భూలోకానికి వస్తే.. ఏలియన్స్‌ ఏం తింటారు?! | aliens come to Earth: what would they eat | Sakshi
Sakshi News home page

భూలోకానికి వస్తే.. ఏలియన్స్‌ ఏం తింటారు?!

Jul 5 2026 3:26 AM | Updated on Jul 5 2026 3:26 AM

aliens come to Earth: what would they eat

1982 నాటి స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ సూపర్‌ హిట్‌ సినిమా ‘ఇ.టి. – ది ఎక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్‌’లో.. భూమి మీదకు వచ్చి దారి తప్పిన ఒక ఏలియన్‌ని మచ్చిక చేసుకోవటానికి ఎలియట్‌ అనే ఒక చిన్న పిల్లాడు, ఆ ఏలియన్‌కి ‘రీసెస్‌ పీసెస్‌’ చాక్లెట్‌ జెమ్స్‌ని ఎరగా వేస్తాడు. ఒకవేళ నిజంగానే ఏలియన్స్‌ మన భూమి మీదకు వస్తే, అవి చాక్లెట్లు తింటాయా? వేరే ఏవైనా రుచులను కోరుకుంటాయా? శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆ విషయాన్ని కనిపెట్టే పనిలోనే ఉన్నారు!

స్పెయిన్‌లోని వాలెన్సియా యూనివర్సిటీకి చెందిన న్యూట్రిషన్‌ ప్రొఫెసర్‌ జోస్‌ డెల్‌ కాస్టిల్లో చెబుతున్న దాని ప్రకారం, మన భూమి ఏలియన్స్‌కి ఒక ప్రమాదకరమైన విందు లాంటిది. ఒకవేళ ఏలియన్స్‌ శరీరం కూడా మనలాంటి జీవక్రియలతోనే నడుస్తూ ఉన్నా కూడా మనకు జీర్ణమయ్యే ఆహారం వాళ్లకు అరుగుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు.

మరి వాళ్లేం తింటారు?
ఏలియన్స్‌ కనుక భూమి మీదకు వస్తే మనం వండుకునే వంటకాల జోలికి పోకుండా, భూమిపై దొరికే ముడి పదార్థాల మీద పడతారట! ‘ది కాన్వర్జేషన్‌’ అనే జర్నల్‌లో డెల్‌ కాస్టిల్లో రాసిన దానిని బట్టి.. ఏలియన్స్‌ బ్రతకడానికి మన ఫుడ్‌ అక్కర్లేదు. నీరు, నైట్రోజన్, ఫాస్పరస్, ఐరన్, లవణాలు, కొవ్వులు, మైనం, సూక్ష్మజీవులు లేదా సాధారణ సేంద్రీయ అణువుల వంటి ముడి దినుసులు ఉంటే చాలు, వాటినే లాగించేస్తారు.

కానీ ఇక్కడే ఆయన ఒక ట్విస్ట్‌ ఇచ్చారు! సినిమాల్లో ఏలియన్  విమానాలు (యు.ఎఫ్‌.ఓ.లు) వచ్చి భూమి మీద ఉన్న ఆవులను అంతరిక్షంలోకి లాగేస్తుంటాయి కదా? అది కేవలం కల్పితం కాకపోవచ్చని డెల్‌ క్యాస్టిల్లో అంటున్నారు! ఎందుకంటే ఆవులలో ఏలియన్స్‌కి కావలసిన పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయట. కాబట్టి ఆవుల కిడ్నాప్‌ సీన్‌ వెనుక బలమైన సైన్స్ ఉందనే అనుకోవాలి. 

కనీస ఆహారానికి భరోసా
భూమి మీదున్న జంతువుల జీర్ణవ్యవస్థలు ఒక్కోటీ ఒక్కోలా ఉంటాయి. ఉదాహరణకు, ఆవులనే చూడండి. అవి గడ్డిలోని సెల్యులోజ్‌ని అరాయించుకోవాలంటే వాటి కడుపులో ఉండే బ్యాక్టీరియా సహకారం ఉండాలి. భూమ్మీద ఉన్న ప్రాణులకే ఇలాంటి తిప్పలు ఉంటే, ఇక అంతరిక్షం నుంచి వచ్చే ఏలియన్‌ల ‘సహజమైన డైట్‌’ ఎలా ఉంటుందో ఊహించడం దాదాపు అసాధ్యమని కూడా ప్రొఫెసర్‌ డెల్‌ కాస్టిల్లో అంటున్నారు. అయితే, విశ్వంలో ఏ జీవికైనా వర్తించే కొన్ని సార్వత్రిక నియమాలను బట్టి ఏలియన్స్‌ డైట్‌ విషయమై ఒక అంచనాకు రావచ్చు.

సాధారణంగా జీవం మనుగడ సాగించాలంటే మూడు విషయాలు ప్రాథమికం. అవి : ఒక శక్తి వనరు (సోర్స్‌ ఆఫ్‌ ఎనర్జీ), రసాయన చర్యలు జరగడానికి ఒక ద్రవపదార్థం (లిక్విడ్‌), సరైన రసాయన మూలకాలు (కెమికల్‌ ఎలిమెంట్స్‌). ఈ మూడూ మన భూమి మీద సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి ఏలియన్స్ ఇక్కడికి వచ్చి ఆకలితో అలమటించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా చెప్పాలంటే.. బాగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఉన్న ఏలియన్స్ అయితే, భూమ్మీద దొరికే ఏ సేంద్రీయ పదార్థాలనైనా వ్యాక్యూమ్‌ క్లీనర్‌లా జర్రున జుర్రుకొని తమ జీర్ణవ్యవస్థకు సెట్‌ అయ్యేలా ప్రాసెస్‌ చేసుకునే వింత మిషన్లను కూడా వాడుతూ ఉండి ఉండొచ్చు కూడా! 

ఏలియన్‌ న్యూట్రిషనిస్టులు!
మన భూమ్మీద జీవానికి అవసరమైన లవణాలు, కొవ్వులు, చక్కెరలు ఎంత ఉన్నాయో... అంతే స్థాయిలో ప్రమాదకరమైన విషపదార్థాలు, వైరస్‌–బ్యాక్టీరియాలు, ఎలర్జీ కలిగించే సూక్ష్మక్రిములు కూడా ఉన్నాయి. 
‘‘భూమిపై దొరికే ఆహారం వాళ్లకు కచ్చితంగా తినదగినదిగా ఉండాలని రూల్‌ లేదు’’ అని ప్రొఫెసర్‌ డెల్‌ కాస్టిల్లో అంటున్నారు. ‘‘ఒకవేళ వాళ్ల జీర్ణవ్యవస్థ వేరే రకమైన అమైనో ఆమ్లాలను ఉపయోగిస్తుంటే... మన భూమ్మీద దొరికే ప్రోటీన్లు వాళ్లకు ఏమాత్రం పనికిరావు. అలాగే వాళ్ల మెటబాలిజం (జీవక్రియ) గనుక తట్టుకోలేకపోతే.. మన చక్కెరలు కూడా వాళ్లకు వృథా అయిపోతాయి. సుదూర భవిష్యత్తులో మానవాళి నిజంగానే ఏదైనా గ్రహాంతర నాగరికతతో కలిస్తే గనుక, భూమిపై ‘ఏలియన్‌ న్యూట్రిషనిస్టు’లను (గ్రహాంతర పోషకాహార నిపుణులను) తయారు చేయాల్సి ఉంటుందని ప్రొఫెసర్‌ సరదాగా అంటున్నారు.

ఆయన మాటల్లో చెప్పాలంటే: ‘‘ఆ వింత జీవుల శరీరాలు ఏ అణువులను తట్టుకోగలవు? వాళ్లకు ఎంత శక్తి కావాలి? ఏది తింటే వాళ్లు చచ్చిపోతారు? వాళ్లు తమతో పాటు ఎలాంటి సూక్ష్మజీవులను మోసుకొస్తున్నారు? మన భూమి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా వాళ్లు ఇక్కడి ఏ వనరులను వాడుకోవచ్చు?.. ఇవన్నీ లెక్కగట్టే నిపుణులు మనకు అత్యవసరం.’’ అయితే ఈ వివరాలన్నీ ఆ ఏలియన్‌ ఏ గ్రహానికి చెందినవారు, వారి బాడీ టైప్‌ ఏంటి అనేదానిపై ఆధారపడి ఉన్నప్పటికీ... సైంటిస్టులు ఇప్పటి నుంచే వాళ్లకు రోజుకి ఎన్ని క్యాలరీల శక్తి కావాలో అంచనా వేయడం మొదలు పెట్టేశారు!

కనీసం 3 వేల క్యాలరీలు
భూమ్మీద ఉన్న జంతువుల లెక్క ప్రకారం... ఒక ప్రాణి పరిమాణం పెరిగేకొద్దీ, దానికి కావలసిన క్యాలరీల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ, అది ఒకే నిష్పత్తిలో పెరగదు. పరిమాణం రెట్టింపు అయితే క్యాలరీలు రెట్టింపు కావు. ఉదా: ఒక ఎలుకతో పోలిస్తే ఏనుగుకి ఎక్కువ శక్తి కావాలి. కానీ, శరీర బరువు నిష్పత్తి చూసుకుంటే, ఏనుగు వాడే క్యాలరీలు ఎలుక కంటే తక్కువగా ఉంటాయి.

ఈ లెక్కన ఒక 70 కేజీల బరువున్న ఏలియన్ కి రోజుకు దాదాపు 1,700 క్యాలరీల శక్తి కావాలి. అదే బాగా లావుగా ఉండి, ఒక 150 కేజీల బరువున్న ఏలియన్‌ అయితే... ఒకే చోట కదలకుండా కూర్చోవడానికే ఆ ఏలియన్‌కు రోజుకు 3,000 క్యాలరీలకు పైగా శక్తి అవసరమవుతుంది. అయితే ఇది కేవలం ఆ జీవి ప్రాణాలతో ఉండటానికి కావలసిన కనీస  క్యాలరీల లెక్క మాత్రమే! ఏలియన్స్‌ నడవాలన్నా, ఆలోచించాలన్నా, స్పేస్‌ షిప్‌ మిషన్లను ఆపరేట్‌ చేయాలన్నా, యు.ఎఫ్‌.ఓ.లను నడపాలన్నా అందుకు కావాల్సిన అదనపు ఎనర్జీ లెక్క వేరే ఉంటుంది

అసలు తిండి అవసరమా?!
చాలామంది సైంటిస్టుల అంచనా ప్రకారం అంతరిక్షం నుండి మనల్ని చూడటానికి వచ్చే మొదటి గ్రహాంతరవాసి, రక్తమాంసాలతో ఉన్న ప్రాణి కాకపోవచ్చు. అది ఒక యాంత్రిక శోధన నౌక (రోబోటిక్‌ ప్రోబ్‌) అయ్యుండే అవకాశమే ఎక్కువ. పైగా ఆ ఏలియన్స్‌ కనుక బాగా అడ్వాన్స్‌ అయిపోయినవి కనుకైతే, ఈసరికి తమ ‘మాంసపు ముద్ద’ లాంటి శరీరాలను వదిలేసి కృత్రిమ దేహాలతో రోబోటిక్‌ అవతారాలుగా మారిపోయి ఉండొచ్చు. ప్రొఫెసర్‌ డెల్‌ కాస్టిల్లో చెబుతున్నట్లు ‘‘వాళ్ల ‘ఫుడ్‌’.. ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కావు. కేవలం విద్యుత్, వేడి, కెమికల్‌ ఫ్యూయల్‌ లేదా న్యూక్లియర్‌ ఎనర్జీ మాత్రమే! అంటే ఒక సాకెట్‌ చూసుకుని, అందులో ప్లగ్‌ పెట్టి, తన బ్యాటరీని రీఛార్జ్‌ చేసుకోవటమే ఆ ఏలియన్‌కి కావలసింది. 

ఇంతవరకూ ఎందుకు రాలేదు? 
ఏలియన్స్‌ భూమి మీదకు రాలేకపోవటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉండి వుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. 

టెక్నాలజీ లేకపోవడం: తెలివైన ఏలియన్స్ ఉన్నప్పటికీ... మనతో కమ్యూనికేట్‌ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ వాళ్ల దగ్గర లేకపోవచ్చు.
అనంతమైన దూరాలు: రెండు నాగరికతల మధ్య దూరాలు మరీ ఎక్కువగా ఉండటం. ఉదాహరణకు రెండు గ్రహాల మధ్య దూరం కొన్ని వేల కాంతి సంవత్సరాలు ఉందనుకోండి... ఒకరికొకరు మెసేజ్‌ పంపుకుని, అది చేరేలోపే ఆ రెండు నాగరికతల్లో ఒకటి లేదా రెండూ కూడా పూర్తిగా అంతరించిపోవచ్చు!
జూ హైపోథెసిస్‌: ఇది వింటే పిచ్చెత్తి పోతుంది. 
ఈ సిద్ధాంత ప్రకారం.. తెలివైన ఏలియన్స్ ఇప్పటికే మన చుట్టూనే ఉన్నారు! కానీ భూమి మీద ఉన్న జీవజాలం సహజంగా ఎదగాలని, మనల్ని ఒక ‘జూ’ లో జంతువులను చూసినట్లు దూరం నుండి చూస్తూ... కావాలనే మనకు దొరక్కుండా తప్పుకు తిరుగుతున్నారు!

తినే పనైతే ఎంత తింటాయి?
బుజ్జి ఏలియన్స్: వీళ్లు చూడటానికి పచ్చగానో, బూడిద రంగులోనో ఉండి, 25 నుండి 40 కేజీల బరువు ఉంటారు. వీళ్లకు రోజుకు 800 నుండి 1,100 క్యాలరీల శక్తి ఉంటే సరిపోతుంది. కానీ సినిమాల్లో చూపించినట్లు వీళ్ల శరీరం కంటే తల పెద్దగా ఉండి, అందులో మహా చురుకైన ‘పెద్ద బ్రెయిన్‌’ గనుక ఉంటే... ఈ క్యాలరీల లెక్క ఇంకాస్త పెరగొచ్చు! 

రెప్టీలియన్‌ ఏలియన్స్: వీళ్లు గుడ్లు పెట్టే భూచర జీవుల వంటివారు. ఒకవేళ ఈ ఏలియన్స్ గనుక బల్లి, ఊసరవెల్లి లాంటి శీతల రక్త జీవులైతే... 100 కేజీల బరువున్నా సరే, వీళ్లు చాలా తక్కువ క్యాలరీలతోనే నెట్టుకొచ్చేస్తారు. అలా కాకుండా... వాళ్లు మహా తెలివైన, చురుకైన వాళ్లు అయితే మాత్రం 150 కేజీల బరువుండే ఒక ఏలియన్‌కు రోజుకు కనీసం 3,000 క్యాలరీలు తప్పనిసరి. 

పొడుగు బాబులు: మనుషుల్లో ఉన్నట్లే పొడవుగా ఉండే ఏలియన్స్‌ వీళ్లు. వీళ్ల శరీరం అచ్చం మన మనుషుల లాగే ఉంటుంది. కాబట్టి, ఒక 80 నుండి 90 కేజీల బరువుండే ఈ పొడవాటి హ్యూమనాయిడ్‌ ఏలియన్స్కి రోజుకు 1,900 నుండి 2,300 క్యాలరీల ఆహారం అవసరమవుతుంది.

మానవాళికి పొంచి ఉన్న ప్రమాదం!
మన పాలపుంతలో సుమారు 20,000 నుండి 40,000 కోట్ల నక్షత్రాలు, 10,000 కోట్ల గ్రహాలు ఉన్నాయని అంచనా. మరి ఇన్ని కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు, ఒక్క ఏలియన్‌ కూడా ఇంతవరకు మనకు ఎందుకు తారసపడలేదు? ఈ వైరుధ్యాన్నే ‘ఫెర్మీ పారడాక్స్‌’ అంటారు. ఇటాలియన్‌ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ పేరు మీదుగానే ‘ఫెర్మీ పారడాక్స్‌’ పేరు వచ్చింది. ఆయన 1950లోనే ఈ ప్రశ్నను ప్రపంచం ముందుకు తెచ్చారు.

అంతరిక్షం అనంతంగా ఉన్నప్పుడు, కనీసం ఒక్క గ్రహాంతర సంకేతం గానీ, వాళ్లు కట్టిన వింత కట్టడం గానీ మన కంటికి చిక్కకపోవడం చాలా విచిత్రం అన్నారు. చివరికి ఆయన ఒక ముగింపునకు వచ్చారు. విశ్వంలో తెలివైన, టెక్నాలజీ ఉన్న, అంతరిక్షాన్ని జయించగల నాగరికతలు ఎదగకుండా అడ్డుకునే అడ్డంకి ఏదో ఉందంటారు ఫెర్నీ. ఆ ‘అడ్డు’నే శాస్తవేత్తలు ‘ది గ్రేట్‌ ఫిల్టర్‌’ అని పిలుస్తున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... ఆ అడ్డు తొలగిపోయే ప్రమాదం గతంలో జరగకుండా ఉంటే, ఆ ప్రమాదం కచ్చితంగా మానవాళి భవిష్యత్తులో పొంచి ఉన్నట్లే!

వినాశనం తప్పదా?!
బ్రిటిష్‌ భౌతిక శాస్త్రవేత్త బ్రయాన్‌ కాక్స్‌ ఊహ ప్రకారం.. ఒక నాగరికత నక్షత్రాలను జయించే స్థాయికి ఎదగడానికి తోడ్పడే సైన్స్, ఇంజనీరింగ్‌ టెక్నాలజీలే... ఆ నాగరికత సర్వనాశనానికి కూడా కారణమవుతాయి. ఆయన మాటల్లో చెప్పాలంటే: ‘ఫెర్మీ పారడాక్స్‌కి ఒక సమాధానం ఏంటంటే... తనని తాను సర్వనాశనం చేసుకోగల శక్తి ఉన్న ప్రపంచాన్ని ఎక్కువ కాలం నడపడం ఏ జీవికైనా అసాధ్యం. సైన్స్, ఇంజనీరింగ్‌ పెరిగే వేగంతో పోలిస్తే... దేశాలను నడిపే రాజకీయ చాణక్యం, పరిణతి పెరగవు. అదే చివరకు మహా విపత్తుకు దారితీస్తుంది! అంటే.. ఏలియన్స్ స్పేస్‌ షిప్‌ కనిపెట్టే లోపే, అణుబాంబులు వేసుకుని మానవాళి కనుమరుగైపోతుందన్నమాట!

∙ సాక్షి స్పెషల్‌ డెస్క్‌ 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement