంధాలు ఎలా ఉన్నాయో ఈ సంఘటనలే నిదర్శనం.

  1.  నంద్యాల పట్టణంలో ఇటీవల ఓ వ్యక్తి తన కుమారుడి వివాహం చేశారు. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎక్కువ మంది వస్తారని పెద్ద ఫంక్షన్‌ హాల్‌, పెళ్లి భోజనంలో రకరకాల స్వీట్లు, వంటకాలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి ముందు రోజు కూడా పెద్దగా బంధువులు, మిత్రులు రాలేదు. తలంబ్రాల సమయానికి హడావుడిగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి తెచ్చిన గిఫ్ట్‌లను చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆహార పదార్థాలు భారీగా మిగిలిపోవడంతో అనాథశ్రమానికి పంపించేశారు. 

  2. కర్నూలు నగరానికే చెందిన రాజ్‌కుమార్‌ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. మూడేళ్ల క్రితం అతని తల్లి అనారోగ్యంతో మరణించింది. విషయం తెలిసిన ఇంటి యజమాని మృతదేహాన్ని ‘మా ఇంట్లో ఉంచొద్దని, మీ బంధువుల ఇళ్లకు తీసుకెళ్లు’ అని గొడవ చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినలేదు. దీంతో తప్పనిసరై నగరంలోని తన సోదరుని ఇంటికి అప్పటికప్పుడు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

  3. ఎమ్మిగనూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పిల్లల చదువుల కోసం కర్నూలులో ఉంటున్నారు. ఆ వీధిలో అతను దాదాపు పదేళ్లుగా ఉంటున్నాడు. అయితే చుట్టు పక్కల వారితో ఇంత వరకు ఆయన మాట్లాడలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఉదయాన్నే విధులకు వెళ్లడం, సాయంత్రం ఇంటికి రావడం, కుటుంబీకులతో గడుపుతారు. పక్క ఇళ్లల్లో శుభకార్యం జరిగినా వెళ్లింది లేదు.. ఆపద వచ్చినా పలకరించింది లేదు.

నిలవని ప్రేమ వివాహాలు..
తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమవివాహాలు చేసుకోవడం ఇటీవల కాలంలో అధికమైంది. కొందరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటూ వేరుగా ఉంటున్నారు. ఆ తర్వాత ఏడాది, రెండేళ్లకే విడిపోయి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వారానికి రెండు, మూడు కేసులైనా అమ్మాయి మిస్సింగ్‌ అని నమోదవుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఇటీవల అధికంగా చూస్తున్న పోలీసులు చాలా మంది అమ్మాయిని వెతకడం అటుంచి రెండురోజులకు వారే వస్తారులే అన్న ధోరణితో మాట్లాడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో వచ్చే చిన్న చిన్న మనస్పర్థలను సర్దిచెప్పేవారు లేక రెండు, మూడేళ్లకే విడిపోతున్నారు. పోలీస్‌స్టేషన్‌లు, వన్‌స్టాప్‌ సెంటర్లు, ఐసీడీఎస్‌ కార్యాలయాల్లో ఇలాంటి వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించే ఉదంతాలు ఇటీవల అధికమయ్యాయి.

పలకరించి ఎన్నాళ్లైందో..
ఒకప్పుడు ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండిపోయేవారు. సమయానికి భోజనం చేయాలన్న విషయం కూడా మరిచిపోయేవారు. కుటుంబంతో పాటు ఊళ్లో, సమాజంలో ముచ్చట్లు, రాజకీయాలు, సినిమాలు అన్నీ ఈ మాటల్లో కనిపించేవి. కానీ ఇప్పుడు ఇంటికి ఎవ్వరైనా వస్తే ముఖస్తుతిగా పలకరించి రెండు నిమిషాలు మాట్లాడి వదిలేస్తున్నారు. ఎవ్వరి మొబైల్‌లో వారు బిజీగా గడుపుతున్నారు. ఎదురుగా ఉన్న వారిని పలకరించే సమయం లేకపోయినా ఎక్కడా కనిపించని వారిని సోషల్‌ మీడియాలో పలకరించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

కష్టమొస్తే భరోసానిచ్చే చేతుల్లేవు..
నాగరికత వెంట పరుగులు పెడుతున్న మనుషుల మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో ఎవ్వరికి వారు వేరుగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో 40కి పైగా కుటుంబాలున్నా.. కష్టమొస్తే పలకరించేవారు ఎవ్వరూ రాని పరిస్థితి నెలకొంది. కానీ పండుగలు, చిన్నచిన్న శుభకార్యాలు మాత్రం చేసుకుని ఎంజాయ్‌ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవ్వరికై నా ఆరోగ్యం బాగాలేకపోతే అయిన వారే పలకరించే దిక్కులేదు. బంధువులు, స్నేహితులు సైతం సోషల్‌ మీడియాలో మాత్రమే పరామర్శలు చేస్తున్నారు. ఇంటికి వచ్చి ధైర్యం చెప్పేవారు కరువైపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement