ప్రతీకాత్మక చిత్రం
40 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున పిఠాపురం అనే గ్రామం. ఆ ఊరిలోని సర్పంచ్ ఇంటి వరండాలో ఏర్పాటు చేసిన ఏకైక టీవీని చూసి ఊరి ప్రజలంతా హడలిపోతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఏ చిత్రలహరి పాటనో.. సినిమానో.. వార్తలో కాకుండా ఆ ఊరి ప్రజల గుట్టునే ‘‘బ్రేకింగ్ న్యూస్’’గా ప్రసారం చేయడం మొదలుపెట్టింది ఆ టీవీ.
“బ్రేకింగ్ న్యూస్! రామయ్య పొలంలో పని చేయకుండా చెరువుకట్టపై నిద్రపోతున్నాడు!”.. టీవీలో చుక్కలు వస్తూనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పురుషుడి గొంతుతో గట్టిగా చెప్పింది. అది విని అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వుల్లో మునిగిపోయారు. ఆ వెంటనే ‘‘కిష్టయ్య భార్య అతనికి తెలియకుండా టౌన్‌కు వెళ్లి సినిమా చూస్తోంది’’ అనడంతో ఆ నవ్వులు మరింత పెరిగాయి. సీతమ్మ పొరుగింటి వంటకాలు రుచి చూసి.. తనింట్లో వండినవాటిని చెత్తబుట్టలో పడేస్తోంది అనగానే.. సీతమ్మ ముఖం వాడిపోగా జనం అంతా కేరింతలు కొట్టారు. అయితే..
ఆ టీవీ ప్రవర్తిస్తున్న తీరుతో నవ్వులు.. ఆశ్చర్యంలో మునిగిపోయిన ప్రజలు.. నెమ్మదిగా అది చెబుతున్న బ్రేకింగ్ న్యూస్ వింటూ ఆందోళనకు గురయ్యారు. అందుకు కారణం.. అది బయటపెడుతున్న రహస్యాలే!. దాని వల్ల ఊళ్లో వాళ్ల చిచ్చు రాజుకుంటోంది. కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. చివరాఖరికి.. కాపురాలు కూలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే..
ఆ టీవీని కట్టేశారు. దానికి ఉన్న డిష్ యాంటేనాను పీకేయించాడు సర్పంచ్. అయినా అది ‘బ్రేకింగ్ న్యూస్’ చెప్పడం ఆపలేదు. దీంతో ఊరి పెద్ద తలపట్టుకున్నాడు. చివరకు రచ్చబండ దగ్గరకు ప్రజలను ఆహ్వానించాడు. ఇకపై మనం నిజాయితీగా ఉందాం. అప్పుడు టీవీ మనల్ని బ్రేకింగ్ న్యూస్‌గా చూపించే అవకాశం ఉండదు అన్నాడు. దానికి అంతా సరే అన్నారు.
ఆ రోజు నుంచి గ్రామంలో అబద్ధమనేది వినిపించలేదు. మోసాలు తగ్గాయి. ఎవరి ఇళ్లలో వాళ్లు కాపురాలు చేసుకుంటూ హాయిగా గడిపారు. ఆ టీవీ నేర్పిన గుణపాఠంతో నిజాయితీగా జీవిస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఆ టీవీ.. ఎప్పుడు ఏం బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుందా? అని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయింది.
ఇవాళ(నవంబర్ 21..) ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా ఓ చిన్ని కల్పితకథ


