ఉద్యమ సాహిత్యానికి అరుదైన గౌరవం | Arunodaya Anitha Awarded PhD from Osmania University | Sakshi
Sakshi News home page

అమర్‌ సాహిత్యంపై అనితకు ఉస్మానియా పీహెచ్‌డీ

Jun 23 2025 7:29 PM | Updated on Jun 23 2025 7:53 PM

Arunodaya Anitha Awarded PhD from Osmania University

అరుణోదయ గాయని అరుదైన పరిశోధన 
అజ్ఞాత అక్షర యోధుడు.. అమర్‌ 
సాయుధ బాటలో సాహితీ సృజన
అభినందించిన ప్రొఫెసర్‌ కాశీం

సినుకు సినుకు కురిసిన నేలన 
చిత్రమైన వాసన..  
అది మల్లెల గంధం అవునో కాదో.. మట్టిపెళ్ల వాసన..  
ఈ మట్టి పెళ్ల వాసన.. 
గడ్డిపూలు సిగనిండా 
తురిమి పంచుతున్న వాసనో..  
ఆయేటిభూనంగా జీవరాసులు 
ఎదకొచ్చే వాసనో.. 
.. అంటూ ప్రకృతిని పర్యావరణాన్ని ఆవిష్కరించారు.

బిడ్డా నీకు దీవెన.. 
కన్నబిడ్డా నీకు దీవెన 
బిడ్డా నీకు దీవెన.. 
కన్నబిడ్డా నీకు దీవెన  
తొమ్మిది మాసాలు మోసినా.. 
ఒడినే ఉయ్యాలజేసినా..  
నా ఇంటి కడపళ్ల మెరిసినా.. 
ఏ అయ్య చేతుల్లో బోసినా..  
నన్నెత్తుకాబోంగ ఏడుస్తవనుకంటే.. నన్నెత్తుకాబోంగ ఏడుస్తవనుకంటే..  
దినదినగండము నీకమ్మా..
కారడవి వార్తమి విందునమ్మా..  
.. అంటూ అడవిబాట పట్టిన 
బిడ్డ యాదిలో అమ్మ తలపోత

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు చెందిన కూర దేవేందర్‌ అలియాస్‌ అమర్‌ అలియాస్‌ మిత్ర.. మూడు దశాబ్దాల సాయుధ పోరాటంలో అజ్ఞాత వాసం చేస్తూ సాహితీ సృజన చేశారు. సీపీఐ (ఎంఎల్‌) జనశక్తి రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుని హోదాలో 2004 అక్టోబర్‌లో నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాంతిచర్చల్లో పాల్గొన్నారు. అమర్‌ తన సాహిత్యయాత్రను ‘మిత్ర’కలం పేరుతో కొనసాగించారు. ఆయన సోదరుడు కూర రాజన్న అలియాస్‌ రాజేందర్‌ ‘జనశక్తి’ ఉద్యమ నిర్మాత. అన్నబాటలో అడవుల్లోకి వెళ్లిన అమర్‌ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. గన్ను పట్టి ప్రజా సమస్యలపై పోరాడుతూనే.. పెన్ను పట్టి ప్రజల పాటలు రాశారు. ఆయన సాహిత్యంపై ‘కైతల కవాతు’ పుస్తకం ప్రచురితమైంది. తాజాగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, గాయని అనిత ‘మిత్ర కవిత్వం–సమగ్ర పరిశీలన’ అనే అంశంపై ప్రొఫెసర్‌ చింతకింది కాశీం పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్‌ పొందారు.

ఆరు అధ్యాయాలుగా అధ్యయనం 
మిత్ర సాహిత్యాన్ని ఆరు అధ్యాయాలుగా విభజించుకుని సమగ్రంగా పరిశీలించారు. మొదటి అధ్యాయంలో రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో పుట్టి పెరిగిన మిత్ర బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యమజీవితం, అజ్ఞాత జీవితం, శాంతిచర్చలు, జైలు జీవితం వంటి అంశాలపై చర్చించారు.  

రెండో అధ్యాయంలో మిత్ర కవిత్వంలోని విప్లవ దృక్పథాన్ని వివరిస్తూ.. పాటల్లో విప్లవ భావజాలం, వచన కవిత్వంలో ఉన్న విప్లవ దృక్పథాన్ని ఎత్తి చూపారు. 

మూడో అధ్యాయంలో మిత్ర కవిత్వంలోని అస్తిత్వ దృక్పథంలో భాగంగా తెలంగాణ అస్తిత్వాన్ని, దళితవాదం, స్త్రీవాదం, ఇతర అస్తిత్వాల్లోని బీసీలు, మైనారిటీలు, ఆదివాసీలు, దివ్యాంగులకు సంబంధించిన కవిత్వాన్ని అంతటిని పరిశీలనాత్మకంగా వివరించారు.

నాలుగో అధ్యాయంలో ప్రపంచీకరణ అనే అంశాన్ని ఎంచుకొని.. బహుళజాతి సంస్థల విధ్వంసకర నమూనాలను ప్రశ్నిస్తూ సాగిన మిత్ర కవిత్వంలోని కులవృత్తుల విధ్వంసం, మానవ సంబంధాల విచ్ఛిన్నం అనే అంశాలను స్పష్టం చేశారు.

ఐదో అధ్యాయంగా మిత్ర స్మృతి కవిత్వంలో కమ్యూనిస్టు, సామాజిక ఉద్యమాల్లో అసువులు బాసిన ఎందరో వీరుల స్మృతి పాటలను పరిశీలించి వాటిని విప్లవ వీరుల సంస్మరణ, మేధావుల స్మృతిగా విభజించి విశ్లేషించారు. 

ఆరో అధ్యాయంగా మిత్ర కవిత్వంలోని శిల్ప నైపుణ్యాలను.. అందులోని భాష, ప్రతీకలు, భావుకత, వర్ణనాత్మకత తదితర అంశాలన్నిటికీ కవిత్వ లక్షణాలకు అన్వయించి వివరించారు. విప్లవ నాయకునిగా కొనసాగుతూ.. ఒక చేతిలో పెన్ను మరో చేతిలో గన్ను పట్టి మూడు దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితం గడిపిన ‘మిత్ర’ కవిత్వాన్ని సమూలంగా విభజించి విశ్లేషిస్తూ ఆయనను ‘విప్లవ కవిగా’తన పరిశోధనతో నిరూపించారు. సమగ్ర పరిశీలన ఉండడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) అనితకు డాక్టరేట్‌ను ప్రకటించింది.

పీహెచ్‌డీ చేసిన అనిత ప్రస్థానం 
వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ ప్రాంతంలోని బొమ్రాసిపేట మండలం రేగడిమైలారం గ్రామానికి చెందిన అనితకుమారి పేదింటి బిడ్డ. ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న రోజుల్లోనే తండ్రిని కోల్పోయారు. తల్లి కూలీనాలీ చేసి బిడ్డను చదివించుకుంది. తోబుట్టువుల అండతో అనిత చదువులో రాణించారు. తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో చేరి గాయనిగా పేరు సంపాదించారు. అనిత (Anitha) పాడిన అనేక పాటలు ఇప్పటికీ ప్రజాబాహుళ్యంలో మారుమోగుతున్నాయి. 

అరుణోదయ ప్రోత్సాహంతో పీజీ చేశారు. ఉద్యమ పాటలు, సాహిత్యంపై మక్కువ పెంచుకొని మిత్ర కవిత్వంపై పరిశోధనకు పూనుకున్నారు. తెలంగాణ ఉద్యమంతోపాటు మరెన్నో సామాజిక ఉద్యమాల్లో అనిత పాలుపంచుకుంటూనే పీహెచ్‌డీ (PhD) చేశారు. ఆమె పరిశోధనను ప్రొఫెసర్‌ చింతకింది కాశీం పర్యవేక్షించారు. ప్రగతిశీల భావాలున్న ఉస్మానియా న్యాయ కళాశాల విద్యార్థి, నల్లగొండ జిల్లా వాసి పురం వెంకటేశ్‌ను పెళ్లి చేసుకున్న అనిత.. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పార్ట్‌ టైం అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు.

చ‌ద‌వండి: చితికిన బతుకు జట్కాబండి 

ఉద్యమ సాహిత్యానికి అరుదైన గౌరవం 
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజాసాహిత్యానికి, ఉద్యమ నేపథ్యానికి డాక్టరేట్‌ రావడం అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. అంకితభావంతో మిత్ర సాహిత్యాన్ని సృజించి డాక్టరేట్‌ పట్టా పొందిన సందర్భంగా అనితను ప్రొఫెసర్‌ కాశీం (Professor Kasim) అభినందించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు, ప్రజాయుద్ధభేరి విమలక్క, కూర దేవేందర్‌ (మిత్ర), అరుణోదయ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి మల్సూర్, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ పోతుల, ఉపాధ్యక్షుడు సురేశ్‌, సహాయ కార్యదర్శి ప్రభాకర్, రాకేశ్, కోశాధికారి భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూతన్, గంగ, లింగన్న, రామన్న, చిన్నన్న, స్వామి తదితరులు కూడా అభినందనలు తెలిపారు. వేములవాడకు చెందిన కూర దేవేందర్‌ దళిత, బహుజన, పీడిత ప్రజల సాహిత్యానికి డాక్టరేట్‌ రావడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement