బాల్యానికి రాబందులుగా కాదు... బంధువులుగా ఉందాం! | Child rights activist visits jawahar nagar dumping yard | Sakshi
Sakshi News home page

బాల్యానికి రాబందులుగా కాదు... బంధువులుగా ఉందాం!

Jun 12 2025 1:07 AM | Updated on Jun 12 2025 1:07 AM

Child rights activist visits jawahar nagar dumping yard

నేడు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం

నింగిలోని చుక్కలతో ఏనుగును చిత్రించుకోవడం... చందమామలో చెవుల పిల్లిని ఊహించుకోవడం...  తొడుక్కున్న బట్టలను మాపుకోవడం.. చెట్లు, పుట్టలెక్కడం.. గెంతడం... ఒకరినొకరు గేలిచేసుకోవడం..  ఏడిపించుకోవడం.. యథేచ్ఛగా ఆడుకోవడం...  పితూరీలు, అలకలు, ఉరకలు, పరుగులు... ‘బాల్యం’ అని మనసులో గూగుల్‌ చేస్తే మెదిలే ఇమేజెస్‌ అవి! నిజంగా పిల్లలందరూ అంత లగ్జరీ అనుభవిస్తున్నారా అని  అనుకునేలోపే ముంబైలో ధారావీ, హైదరాబాద్‌లో జవహర్‌ నగర్‌ లాంటి ప్రాతాలు స్ఫురణకు వస్తాయి! ధారావీ ఎక్కడో దూరం కాబట్టి రెండు రాష్ట్రాలకు సుపరిచితమైన జవహర్‌ నగర్‌ను సందర్శిద్దాం... ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా!

‘పిల్లల చేతుల్లో ఉండాల్సింది పలక.. బలపం లేదంటే పెన్ను.. పుస్తకం అంతేకానీ పనిముట్లు కాదు’ అంటారు నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుంకట్టిన ఉద్యమనేత కైలాశ్‌ సత్యార్థి. కానీ జవహర్‌ నగర్‌లోని చాలామంది పిల్లల చేతుల్లో పుస్తకాలు కనిపించవు. పనిముట్లే కనిపిస్తాయి. అది నూరు బస్తీల ప్రాతం. దేశంలోని అన్ని ప్రాతాల నుంచి వచ్చిన వలసలతో మినీ ఇండియాను తలపిస్తుంది. వాళ్లలో చాలామందికి ఆధార్‌లాంటి గుర్తింపు పత్రాలేమీ ఉండవు. వాళ్లు ఏ లెక్కల్లోకీ రాక స్కూల్‌ అడ్మిషన్‌ నుంచి ప్రభుత్వ సంక్షేమ, ప్రయోజనాల దాకా ఏవీ వారికి అందట్లేదు. దాంతో చాలామంది పిల్లలు బాలకార్మికులై కనిపిస్తారు.. ఈ జవహర్‌నగర్‌కి ఆనుకునే ఉన్న 350 ఎకరాల డంపింగ్‌ యార్డ్‌లో చెత్త ఏరుకుంటూ.. భవన నిర్మాణ కార్మికులుగా.. అమ్మాయిలైతే ఇళ్లల్లో పనిచేస్తూ! ఇంకా సీజనల్‌ లేబర్‌గా కూడా! వసివాడని ఈ పిల్లలు గంజాయికి బానిసలై కూడా కనిపిస్తారు.

మూడు లక్షల జనాభా...
ఈ వంద బస్తీల్లో దాదాపు మూడు లక్షల జనాభా ఉంటుంది. సర్కారు బడులు పది మాత్రమే. అందులో ఎనిమిది ప్రైమరీ స్కూళ్లు, రెండు హైస్కూళ్లు. ఇది కా్రపా మండలం కిందకు వస్తుంది. ఈ మండలానికి కనీసం ఒక్క జూనియర్‌ కాలేజ్‌ కూడా లేదు. అందుకే స్కూల్‌కి వెళ్లే పిల్లలు కూడా టెన్త్‌ అవగానే అబ్బాయిలైతే కూలీలుగా మారుతున్నారు. అమ్మాయిలకైతే పెళ్లి చేసి పంపించేస్తున్నారు. పద్నాలుగు నుంచి పద్దెనిమిదేళ్లలోపు అమ్మాయిలకు పెళ్లిళ్లయి పోతున్నాయి. ఇది హైదరాబాద్‌ నగరంలోని పరిస్థితి! ఇలా మన దేశమంతటా సుమారు పద్దెనిమిది లక్షల నుంచి ముప్పైమూడు లక్షల వరకు బలకార్మికులు ఉన్నారని యూనిసెఫ్‌ డేటా వెల్లడిస్తోంది. వీళ్లంతా వ్యవసాయరంగంలో, కుటుంబ వ్యాపారాల్లో పనిచేస్తున్నారని నివేదిక తెలుపుతోంది. అయిదు నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలంతా ఏదో ఒక పనిచేస్తున్నారని కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ వెల్లడించింది.  

చట్టం ఏం చెబుతోంది?
ద చైల్డ్‌ లేబర్‌  ప్రొహిబిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్, 1986 ప్రకారం పద్నాలుగేళ్లలోపు పిల్లల చేత ఎలాంటి పనైనా చేయించడం నేరం. పద్నాలుగేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలకు పనివ్వొచ్చు. కానీ ప్రమాదకరమైన వృత్తులు.. పనులు.. పరిస్థితుల్లో ఆ పిల్లలను పెట్టకూడదు. ఈ చట్టానికి కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. కుటుంబ వ్యాపారాలు, నిర్దిష్ట పరిస్థితుల్లో టీవీ, సినిమాలు వంటి వినోద రంగాల్లో పిల్లల పనిచేయవచ్చు.

అమ్మాయిలే ఎక్కువ..
ప్రపంచవ్యాప్త బాలకార్మికుల్లో ప్రతి పదిమందిలో ఒకరు మన దేశం నుంచే కనిపిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో బాలకార్మికుల(5–14 ఏళ్లలోపు) సంఖ్య కోటికి పైనే ఉంది. అంటే అప్పటి పిల్లల జనాభాలో ఇది 3.9 శాతం. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలే ఎక్కువగా పనిబాట పడుతున్నారని యూనిసెఫ్‌ సర్వే చెబుతోంది. ఇళ్లల్లో పని దగ్గర్నుంచి ఇంట్లో పెద్దవాళ్ల (అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు)ను చూసుకోవడం, తోబుట్టువులను సంభాళించడం వంటివన్నీ చేస్తున్నారన్నది నివేదికల మాట. మన దేశంలో బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాతాల్లో బాలకార్మికులు ఎక్కువ. ఇటుక బట్టీలు, తీవాచీ, వస్త్ర పరిశ్రమ, ఇళ్లు, హోటళ్లు.. టీ స్టాళ్లు లాంటి అసంఘటిత రంగాల్లో, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల్లో బాలకార్మికులు ఎక్కువగా కనిపిస్తారు.

బాలకార్మిక వ్యవస్థ వేళ్లూనడానికి కారణాలు 
అసమానత్వం, సరైన విద్యావకాశాలు, మంచి పని, సామాజిక భద్రత లేకపోవడం, సంప్రదాయ, సాంస్కృతిక చట్రాలు వంటివన్నీ బాలకార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయి. ఏ రూపాల్లో ఉన్నా 2025 కల్లా బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించాలనే యునైటెడ్‌ నేషన్స్‌ లక్ష్యానికి మద్దతు తెలుపుతూ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్డీజీఎస్‌) భారత ప్రభుత్వమూ సంతకం చేసింది. సంతకం చేయగానే సరిపోదు చిత్తశుద్ధితో ఆ బాధ్యతను నెరవేర్చాలి. పిల్లలందరినీ బడి బాట పట్టించి బాలకార్మికులు లేకుండా చేయడానికి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి అంటున్నారు బాలల హక్కుల కార్యకర్తలు.
                                    ∙

రెస్క్యూ, రిహాబిలిటేషన్‌ వీక్‌గా ఉంది
జవహర్‌ నగర్‌లోని డంపింగ్‌ యార్డ్‌కి ఆనుకున్న బస్తీల్లో స్క్రాప్‌ షాప్స్‌ ఎక్కువ. అందుకే ఇక్కడ చెత్త సేకరణ ఎక్కువగా జరుగుతుంది. ఇవి కాకుండా కన్‌స్ట్రక్షన్‌ లేబర్, డొమెస్టిక్‌ హెల్ప్, సీజనల్‌ లేబర్‌కి కూడా వెళ్తుంటారు. ఈ ప్రాతంలో సరిపడా సర్కారు బడులు లేవు. ఉన్నవాటిల్లో చేరడానికి చాలామంది పిల్లలకు గుర్తింపు పత్రాలు లేవు. వాళ్లకు ప్రైవేట్‌ స్కూళ్లల్లో అడ్మిషన్స్‌ దొరికినా ఫీజులు కట్టేంత స్థోమత ఉండదు. దాంతో పనిలోకి వెళ్తున్నారు. పద్నాలుగేళ్లు దాటిన పిల్లలు గనుక ఒక్కసారి పనిలోకి వెళితే మళ్లీ వాళ్లను చదువు వైపు మళ్లించడం చాలా కష్టం. ఇక్కడ వార్డ్‌ లెవెల్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కమిటీలు (డబ్ల్యూఎల్‌సీపీసీ) కూడా యాక్టివ్‌గా లేవు. దీనివల్ల బాలకార్మికుల రెస్క్యూ, రిహాబిలిటేషన్‌ చాలా వీక్‌గా ఉంది. 
– హిమబిందు, పిల్లల హక్కుల కార్యకర్త 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement