రోజంతా గోదావరి ఒడ్డున విజిల్‌ ఊదుతూ..

Chandra Kishor Patil Stops People Dump Garbage in Godavari River - Sakshi

ఇష్టమైంది తిని, ఇష్టమొచ్చినట్లు బతికి, ఏదో ఒక రోజు వెళ్లిపోదాం అన్నట్లే ఉంటున్నారు మనుషులు. మంచి చెబితే అస్సలు సహించలేక పోతున్నారు. ‘మీరూ మనుషులే కదా, మీది మానవ జాతి కాదన్నట్లు మాకు మంచి చెబుతున్నారెందుకు?’ అన్నట్లే చూస్తున్నారు! ఇద్దరు చికాగో సిస్టర్స్‌ ఈమధ్య ఒక షూస్‌ స్టోర్‌ లో.. ‘మాస్క్‌ పెట్టుకోండమ్మా’ అని మంచి చెప్పిన సెక్యూరిటీ గార్డుని కసాబిసా 27 సార్లు కత్తితో పొడిచేశారు. ‘సాక్షి: టీవీ గరం గరం వార్తల్లో ఊరంతా తిరుగుతూ మొత్తుకుంటుండే ‘గోపి సర్‌’ గారి చిత్తూరు యాసలో చెప్పాలంటే ఆ కసాబిసా సిస్టర్స్‌లో ఒక పాపకు 21 ఏళ్లు, ఇంకొక పాపకు 18. గోపీ సర్‌ అందర్నీ ‘పాప’ అనే అంటాడు. వయసు చూసుకోబళ్ళా.. అది లేదు సర్‌ దగ్గర. ఆయనా అంతే. మంచి చెప్పబోయి ఈ నడుమ ఎవరితోనో అమాంతం పైకి లేపించుకున్నాడు. సర్‌ని కాలర్‌ పట్టి లేపి నేలకు కాళ్లందకుండా చేశాడు సర్‌ చేత మంచి చెప్పించుకున్న ఆ మనిషి. గోపీ సర్‌ లానే నాసిక్‌లో చంద్ర కిషోర్‌ పాటిల్‌ అనే ఒక మంచాయన ఒక రోజంతా గోదావరి నది బ్రిడ్జి మీద నిలబడి నదిలో చెత్త పారేయడానికి క్యారీ బ్యాగుల్ని మోసుకొచ్చేవాళ్లను అడ్డుకున్నాడు. (చదవండి: ఆ గేయం వెనకనున్న గాయాలెన్నో?!)

చెత్త విసిరేయబోతుంటే పెద్దగా విజిల్‌ ఊదేవాడు. వాళ్లు వింతగా, విడ్డూరంగా చూసేవాళ్లు. ఇతడు వెళ్లి మంచి చెప్పేవాడు. నదిలోకి చెత్త విసరొద్దనే వాడు. విసిరితే నది కలుషితం అవుతుందని చెప్పేవాడు. విసిరిన చెత్తవల్ల ప్రవాహ వేగం తగ్గుతుందని దిగులుగా ముఖం పెట్టేవాడు. ‘నువ్వేమైనా మోదీవా? చెత్త గురించి స్పీచ్‌ ఇస్తున్నావ్‌’ అని వాళ్లు. ఎలాగో కన్విన్స్‌ చేసి బ్రిడ్జి పైనే ఓ పక్కకి చెత్త పెట్టించేవాడు.. నదిలోకి విసరకుండా. ఒక రోజంతా ఇలా గడిచింది. రెండో రోజు గోపీ సర్‌.. అదే.. చంద్ర కిశోర్‌ పాటిల్‌ సర్‌ కనిపించలేదు! ఏమైందో తెలీదు. తర్వాత ఒక రోజు ట్విట్టర్‌లో కనిపించాడు. ఐ.ఎఫ్‌.ఎస్‌. ఆఫీసర్‌ శ్వేత.. బ్రిడ్జి మీద ఉండగా ఎవరో తీసిన అతడి ఫొటోను టాగ్‌ చేస్తూ.. ‘ఇతడు రోజంతా గోదావరి బ్రిడ్జి పై విజిల్‌ ఊదుతూ నిలబడి ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశాడు’ అని ట్వీట్‌ చేశారు. ప్రజలకేమైనా పిచ్చా.. సాటి పౌరుడొకడు వచ్చి చెబితే చైతన్యవంతులు అవడానికి!! చంద్ర కిషోర్‌ పాటిల్‌ అనే ఆ మంచివాడు ఇప్పుడు ఏ నది ఒడ్డున ఉన్నాడో! నైస్‌ గై పాపం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top