మనం మైసూర్ వెళ్తే 1008 మెట్లకి పసుపు కుంకుమ రాస్తూ మహిషాసుర మర్దినీ స్తోత్రాన్ని భక్తితో స్మరిస్తూ మెట్లు ఎక్కుతుంటారు భక్తులు. ఇలా మెట్లెక్కి దేవి దర్శనం చేసుకోవడం అనేది అమ్మ అనుగ్రహం ఉంటే కానీ జరగదని భక్తుల నమ్మకం. అలాగే దేవి నవరాత్రులు రోజులు వస్తే దేశం అంతటా వినబడే పేరు మైసూరు చాముండేశ్వరి ఉత్సవాలు. విదేశాల నుంచికూడా యాత్రికులు వచ్చి ఆసక్తితో చూస్తారు. ఏనుగు అంబారీ మీద మైసూరు రాజుల ఊరేగింపు ఎంతో ప్రసిద్ధి. మైసూరు మహా నగరంలో చాముండా పర్వతం మీద కొలువై ఉన్నారు చాముండేశ్వరీ దేవి.
ఈ పర్వతాన్ని మొదట్లో మహాబల గిరి అని పిలిచేవారట. జగన్మాత చాముండేశ్వరి అవతారం ఎత్తి మహిషాసురుడిని వధించడంతో చాముండ పర్వతంగా పేరు పడింది. అమ్మచేతిలో మరణించే ముందు – ముందుగా తనకే దేవి భక్తులు పూజ చేసి దేవి దర్శనానికి వెళ్లాలని వరం పొందాడు మహిషాసురుడు. ఇప్పటికి జగన్మాత చాముండేశ్వరి దేవి దర్శనానికి వెళ్తున్నప్పుడు ముందుగా మహిషాసురుని దర్శించుకుని ఒక పుష్పాన్ని సమర్పిస్తారు. చాముండేశ్వరి దేవాలయం పక్కనే మహిషాసురుడి భయంకరమైన ప్రతిమ ఉంటుంది.
శ్రీ చాముండేశ్వరి దేవాలయానికి మెట్ల దారి గుండా నడిచి వెళ్ళవచ్చు. బస్సు సౌకర్యం కూడా ఉంది. ఏడు అంతస్తులతో నిర్మించిన ఈ దేవాలయం శిల్ప కళా వైభవంతో అద్భుతంగా ఉంటుంది. ఏడవ అంతస్థు అర్ధ వృత్తాకారంగా ఉంటుంది. కలశ గోపుర ప్రతిష్ట గావించారు. ఆలయ ప్రవేశ ద్వారం అంతరాలయం దాటి గర్భగుడిలో వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవిని చూడడానికి రెండు కన్నులు చాలవు.
దేవి దర్శనానికి వెళ్తున్నప్పుడు అరటి పండ్లు, పువ్వులు, పచ్చ రంగు చీర గాజులు కుంకుమ బియ్యం మల్లెపూల దండ దేవి సమర్పించి భక్తులు తమ కోరికలు విన్నవించుకుంటారు. ఆ తరువాత ఉద్దనహళ్లి వెళ్లి చాముండేశ్వరి దేవి సోదరి జ్వాలాముఖి త్రిపుర సుందరీ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఇక్కడ దేవి ఉగ్రరూపిణిగా దర్శనం ఇస్తారు. శ్రీ చాముండేశ్వరి దేవాలయం దగ్గర మహా నందీశ్వరుని పెద్ద శిల్పం జీవ కళ ఉట్టి పడుతుంటుంది. దేవాలయాన్ని పెద్ద పెద్ద నల్లని రాతి పలకలతో నిర్మించారు.
సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం ఇది. మొదట్లో రాజ వంశస్థులకి మాత్రమే దేవి దర్శనం ఉండేది. ఆ తరువాత ప్రజలకి జగన్మాత దర్శనం అనుగ్రహం లభించింది. మైసూరు రాజులూ చామరాజ, ఒడయార్ వంశస్థులు దేవి దాసులు అయ్యారు. ఇప్పటికి రాజవంశీకుల ఆధ్వర్యంలోనే దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ చాముండేశ్వరి దేవిని దర్శించుకుని కొల్లూరు శ్రీ మూకాంబిక దేవి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. ఆ ఆలయం ఇక్కడకు దగ్గర కూడా.
– ఈఎస్ మాధవన్, విశాఖపట్నం
(చదవండి: సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..)


