కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే!

Blind Old Man Selling Banana Chips Next To Nasik Road Video Gone Viral On Internet - Sakshi

కష్టాలు అం‍దరికీ వస్తాయి! ఐతే అవి కొందరిని ఉతికి ఆరేస్తాయి. మరికొందరేమో వాటినే ఉతకడంలో రాటుతేలిపోతారు. ఇటువంటి వాళ్లకి ఓడిపోవడం అస్సలు ఇష్టముండదు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి ఈ రెండో కోవకి చెందినవాడు. కష్టపడే తత్వం, పట్టుదల కలిగిన ఇటువంటి వారిముందు విధి సైతం తలవంచవల్సిందే! తాజాగా చూపుకోల్పోయిన వృద్ధుడి జీవనపోరాటానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. మొత్తం క్లిప్‌ చూస్తే అతని అంకిత భావం అవగతమౌతుంది. విధి నిర్థాక్షిణ్యంగా చూపుకోల్పోయేలా చేసినప్పటికీ ప్రతిరోజూ తను చేసే పనిని మాత్రం ఆపకుండా చేసుకుపోతున్నాడండీ! దీనిని చూసిన నెటిజన్లు ప్రశంశలతో ముంచెత్తుతున్నారు.  అసలీ వీడియోలో ఏముందంటే..

నాసిక్‌లోని మఖ్‌మలబాద్‌ రోడ్డు పక్కనే ఇతని అరటి చిప్స్‌ దుకాణం ఉంది. మరుగుతున్న నూనెలో అరటి చిప్స్‌ చకచకా వేసి, బాగా వేగాక వాటిని ఒక పెద్ద గరిటెతో పక్కనే ఉన్న బేసిన్‌లో వేస్తాడు. తర్వాత హెల్పర్‌ వాటిని ఉప్పుకారంతో బాగాకలిపి ప్లాస్టిక్‌ కవర్‌లో ప్యాక్‌చేయడం ఈ వీడియోలో కన్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను శాన్‌స్కర్‌ స్కేమణి అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఈ ఓల్డ్‌మాన్‌కి మర్యాద ఇవ్వండి. నాసిక్‌లో మీకు తెలిసిన వారెవరైనా ఉంటే ఈ వృద్ధుడు తయారు చేసిన చిప్స్‌ కొనమని చెప్పండి. ఇలా చేయడం ద్వారా అతనికి తిరిగి చూపును ప్రసాదించడంలో మనమందరం సహాయపడగలం’ అనే కాప్షన్‌ను ఈ పోస్టుకు జోడించాడు. ఈ వీడియో ద్వారా అతని చూపుకోసం విరాళాలు సేకరిస్తున్నాడట కూడా. కాగా ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లోని వేడి, ఆవిరి కారణంగా అతను చూపు కోల్పోయాడని అధికారిక సమాచారం. 

ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇప్పటికే 12 లక్షల మంది దీనిని వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు ఈ వ్యక్తి స్థితిని చూసి చలించిపోతున్నారు. అతని హార్డ్‌ వర్క్‌ను ప్రశంశించకుండా ఉండలేకపోతున్నారు. మీరు కూడా చూడండి!!

చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top