మంచు కురిసే వేళలో.... వణికే పెదవులు పలికే పాటలు విన్నారా?

Best Telugu Romantic Songs Suitable For Winter Season Make Holiday Special - Sakshi

Best Telugu Romantic Songs: చలి మొదలైంది. మంచు రాలడం మొదలవుతుంది. వణికే పెదవుల మీద పాటలు కూడా వస్తుంటాయి. చలిగాలిని, మంచు కురిసే వేళని సినీ కవులు సుందరంగా తీర్చిదిద్దారు. నాయికా నాయికులను తమ పదాలతో దగ్గరకు చేర్చారు. నేడు ఆదివారం. ఈ చలికాలపు ఉదయం ఈ పాటలు నెగళ్లుగా మారతాయేమో చూడండి. 

వింటే భారతం వినాలి అంటారు కానీ అది మాత్రమే కాదు. సాలూరి వారి పాట కూడా వినాలి. ‘చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరుని మురళి’... బహుశా అది చలికాలపు చలి కావచ్చు. ఆపై బరువుగా యమున ప్రవహిస్తుండవచ్చు. ఆ సమయాన శ్యామసుందరుడు మురళి ఊదితే వేరే ఏ వ్యాపకమూ పెట్టుకోబుద్ధి కాని ఆ వేళ అది మధురము. మరెంత వెచ్చదనమూ. ‘చలిచలిగా గిలి పుడుతుంటే’ అన్నాడు ఆత్రేయ.

అఫ్‌కోర్స్‌. వానకు తడిసిన బి.సరోజాదేవిని చూసిన నాగేశ్వరరావు చేతే అనుకోండి. కాని ఇప్పుడు చలికాలంలో వానలు పడుతున్నాయి. వరదలూ వస్తున్నాయి. చలిజల్లును ఎదుర్కొనడానికి ఒకరి పక్కన ఒకరు ఒదిగి కూచోక తప్పదు. ఈ ఆత్రేయే ‘సోగ్గాడు’లో ‘చలివేస్తుంది చంపేస్తుంది’ అని రాశాడు. కాని ఒక కవిగా స్పందించి ‘మంచుకురిసే వేళలో మల్లె విరిసేదెందుకో’... అంటే ఎంత బాగుంది. నిజానికి మల్లెలది వేసవి కాలం. మంచుతో తడిసే మల్లెను చూడటం కవికి రసాస్వాదన. అబ్బాయికీ అమ్మాయికీ హొయలు. 

పొగమంచులో పాట తీయడం అప్పట్లో కొత్త. తమిళం వాళ్లు చూపించారు. ‘పరువమా... చిలిపి పరుగు తీయకు’... జాగింగ్‌ చేస్తున్న సుహాసిని, మోహన్‌ను తెలుగు తెర మీద కొత్తగా చూశారు. బాపు గారు అదే పొగమంచును ‘ఏమని నే చెలి పాడుదును’లో అద్బుతంగా చూపారు. జంధ్యాల ‘రాగలీల’లో ‘చలికాలం ఇంకా ఎన్నాళ్లో’ పాటను రెహెమాన్, సుమలత మీద గొప్ప మంచులో చిత్రీకరిస్తారు. ‘మూడుముళ్లు’లో ఆయనే తీసిన ‘లేత చలిగాలులూ దోచుకోరాదురా’ పాట మిట్టమధ్యాహ్నం విన్నా మంచు తాకేలా ఉంటుంది. 

‘సొమ్మొకడిది సోకొకడిది’లో ‘చలితో నీవు చెలితో నేను చేసే అల్లరులూ’ అని రాశాడు వేటూరి. ‘మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్లిపోయే’ అని ‘నిరంతరమూ వసంతములే’ పాటలో ఆయన మాత్రమే అనగలడు. చలికి ఒణికే హీరోయిన్‌కు హీరో ఉదారంగా తన కోటు తీసివ్వడం కద్దు. ‘క్షణక్షణం’లో ఆ జాక్‌పాట్‌ వెంకటేశ్‌కు దక్కింది వెంకటేశ్‌. మరి అతడు జీన్స్‌ జాకెట్‌ ఇచ్చింది శ్రీదేవికి కదా. చలికి చాలామంది ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తారు. కాని ‘జామురాతిరి’ పాటలో శ్రీదేవి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ చూడాలి. సావిత్రి మహానటి. శ్రీదేవి.. మహూహూ.. నటి.

చలిని కొత్త సినిమాలు కూడా వదలుకోలేదు. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లో ‘చలిచలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది మనసు’ పెద్ద హిట్‌. ప్రభాస్‌కు, కాజల్‌కు అదొక సుకుమారమైన చలిగీతం. నానికి కూడా ఇలాంటి హిట్‌ ఉంది. సిరివెన్నెల రాశాడు– జెంటిల్‌మెన్‌ కోసం. ‘చలిగాలి చూద్దు తెగ తుంటరి... గిలిగింత పెడుతున్నది’ అని ఒక పంక్తి ఉంటే తర్వాతి పంక్తి ‘పొగమంచు చూద్దు మహ మంచిది.... తెరచాటు కడుతున్నది’ అని ఉంటుంది.

ఆ ప్రేయసీ ప్రియుల ఏకాంతానికి పొగ మంచు తెరచాటు కడుతున్నదట. ఎంత బాగుంది. రుతువులు వచ్చేది మార్పు ఉండాలి జీవితంలో అని చెప్పడానికి. ప్రకృతే మారి మారి ఆనందిస్తుంటే మనిషే రోజువారి రొడ్డకొట్టుడులో పడి ఆస్వాదనకు దూరమవుతున్నాడు. చీకటితో లేవండి. చలిని ఎంజాయ్‌ చేయండి. మంచులో తడిసినపూలను చూడండి. నెగళ్ల సెగను అనుభవించండి. ఆ సమయంలో టీ తాగడం మర్చిపోవద్దు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top