కోరికలే గుర్రాలయితే..? అనే డోపమైన్ హై కథ | Amarnath Vasireddy Special Article On Teachers Day 2022 | Sakshi
Sakshi News home page

Amarnath Vasireddy: కోరికలే గుర్రాలయితే..? అనే డోపమైన్ హై కథ

Published Mon, Sep 5 2022 3:19 PM | Last Updated on Mon, Sep 5 2022 3:19 PM

Amarnath Vasireddy Special Article On Teachers Day 2022 - Sakshi

అసంతృప్తి.. అందరిలోనూ ఏదో రకమైన అసంతృప్తి. ఇండియాలో బతికేలేము అంటూ అమెరికా , కెనడా , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా కు వలస పోయే వారు ఎంతో మంది . అమెరికాలో ఎన్నో తరాలుగా స్థిరపడిన వారు అమెరికాలో హ్యాపీ  లైఫ్ గడపలేము అంటూ డబెట్టి గోల్డెన్ వీసా కనుక్కొని గ్రీస్కు లేదా స్కాండినేవియన్ దేశానికి. అసలు భూమి నివాసయోగ్యం కాదు . త్వరగా మార్స్ పైకి వెళ్ళిపోతే  బాగుండు అని మరి కొందరు .

అసంతృప్తి.. కలెక్టర్ మొదలు బిల్లబంట్రోతు వరకు .. స్టార్ట్ అప్ మొదలు ఫామిలీ బిజినెస్‌మేన్  వరకు ..  అందరిలో అసంతృప్తి . ఎందుకు ? 1950 లో ప్రపంచ జనాభా 250 కోట్లు. ఇప్పుడు 800 కోట్లు. డెబ్భై  సంవత్సరాల్లో మూడు రెట్లకు  పైగా పెరిగిన జనాభా ! ఇల్లు కట్టు కోవడానికి పంటలు పండించడానికి భూమి అవసరం. కానీ  అప్పుడూ ఇప్పుడూ అదే భూమి. అంటే?

పరిమతమైన వనరులు.. అపరిమితంగా పెరిగిపోతున్న డిమాండ్.. తిండి కోసం, నివాసం కోసం.. బతకడం కోసం పోటీ. విపరీతమైన పోటీ. పోటీ తెచ్చే ఒత్తిడి. ఇదీ నేడు సర్వత్రా కనిపించే స్థితి .

కానీ శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి పుణ్యమా అంటూ జనాభా ఇంతగా  పెరిగినా,  అందరి అవసరాలూ తీర్చగలిగిన స్థితి లో నేడు మానవాళి ఉంది. ఎనభై ఏళ్ళ క్రితం బెంగాల్ లో కరువు వల్ల ముప్పై లక్షల మంది చనిపోయారు అంటే నమ్మగలరా ?  నేటి ప్రపంచం లో ఆకలి చావులు , కరువులు కాటకాలు ఎక్కడో కొన్ని ఆఫ్రికా దేశాలకు పరిమితం .

అవసరాలు తీరుతాయి.. మరి కోరికలు..? 
స్కూటర్ కొన్నాయనకు కారు కావాలి . కారు కొన్నాయనకు లగ్జరీ కారు కావాలి . దాన్ని కొన్నాయనకు ప్రైవేట్ జెట్ కావాలి. ఫ్లాట్ కొన్నాయనకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి . అది కొన్నాయనకు విల్లా కావాలి . గేటెడ్ కమ్యూనిటీ కావాలి . అది కొన్నాయనకు డిజైనర్ బంగాళా కావాలి . అది ఉన్నాయనకు సొంత దీవి కావాలి .

ఆవసరాలు పరిమితం. గుర్రాలయిన కోరికలు..! 
కోరికలే మనిషి బాధలకు మూలం అన్నాడు గౌతమ బుద్ధుడు.2500 ఏళ్ళ  క్రితమే మనిషి కోరికలకు పగ్గాలు ఉండేవి కావు . ఇప్పుడు గ్లోబల్ సమాజం . కోరికలు ఇప్పుడు గుర్రాలు కావు  .. రాకెట్ లు .. సూపర్ సోనిక్ జెట్ లు! నలభై ఏళ్ళ ప్రపంచీకరణ ! అప్పటిదాకా ఏదైనా సామజిక విలువలు మిగిలుంటే దాన్ని తుడిచి పెట్టేసింది ! 

తనకు రాముడు లాంటి భర్త కావాలనుకొనేది ఒక నాటి స్త్రీ ! అంటే మరో స్త్రీని తలపులోకి కూడా రానివ్వ కూడదు . తనకు సీత లాంటి భార్య కావాలి అనుకునేవాడు ఒకప్పటి యువకుడు . అంటే కష్టాల్లో నష్టాల్లో తనవెంట నిలవాలి . న్యాయం కదా ?

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రపంచ . తనకు రష్మిక మందన లాంటి భార్య కావాలి !  సరిపోతుందా ? లేదు వీలైతే మృణాల్ ఠాకూర్ రెండో  భార్య గా ! పోనీ అక్కడితో ఓకే ?   సన్నీ లియోన్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి ! పూనమ్ పాండే  షెర్లీన్ .. ఇంకా ఇంకా కావాలి ! 

వ్యయసాయం చేసే భర్త వద్దు . సిటీ లో ఉద్యోగం చేసేవాడు కావాలి . అక్కడితో హ్యాపీ నా ? పక్కింటాయనకు కారుంది . మనకు లేదు . ఆఫీస్ లో పని చేసే కొలీగ్ కు సిక్స్ ప్యాక్ వుంది . నీకు లేదు .

" లైఫ్  ఈజ్  షార్ట్. చేతకానోళ్లే నీతులంటూ ఉపన్యాసాలిస్తారు . ఎంజాయ్ . దానికోసం ఏమైనా చేయొచ్చు . ఆన్లైన్ గేమ్ లో డబ్బు కోసం అమ్మనైనా చంపొచ్చు . పక్కింటి కుర్రాడితో సుఖం కోసం భర్తకు అన్నంలో విషం పెట్టొచ్చు . ఎంజాయ్మెంట్ ముఖ్యం " ఇదీ గ్లోబల్  యుగంలో మిలీనియం యూత్ ఫిలాసఫీ . 

స్మగ్లర్ లు  గూండా లు రౌడీ షీటర్లు నేటి యువత కు ఆదర్శ పురుషులు. తెలంగాణకు చెందిన ఒక నాయకుడు తన నియోజకవర్గం లో యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేసాడు . అబ్బే ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరికీ కావాలి అని ఎక్కువ శాతం నోరు చప్పరించేసారుట ! తమ కళ్ళకెదుట రాజకీయాల్లో చేరి కోట్లు కూడబెట్టిన వారు వీరికి ఆదర్శం . సంవత్సరం లో వంద కోట్లు కూడబెట్టాలనుకున్నోళ్లకి నెలకు ఇంత జీతం చొప్పున చేసే ఓపిక ఉంటుందా ?

జీవితం చిన్నది . నిజమే ! ఆనందంగా బతకాలి. కరెక్ట్ .. కానీ ...  
ఆనందం అంటే ?  
వస్తువుల్లో ఆనందాన్ని  వెతుక్కోంటోంది  నేటి సమాజం. వేలకోట్ల సంపద వున్నా తీవ్ర అనారోగ్యం తో చనిపోయిన రాకేష్ జున్ఝున్వాలా , గోవా బీచ్ లు .. బికిని మోడల్స్ .. క్యాలండర్ గర్ల్స్  విజయ్ మాల్యా .. నేడు  లండన్ లో బోడి మల్లయ్య గా మారిన తీరు  .. సమకాలీన ప్రపంచం ఎన్ని ఉదారణలను విసిరేసినా నేర్చుకోలేని స్థితికి చేరుకొంది మానవాళి .


- అమర్నాద్ వాసిరెడ్డి,
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement