Chaganti Koteswara Rao: పుణ్యమైనా, పాపమైనా ఆ నలుగురికే!.. పది మంది క్షేమాన్ని కోరగలిగిన గుణం ఉండాలి

Brahmasri Chaganti Koteswara Rao On How Good Will Help You - Sakshi

గురువాణి

ఆ  నలుగురు...

అది మంచి పని కానీయండి, చెడ్డపని కానీయండి. మంచి పని చేస్తే కీర్తి వస్తుంది. మనిషి వృద్ధిలోకి వస్తాడు. చెడ్డ పని చేస్తే అపకీర్తి వస్తుంది, పాడయిపోతాడు. అయితే ఒక పని జరిగింది అన్నప్పుడు ఆ పని వెనుక నలుగురు ఉంటారంటుంది శాస్త్రం. ఎవరా నలుగురు! చేసేవారు, చేయించేవారు, ప్రేరేపించేవారు, ఆమోదించేవారు. జరిగిన పనికి వచ్చిన ఫలితాన్ని.. వాటి వలన వచ్చే పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు సమానంగా పంచుకుంటారు. 

ఒక్కోసారి చెడ్డపని జరగకుండా ఆపే ప్రయత్నం కూడా మంచిపనే.  మంచి పని జరగకుండా చూడడం తప్పు. చెడ్డ  పని జరగకుండా చూడడం ఒప్పు. శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. పదిమంది క్షేమాన్ని కోరగలిగిన గుణం ఉండాలి. భవిష్యత్తులో ఆపదలు రాకుండా ఉండాలన్న దీర్ఘదృష్టిని పొంది ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్ప చెడ్డపనిని ఆపడం సాధ్యం కాదు. 

మొదట చేసాడు కనుక. తరువాత లోభాన్ని గెలిచాడు కనుక కర్త గొప్పవాడయ్యాడు.  నాకేం అవసరం, నేనెందుకు చేయాలి? అన్న భావనలను దాటడం గొప్ప లక్షణం. అంతమంది చెయ్యకుండా కూర్చున్నారు కదా...నేనే ఎందుకు చేయాలి... అని ఎవరికి వారు అనుకొన్నప్పుడు లోకంలో అందరికీ పనికొచ్చే పనులు ఎలా జరుగుతాయి !!!

పదిమందికి పనికొచ్చే ఒక నీటి సౌకర్యం, ఒక బాట సౌకర్యం కల్పించాలి... అన్న సంకల్పం రావడమే గొప్ప. అది నెరవేరాలంటే దానికి ఖర్చు పెట్టాలి. అది అర్ధ రూపాయి కావచ్చు, ఆరుకోట్ల రూపాయలు కావచ్చు. నేనెందుకు చేయాలి అన్న భావన వదిలి  ఆ పని చేయడానికి సిద్ధమయ్యాడు అంటే లోభాన్ని గెలిచినట్లే.  అందుకని ఆ పని తాలూకు ఫలితంలో నాలుగోవంతు ఆయనకు లభిస్తుంది.

తరువాత– చేయించేవాడు. ఆ పనిని ఎవరు చేయగలరో గుర్తించి తాను వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి తాను కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించాడు. ఆ పని జరిగితే కీర్తి నాకు కాకుండా చేసిన వాడికి దక్కుతుందనే అసూయ కొద్దీ చేయకుండా తప్పుకుంటే చేసేవాడికి బలం ఉండదు. అలాకాక తాను కూడా ధైర్యంగా ముందుకడుగు వేసాడు కాబట్టి అసూయను గెలిచాడు. సంకుచితమైన ధోరణిని వదిలి...  చేస్తున్న వాడి హితాన్ని, అందరి హితాన్ని కోరాడు కనుక ఆయనకూ నాలుగో వంతు ఫలితం.

మూడవవారు– ప్రేరేపించిన వారు. కర్త తటపటాయిస్తూ కాలాన్ని వృథా చేయకుండా, త్వరగా మొదలుపెట్టు అంటూ, దాని అవసరాన్ని గుర్తు చేస్తూ  వెంటబడి ప్రేరేపించబట్టి ఆ పని సకాలంలో పూర్తయింది కాబట్టి వీరికి కూడా నాలుగో వంతు ఫలితం దక్కుతుంది. 

ఆమోదించిన వాడు – యుక్తాయుక్త విచక్షణతో, శాస్త్రీయ దృక్పథంతో ఈ పనిమంచిదే, చెడ్డది మాత్రం కాదు, మంచే జరుగుతుంది, చేయవచ్చు అని అంగీకారం తెలిపితే చేసేవాడికి ఇక ఆ పనిలో మరే సందేహం ఉండదు, కనుక ఆమోదించినవాడికి కూడా నాలుగో వంతు లభిస్తుంది.

ఇది తెలిస్తే ఏ పని అయినా ఉత్సాహంగా ముందుకు సాగుతుంది.. నేనేం చేయగలనండీ అని అడుగులు వెనక్కి  పడవు. మంచి పనికి ఈ నలుగురు గట్టిగా ఇలా నిలబడాలి, అప్పుడే సమైక్యతతో ఏదయినా సాధించగలం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top