Parenting Tips: పంచతంత్రం.. పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? అంటే..

Best Parenting Tips: How To Raise Successful Kids By Australian Researchers - Sakshi

పంచతంత్రం 

పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఆస్ట్రేలియాలోని లా ట్రోంబే యూనివర్సిటీ పరిశోధకులు కొన్ని సూచనలు చేశారు. ‘హౌ టు రైజ్‌ సక్సెస్‌ఫుల్‌ కిడ్స్‌’ అనే అంశం మీద వాళ్లు ప్రధానంగా ఐదు అంశాలను చెప్పారు. అందులో ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. వాటిని పరిశీలిద్దాం.

బంధాల అల్లిక...
పరిశోధకులు చెప్పిన మొదటి అంశం... కేర్‌... కేర్‌... కేర్‌. సెల్ఫ్‌ కేర్‌... తమను తాము సంరక్షించుకోవడం. అదర్స్‌ కేర్‌... ఇతరులను పట్టించుకోవడం. పెట్‌ కేర్‌... ఇంట్లో ఉన్న పెంపుడు జంతువుల సంరక్షణ. స్థూలంగా వాళ్లు చెబుతున్న విషయం ఏమిటంటే... పిల్లల్ని తమ పనులు తాము చేసుకునే విధంగా తయారు చేయాలి.

అలాగే తల్లిదండ్రులకు లేదా గ్రాండ్‌ పేరెంట్స్‌ ఇతర కుటుంబ సభ్యులకు చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడం వంటివి కూడా అలవాటు చేయాలి. పిల్లలను శ్రామికులుగా మార్చడం అని కాదు వాళ్లు చెబుతున్నది. పెద్దవాళ్లకు మందుల పెట్టె అందించడం, మందులు వేసుకునేటప్పుడు నీళ్లు తెచ్చి ఇవ్వడం వంటి పనులు చేస్తూ ఉంటే ఇతరులను పట్టించుకోవడం అనే మంచి లక్షణం పిల్లలకు ఒంటపడుతుంది.

పెంపుడు జంతువు పట్ల ఇష్టం ఉండడం– పెట్‌ సంరక్షణ పట్ల బాధ్యత కలిగి ఉండడం రెండూ భిన్నమైనవి. పెట్‌ను ముద్దు చేయడంతోపాటు వాటి బాగోగులు పట్టించుకోవడం కూడా అలవాటు చేస్తే ప్రేమవాత్సల్య బంధాలను స్వయంగా అనుభవంలో తెలుసుకుంటారు. 
 
స్ఫూర్తిమంత్రం ...
రెండవ అంశంగా మర్యాదపూర్వకమైన ప్రవర్తన గురించి చెప్పారు. ఇతరుల నుంచి సహాయం కోరేటప్పుడు వినయంగా అడగడం, సహాయం పొందిన తర్వాత చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలియచేయడం, ఇతరులకు సహాయం చేయడంలోనూ వినమ్రత పాటించడం వంటివి ఇంట్లో పదేళ్లలోపే అలవడాలని పరిశోధకుల నివేదిక సారాంశం. మూడవ అంశంగా ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ను ప్రస్తావించారు.

బాల్యంలో ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ను వృద్ధి చేసుకున్న వాళ్లు చదువులో మందు ఉండడాన్ని గమనించినట్లు చెప్పారు. అలాగే మంచి ఉద్యోగంలో స్థిరపడడంతోపాటు జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నట్లు పరిశోధకుల అధ్యయనం. రేచల్‌ కాట్జ్, హెలెన్‌ ష్వే హదానీ తమ అధ్యయనాల సారాంశాన్ని క్రోడీకరిస్తూ ‘ఎమోషనల్‌ ఇంటలిజెంట్‌ చైల్డ్‌: ఎఫెక్టివ్‌ స్ట్రాటజీస్‌ ఫర్‌ పేరెంటింగ సెల్ఫ్‌ అవేర్, కో ఆపరేటివ్‌ అండ్‌ వెల్‌ బాలెన్స్‌డ్‌ కిడ్స్‌’ అనే పుస్తకం రాశారు.

ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ వృద్ధి చేసుకున్న పిల్లలు చదువులో చురుగ్గా ఉంటారని, ఒక సమస్యను సమయస్ఫూర్తితో పరిష్కరించగలిగిన నేర్పు కూడా అలవడుతుందని వారి అభిప్రాయం. అదే విషయాన్ని మరింత వివరంగా చెప్పారు డాక్టర్‌ సుదర్శిని. ‘‘భావోద్వేగాలు చాలా విలువైనవి. వాటిని సరిగ్గా వ్యక్తీకరించడం కూడా చాలా ముఖ్యం. ఒక ఇంట్లో తల్లిదండ్రులు భావోద్వేగాల వ్యక్తీకరణ ఎంత సమర్థంగా చేయగలుగుతారో వాళ్ల పిల్లలు కూడా అదే ధోరణిని ఒంటపట్టించుకుంటారు.

సంతోషాన్ని వ్యక్తం చేసే క్రమంలో ‘నిన్న పార్కులో చాలా సంతోషంగా ఆడుకున్నాను. ఈ రోజు సాయంత్రం పార్కుకు వెళ్తున్నాను, ఇప్పటి నుంచే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది’ అని చెప్పడం రావాలి. ప్రతి ఫీలింగ్‌నీ వ్యక్తం చేయడానికి ఒక పదం ఉంటుంది. ఆ పదాలను నేర్పించాలన్న మాట. అలాగే పాజిటివ్, నెగెటివ్‌ ఎమోషన్స్‌ రెండింటికీ తేడా వివరించాలి.

కోపం నుంచి కామ్‌డౌన్‌ కావాలనే స్పృహను కలిగించాలి. కోపం లేదా దుఃఖభరితంగా ఉన్నప్పుడు దాన్నుంచి బయటపడడానికి జోక్స్‌ బుక్‌ లేదా డ్రాయింగ్‌ అండ్‌ కలరింగ్‌ కిట్‌ తీసి వాళ్ల ముందు పెట్టాలి. కామ్‌డౌన్‌ కావడానికి తనకు ఇష్టమైన వ్యాపకం దోహదం చేస్తుందని వాళ్లకు అర్థమవుతుంది’’ అన్నారామె.
 
బుర్రకు పని ...
యూరప్‌లో వేలాది మంది పిల్లల మీద నిర్వహించిన అధ్యయనంలో టీవీ స్క్రీన్‌కు అతుక్కుపోతున్న అలవాటు గురించి తల్లిదండ్రులకు గట్టి హెచ్చరికలే చేశారు. అయతే పరిశోధకులు ఈ విషయంలో వీడియో గేమ్‌లకు కొంత వెసులుబాటు కల్పించారు.

టీవీ చూస్తూ మెదడును బద్దకంగా ఉంచడంతో పోలిస్తే మెదడును పాదరసంలా స్పందింపచేసే వీడియో గేమ్‌లను కొంత వరకు ప్రోత్సహించారు. ఎప్పుడూ ఒకేరకమైన ఆటలకే పరిమితం కాకుండా కొత్త కొత్త ఆటలను ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడే మెదడు చురుగ్గా ఉంటుంది. అలాగే వీడియో గేమ్‌కు పరిమితమైన సమయం కేటాయించమనే సూచన కూడా చేశారు.  
 
అభిరుచి ...
ఐదవ అంశం మరింత ప్రధానమైనది. అది పిల్లల అభిరుచిని గుర్తించడం, గౌరవించడం. పిల్లల్ని తమ అభిరుచులను వ్యక్తం చేయనివ్వాలి. వాళ్లు చెప్పడం మొదలు పెట్టగానే అడ్డు తగులుతూ అది మంచిదో చెడ్డదో నిర్ణయించేసి తీర్పు చెప్పడం సరికాదు. పిల్లల్లో ఒక విషయంలో విపరీతమైన ఇష్టం ఉంటే పేరెంట్స్‌ కూడా దాని మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాల్సిందే.

క్రీడాకారులు అలా తయారైన వాళ్లేనన్నారు అధ్యయన కారులు. సక్సెస్‌కి దారి తీసే అనేక కారకాల్లో ప్యాషన్‌ను మించినది మరొకటి ఉండదు. ఏ రంగంలోనయినా కీలకంగా ఎదిగిన వాళ్లను పరిశీలిస్తే వాళ్లలో ఆ వృత్తి పట్ల ఉన్న అభిరుచి, అంకితభావాలు అర్థమవుతాయనేది పరిశోధకుల అభిప్రాయం.  

భావోద్వేగాల పరిచయం
ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ అంటే... ఎదుటి వాళ్ల భావాలను గౌరవిస్తూనే మన అభిప్రాయాలను వ్యక్తం చేయడం, పరిస్థితిని సానుకూల పరచడం అన్నమాట. పిల్లలు తమకు ఏదైనా కావాలంటే పేచీ పెట్టడం, ఏడవడం, నేలమీద దొర్లడం చూస్తుంటాం. ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ ప్రాక్టీస్‌ అయిన పిల్లలైతే తమ భావాలను తల్లిదండ్రులకు చక్కగా మాటల్లో వివరించగలుగుతారు.

భావోద్వేగాలను వ్యక్తం చేసే వొకాబులరీని పిల్లలకు నేర్పించాలి. అప్పుడు తమ అసంతృప్తి, ఆగ్రహం, ఆవేదన, సంతోషం, ఆనందాలను మాటల్లో వ్యక్తం చేయగలుగు తారు. ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ ప్రాక్టీస్‌ ఉన్న వాళ్లు పర్సనల్‌ లైఫ్‌లోనూ, ప్రొఫెషనల్‌ లైఫ్‌లో కూడా సంతోషంగా, చలాకీగా దూసుకుపోగలుగుతారు. – డాక్టర్‌ సుదర్శిని, చైల్డ్‌ సైకాలజిస్ట్‌ 
--- వాకా మంజులారెడ్డి

చదవండి: Best Tips: ఏయే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి? బ్యాక్టీరియా ఎలా పోతుంది?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top