
టీచర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు, జీవితం ఎలా ఉండాలో చూపించే దారిదీపం.. ఇది ఇవాళ విపరీతంగా కనిపిస్తున్న ఓ కొటేషన్. వాట్సాప్‌లో స్టేటస్‌గా, ఇన్‌స్టాగ్రామ్ ఎడిటింగ్‌లతో తెగ వైరల్ అవుతోంది. డిజిటల్ యుగంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ మారిపోయిందనడానికి ఇదే ఒక రుజువు. కానీ.. నిజమైన టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉండేవో మీకు తెలుసా?
టీచర్స్ డే అంటే గుర్తొచ్చేది.. ఒకానొక టైంలో స్కూళ్లలో జరిగిన అద్భుతమైన వేడుకలు. టీచర్ల కోసం దాచుకున్న, పేరెంట్స్‌ను అడుక్కున్న సొమ్ముతో కొనే గిఫ్ట్‌లు, ఫేవరెట్ టీచర్ల కోసం స్పెషల్‌గా రాసి.. గీసి తీసుకొచ్చే గ్రీటింగ్స్, వాళ్ల కోసం కొని తెచ్చే గులాబీ పువ్వులు.. బొకేలు, శాలువాలు, చాకెట్లు.. అబ్బో మామూలు హడావిడి నడిచేది కాదు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. బడి పిల్లలే టీచర్ల అవతారం ఎత్తి పాఠాలు బోధించడం గురించి.
టీచర్స్ డే.. స్టూడెంట్స్ టీచర్లుగా మారి పాఠాలు చెప్పేవారు. అబ్బాయిలు ప్యాంట్‌షర్టులు.. పంచెలు, అమ్మాయిలు చీరలు, ప్రిన్సిపాల్ గెటప్‌కు సూట్ బూట్ స్పెషల్‌గా వచ్చేవాళ్లు. టీచర్లు హాయిగా విశ్రాంతి తీసుకుని.. నవ్వుతూ, ఆటలాడుతూ సందడిగా గడిపేవారు. విద్యార్థులు టీచర్ల వేషాలు వేసుకుని, బోధనలో తాము నేర్చుకున్నదాన్ని తిరిగి చూపించేవారు. ఆ సమయంలో టీచర్లనూ అనుకరించేవాళ్లు. అలా బడులలో ఒక పండుగ వాతావరణం కనిపించేది.
అయితే ఈ ఒక్కరోజు మార్పు.. ఒక ఆట కాదు. గురుపూజోత్సవం ఉద్దేశం వేరు. గురువుల బాధ్యతను అర్థం చేసుకునే ప్రయత్నం. టీచర్ అంటే మనల్ని భయపెట్టే వ్యక్తి కాదు.. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి అని తెలియజేసేది. ఆ అనుభవం విద్యార్థుల్లో గౌరవం, కృతజ్ఞత, నైతికత పెంచేది.
నేను చదివిన బడిలో నాలుగేళ్లపాటు టీచర్స్ డే రోజున.. ‘సార్’గా మారిపోయాను నేను. అందులో.. పదో తరగతి చదివే టైంలో మా క్లాస్ వాళ్లకే పాఠాలు చెప్పాల్సి రావడం నన్ను ఎంతో ఎగ్జయిట్ చేసింది. నీట్‌గా టక్ చేసుకుని.. సోషల్ బుక్ చేతిలో పట్టుకుని.. పైకి గంభీరంగా బిల్డప్ ఇచ్చినా, లోపల మాత్రం ఉప్పొంగే ఆనందంతో తరగతి గదిలో అడుగుపెట్టాను. సీరియస్‌గా పాఠం చెబుతూ.. మధ్యలో ప్రశ్నలు అడుగుతూ, చాక్‌పీస్ ముక్కలను వాళ్లపైకి విసురుతూ.. ఆన్సర్ చెప్పనివాళ్లకు పన్మిష్‌మెంట్ కూడా ఇస్తూ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. ‘‘ఆగరా.. రేపు నీ పని చెప్తాం’’ అంటూ నా ఫ్రెండ్స్ నావైపు చూసిన గుర్రుచూపు ఇప్పటికీ నాకు గుర్తు. అరేయ్.. నిజంగా టీచర్‌లా చేస్తున్నావ్ కదరా అంటూ మా హెడ్ మాస్టర్, టీచర్లు ఇచ్చిన కాంప్లిమెంట్లు, ఆరోజు సాయంత్రం నాకు బెస్ట్ టీచర్‌గా ఇచ్చిన షీల్డ్.. ఏనాటికి మరిచిపోలేను. నాకే కాదు.. మీలోనూ ఇలాంటి అనుభవాల్లో ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు.
ఈరోజుల్లో.. అలాంటి వేడుకలు కొంత తగ్గినట్లే అనిపిస్తుంది. టెక్నాలజీ, విద్యావిధానాలు కారణాలు ఏమైనా కావొచ్చు. ఇప్పుడు అలాంటి అనుభవాలు తగ్గిపోయాయి. టీచర్స్ డే అంటే ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌లా.. స్కూల్ ఈవెంట్‌లా అతికష్టంలా కనిపిస్తోంది. టీచర్స్ డే వేడుకలు సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోతున్నాయి. ఎంతైనా ఆరోజులే వేరు..
బడిలో మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గురువు ఉంటారు. వారు చూపిన దారే మన ప్రయాణానికి మార్గదర్శకంగా మారుతుంది. అలాంటి వ్యక్తులకు ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఫోన్‌కాల్, ఒక చిన్న “థ్యాంక్యూ” కూడా వాళ్ల హృదయాన్ని తాకొచ్చు.
ఇట్లు..
ఓ నిత్యవిద్యార్థి