
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: విద్యార్థుల పురోభివృద్ధిని ఎప్పటికప్పుడు కనిపెడుతూ వారికి చదువుపై ఆసక్తిని పెంపొందించే స్మార్ట్ టీచర్ల అవసరం ఎంతో ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. ఇటువంటి ఉపాధ్యాయులే దేశం, సమాజం అవసరాలకు అనుగుణంగా వ్యవహరించే సమర్థులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతారన్నారు. వివేకవంతులైన ఉపాధ్యాయులు పిల్లల్లో ఆత్మగౌరవం, భద్రతా భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తారన్నారు.
శుక్రవారం రాష్ట్రపతి ముర్ము విజ్ఞానభవన్‌లో జరిగిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విశేష సేవలందించిన 60 మందికి పైగా ఉపాధ్యాయులను సన్మానించారు. స్మార్ట్ బ్లాక్ బోర్డులు, స్మార్ట్ క్లాస్‌రూంలు, ఇతర అత్యంత ఆధునాతన స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థల కంటే ఎక్కువగా స్మార్టు టీచర్లే ముఖ్యమని అనంతరం ఆమె తెలిపారు.
ఉపాధ్యాయినిగా గడిపిన సమయమే తన జీవితంలో అత్యంత అర్థవంతమైందిగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. విద్యార్థి నడవడికను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుని ప్రాథమిక కర్తవ్యమని చెప్పారు. విద్యాబుద్ధులు నేరి్పంచిన ఉపాధ్యాయులను జీవితాంతం గుర్తుంచుకోవడం, కుటుంబం, సమాజం, దేశానికి ప్రశంసనీయమైన సేవలందించడమే విద్యార్థులిచ్చే అతిపెద్ద కానుక అని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
అవార్డుల ప్రదానోత్సవానికి ముందుగా ప్రధాని మోదీ ఉత్తమ అధ్యాపకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన సరదాగా వారితో..‘విద్యార్థులకు ఉపాధ్యాయులు హోం వర్క్ ఇవ్వడం సహజం. నేను కూడా మీ అందరికీ ఒక హోం వర్క్ ఇవ్వాలనుకుంటున్నా. అదేమంటే.. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం. మేక్ ఇన్ ఇండియా, ఓకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి సారథులుగా ఉండటం..’అని పేర్కొన్నారు.