నవ్వే నేరమౌనా? | Sakshi Editorial On Smile | Sakshi
Sakshi News home page

నవ్వే నేరమౌనా?

Jun 16 2025 12:19 AM | Updated on Jun 16 2025 5:38 AM

Sakshi Editorial On Smile

మనుషులకు సహజసిద్ధమైన మనోల్లాస ప్రకటన నవ్వు. మాటలు రాని పసికందుల మొదలుకొని, వయోవృద్ధుల వరకు అందరూ నవ్వుతారు. నవ్వు ఒక విశ్వజనీన భాష. కొందరు అనునిత్యం చిరునవ్వులు చిందిస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇంకొందరు తాము నవ్వుతూ, ఎదుటివారిని కూడా నవ్విస్తుంటారు. 

అరుదుగా అతితక్కువ మంది ఉంటారు – వారు నవ్వరు, ఎదుటివారు ఉల్లాసంగా నవ్వుతూ, ఆనందంగా ఉంటే ఏమాత్రం భరించలేరు. నవ్వేవారు తమను చూసే నవ్వుతున్నారేమోననే భ్రమలోపడి లోలోన కుమిలి కునారిల్లిపోతారు. జీవితంలో నవ్వెరు గని మనుషులను చూసి మిగిలిన లోకం జాలిపడటం తప్ప చేయగలిగిందేమీ లేదు.

నవ్వు ఒక ఆరోగ్య లక్షణం. పసిపిల్లలు బోసినవ్వులు చిందిస్తుంటారు. బాల్యంలో నవ్వే నవ్వుల సంఖ్య వయసు పెరిగిన తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. ఎంత ఎదిగినా పెద్దలు కూడా సమయ సందర్భాలను బట్టి నవ్వుతుంటారు. వైద్య పరిశోధనల ప్రకారం పసిపిల్లలు రోజుకు దాదాపు నాలుగు వందల సార్లు నవ్వులొలికిస్తారు. 

పెద్దలు రోజులో కనీసం ఇరవైసార్లయినా నవ్వుతారు. సంతోషకరమైన జీవితం గడిపేవారు నలభైసార్లకు పైబడి కూడా నవ్వుతారు. ‘నవ్వడం ఒక భోగం; నవ్వించడం ఒక యోగం; నవ్వకపోవడం ఒక రోగం’ అన్నారు జంధ్యాల. నవ్వెరుగని రోగులే హాయిగా నవ్వుతూ కనిపించే మనుషులను చూసి కుళ్లుకుంటారు.

‘ఒకరిని నవ్వమని శాసించలేము; కాని నవ్వవద్దని శాసించినా; నవ్వకూడదని భీష్మించుకొని కూర్చొనినా నవ్వు రాక మానదు... అసలు మన నవ్వుకి కొన్ని చోట్ల అర్థం పర్థం లేకపోవటం కూడ కద్దు’ అని ‘తెలుగు హాస్యం’ రచయిత ముట్నూరి సంగమేశం అన్నారు. ఆయన మాటలు అక్షర సత్యం. నవ్వమని ఎవరో శాసిస్తే నవ్వు రాదు. నవ్వొద్దని ఆంక్షలు విధిస్తే, వచ్చే నవ్వు రాకుండా మానదు. ‘నవ్వు ఒక దిద్దుబాటు చర్య. 

పెడదారి పట్టినవారిని సన్మార్గంలోకి తీసుకురావడానికి, చాదస్తాలను సరిదిద్దడానికి నవ్వు చేయూతనిస్తుంది’ అన్నారు ఫ్రెంచ్‌ తత్త్వవేత్త హెన్రీ బెర్గ్‌సన్‌. ‘నవ్వులేని రోజు దండగ రోజు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్‌. ‘మానవ జాతి చేతిలో గొప్ప ప్రభావవంతమైన ఆయుధం ఉంది, అదే నవ్వు’ అన్నారు అమెరికన్‌ రచయిత మార్క్‌ ట్వైన్‌. నవ్వు అంటే నవ్వులాట కాదు, నవ్వును నిర్వచించడం అంత తేలిక కాదు. నవ్వులోని సంక్లిష్టత నిర్వచనాలకు అందనిది.

‘నవ్వవు జంతువుల్‌ నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్‌/ దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్‌/ పువ్వులవోలె ప్రేమరసముల్‌ వెలిగ్రక్కు విశుద్ధమైనవే/ నవ్వులు సర్వ దుఃఖదమంబులు వ్యాధులకున్‌ మహౌషధుల్‌’ అన్నారు జాషువా. పురాణకాలంలో నవ్వు వల్ల అపార్థాలు, అనర్థాలు వాటిల్లిన సందర్భాలు రెండు ఉన్నాయి. 

వాటిలో ఒకటి మహాభారతంలోని పాంచాలి నవ్వు కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసిన వైనం తెలిసినదే! మరొకటి రామాయణంలో లక్ష్మణుడి నవ్వు. రాముడి పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడికి రెప్పలు మూతబడ్డాయి. పద్నాలు గేళ్ల అరణ్యవాస కాలంలో అన్నాళ్లూ రాని నిద్ర పట్టాభిషేక వేడుక జరుగుతున్నప్పుడే రావాలా అనుకుంటూ లక్ష్మణుడు తనలో తాను నవ్వుకున్నాడు. 

అతడి నవ్వు సీతారాములు సహా ఆ వేడుకలో కొలువుదీరిన వారందరిలోనూ రకరకాల అపార్థాలకు తావిచ్చింది. పాంచాలి నవ్వు అనర్థాలకు దారితీస్తే, లక్ష్మణుడి నవ్వు అపార్థాలకు దారితీసింది. కేవలం ఈ రెండు ఉదంతాలను ఉదహరిస్తూ, ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనే నిర్ధారణకు రావడం పూర్తిగా అసమంజసం. నవ్వులలో రకరకాలు ఉన్నాయి. 

మన ప్రాచీన అలంకారికులు నవ్వులను ఆరు రకాలుగా విభజించారు. అవి: స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం. నవ్వుకు నానా ప్రయోజనాలు ఉన్నాయి. నవ్వు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది; రోగ నిరోధక శక్తిని పెంచుతుంది; గుండె జబ్బులను నివారిస్తుంది. నవ్వు వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతోంది.

రాజరికాలు కొనసాగిన కాలంలో రాజులను నవ్వించడానికి విదూషకులు ఉండేవారు. రాజకీయాలతోను, రణతంత్రాలతోను బుర్రలు వేడెక్కిన ప్రభువులకు విదూషకులు తమ హాస్యంతో మనోల్లాసం కలిగించి, వినోదపరచేవారు. పలువురు ఆస్థాన కవులు చమత్కార పద్యాలతో ప్రభువులను నవ్వించేవారు. నేటి ప్రజాస్వామ్యంలోని ప్రభువుల కంటే రాజరికాల నాటి ప్రభువులే హాస్యాన్ని ఆదరించడంలో చాలా నయం అనిపిస్తారు. 

నవ్వించే విదూషకులకు, కవులకు వారు నజరానాలు ఇచ్చి, గౌరవించేవారు. హాస్యాన్ని ఆస్వాదించాలంటే కాస్త హాస్యప్రియత్వం, చమత్కారాభిరుచి ఉండాలి. ఆనాటి ప్రభువుల్లో అవి కొంత మెండుగా ఉండేవి. హాస్యం కోసం ఆనాటి కవులు బూతులు కూడా ప్రయోగించేవారు. ‘నీతులకేమి ఒకించుక/బూతాడక నవ్వు దొరకు పుట్టదు ధరలో/ నీతులు బూతులు లోక ఖ్యాతులురా’ అన్నాడు చౌడప్ప. 

ఆనాటి కవులు ప్రభువుల తీరుతెన్నులను, సామాజిక పరిస్థితులను తెగనాడటానికి పదునైన వ్యంగ్యంతో అధిక్షేప పద్యాలు రాశారు. ఆ పద్యాల్లోని వ్యంగ్యం కటువుగా ఉన్నా, నవ్వు తెప్పిస్తుంది. అంతమాత్రాన ఆ ప్రభువులెవరూ ఆ కవులను శిక్షించిన దాఖలాలు లేవు. పాపం, సత్తెకాలం మారాజులు వాళ్లు. మనోభావాల శకం మొదలయ్యాక నవ్వుల వివాదాలు న్యాయస్థానాల ముందుకు వెళుతున్నాయి. నవ్వులను తాళలేని పాలకుల విన్యాసాలు నవ్వులపాలవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement