చేతులు లేని తొలి మహిళా పారా ఆర్చర్‌! రెండు పతకాలతో ప్రపంచాన్నే..

Armless Archer Sheetal Devi Wins 3 Medals In Asian Para Games - Sakshi

జీవితంలో ఎదురయ్యే చిన్నాచితకా కష్టాల గురించి ఇక మీదట నేను యాగీ చేయను. తల్లీ నువ్వొక గురువువి’ అని ట్వీట్‌ చేశాడు ఆనంద్‌ మహీంద్ర, పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి గురించి. అంతే కాదు తమ సంస్థ నుంచి కోరిన కారు తీసుకోమన్నాడు.రెండు చేతులూ లేకపోయినా విలువిద్య అభ్యసించి ఆసియా పారాగేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన కశ్మీర్‌ అమ్మాయి శీతల్‌దేవి జీవితాన్ని ఎలా ఎదుర్కొనాలో తన పట్టుదలతో చూపించింది. ఆమె జీవితం ఒక ఆదర్శమైతే ఆమె నేర్పిన పాఠం సాకులు చెప్పేవారికి గుణపాఠం.

2021లో బెంగళూరుకు చెందిన ‘బీయింగ్‌ యు’ అనే సంస్థ శీతల్‌కు ప్రోస్థెటిక్‌ చేతులు పెట్టించడానికి ఏర్పాట్లు చేసింది. ‘ప్రొస్థెటిక్‌ చేతులు పెడితే నువ్వు చేసే మొదటి పని ఏమిటి?’ అని అడిగితే ‘గాజులు వేసుకుంటా’ అని టక్కున సమాధానం చెప్పింది శీతల్‌. నిజానికి ఆ అలంకరణకు తప్పితే మిగిలిన అన్ని పనులకు, తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి శీతల్‌కు తన ఆత్మవిశ్వాసం చాలు. అందుకే ఆమె ప్రోస్థెటిక్‌ చేతులను పెద్దగా ఉపయోగించదు. దాదాపు పెట్టుకోదనే చెప్పాలి. ‘నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను’ అంటుంది శీతల్‌. ఈ ధైర్యం ఎంతమందికి ఉంది?

రికార్డులు తిరగరాసింది
ఇటీవల చైనాలో ముగిసిన ‘ఆసియన్‌ పారా గేమ్స్‌’ (దివ్యాంగుల క్రీడలు)లో విలువిద్యలో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించి రికార్డు సృష్టించింది శీతల్‌ దేవి. 16 ఏళ్ల వయసులో ఇలా మన దేశం నుంచి విలువిద్య లో రెండు స్వర్ణాలు సాధించిన క్రీడాకారులు లేరు. అది ఒక పెద్ద విశేషం అయితే అంతకన్నా పెద్ద విశేషం శీతల్‌కు రెండుచేతులూ లేకపోవడం. అయినా సరే కుడికాలితో విల్లు ఎత్తి, కుడి భుజంతో నారి సారించి, 50 మీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని గురి చూసి బాణం వదిలిందంటే కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. అర్జునుడు రెండు చేతులతో బాణాలు సంధిస్తాడు కాబట్టి సవ్యసాచి అన్నారు. శీతల్‌కు చేతులు లేకపోయినా రెండు కాళ్లతో బాణాలు సంధిస్తే ఏమని పిలవాలో. ‘నవ్యసాచి’ అనాలేమో!

జీవితం గొప్పది
‘జీవితంలో నువ్వు ఫలానాది ఎందుకు సాధించలేదు, జీవితం అంటే ఎందుకు ఆసక్తి కోల్పోయావు, జీవితాన్ని ఎందుకు వృథా చేస్తున్నావు’ అని ఎవరినైనా అడిగితే సవాలక్ష వంకలు చెబుతారు, అడ్డంకులొచ్చాయంటారు, కష్టాలు వచ్చాయంటారు, రోజువారి జీవితంలో వచ్చే చిన్నాచితకా సమస్యలకు చికాకు పడిపోతుంటారు, జీవితం నుంచి దూరంగా వ్యసనాల్లోకి పారిపోవాలనుకుంటారు... కాని శీతల్‌ను చూస్తే ఆ అమ్మాయికి మించిన కష్టమా? అయినా కూడా ఆ అమ్మాయి సాధించలేదా? మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రా అదే అన్నాడు శీతల్‌ను చూసి– ‘తల్లి.. నిన్ను చూశాక జీవితం విలువ తెలిసింది’ అని! ఆమెకు కారు ఆఫర్‌ చేశాడు.

కశ్మీర్‌ అమ్మాయి
శీతల్‌ దిగువ మధ్యతరగతి కశ్మీర్‌ అమ్మాయి. వీళ్లది కిష్టవర్‌ జిల్లా లియోధర్‌ గ్రామం. తండ్రి మాన్‌ సింగ్‌ రైతు, తల్లి శక్తిదేవి కాసిన్ని గొర్రెలను సాకుతుంటుంది. వీరి పెద్దకూతురు శీతల్‌. చిన్న కూతురు శివాని. శీతల్‌కు పుట్టుకతో చేతులు ఏర్పడలేదు. ఇలాంటి స్థితిని వైద్యపరిభాషలో ‘ఫొకొమెలియా’ అంటారు. అయితే శీతల్‌ నిరాశలో కుంగిపోలేదు. తల్లిదండ్రులు ఆమెను బేలగా పెంచలేదు. శీతల్‌ తనకు లేని చేతుల లోటును కాళ్లతో పూడ్చడానికి ప్రయత్నించేది. ఆమెకు చేతులు లేకపోవడం వల్ల మిగిలిన శరీరం అంతా మరింత సూక్ష్మంగా, దృఢంగా తయారయ్యింది. రెండు చేతులూ లేకపోయినా శీతల్‌ చెట్లు ఎక్కి ఆడుకునేదంటే ఆశ్చర్యం. స్కూల్లో కూడా కాళ్లతోనే నోట్స్‌ రాసుకోవడం, ఫోన్‌ను ఉపయోగించడం నేర్చుకుంది.

జీవితం అలాగే సాగిపోయేదేమో కాని కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఇంటర్‌నెట్‌లో తనలాంటి దివ్యాంగులకు సాయం చేసే సంస్థ– బీయింగ్‌ యు గురించి తెలిసింది. ఆ సంస్థకు చెందిన ప్రీతి రాయ్‌.. శీతల్‌లోని క్రీడాకారిణిని గుర్తించింది. దివ్యాంగుల క్రీడల పోటీల్లో ఆమె ప్రతిభ చూపగలదని గ్రహించి, తన సంస్థ స్పాన్సర్‌షిప్‌ కింద కశ్మీర్‌లోని కత్రాలో దివ్యాంగుల క్రీడా శిక్షణా కేంద్రానికి పంపింది. ఆగస్టు 2022 నుంచి మాత్రమే శీతల్‌ విలువిద్య సాధన మొదలెట్టింది. 2023 అక్టోబర్‌ నాటికి అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

ఇంతకన్నా విజయం ఉందా?
‘నాకు ఎలాగైనా సాధించాలని ఉండేది. అందుకు ఏమిటి మార్గం అని మా కోచ్‌ను అడిగాను. కష్టపడాలి అన్నాడు. కష్టపడ్డాను. చాలా చాలా కష్టపడ్డాను’ అంటుంది శీతల్‌.
అడ్డదారుల్లో వెళితే విజయం ఉండొచ్చు లేకపోవచ్చు. కాని కష్టపడితే? గెలుపు తథ్యం. శీతల్‌ను చూసి మన జీవితాల్లో లక్ష్యాన్ని గురి చూద్దాం.

(చదవండి: ఎమర్జెన్సీపై ఇందిరా గాంధీ వ్యాఖ్యలు.. విలేకరుల ముఖంపై చిరునవ్వులు)

  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top