రోజుకు 3 గంటలు చూసేస్తున్నారు.. అమేజాన్‌ సర్వేలో షాకింగ్‌ విషయాలు

85 pc Indian parents worry about kids spending excessive screen time during summer vacations - Sakshi

సర్వే/ పేరెంటింగ్‌

వేసవి సెలవుల్లో పిల్లలు కనీసం 3 గంటలు ఫోన్‌ లేదా కంప్యూటర్‌ స్క్రీన్‌తో గడుపుతున్నారని దేశంలో 85 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టు ‘అమేజాన్‌’ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. దీనివల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుందని వారు భయపడుతున్నారు. పిల్లల్ని ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో పెట్టాలని వారంతా కోరుకుంటున్నారు. కాకుంటే పిల్లల్ని స్క్రీన్‌ మీద నుంచి దృష్టి మళ్లించేలా చేయడమే అసలు సమస్య.

మన దగ్గర సమయం లేక పిల్లల్ని ఎలా ఎంగేజ్‌ చేయాలో తెలియక వారి చేతుల్లో పెడుతున్న ఫోన్‌ ఇవాళ విశ్వరూపం చూపిస్తున్నదని అమేజాన్‌ సంస్థ తాజాగా కాంటార్‌ అనే ఏజెన్సీ ద్వారా నిర్వహించిన సర్వే చెబుతోంది. 10 మెట్రో, నాన్‌ మెట్రో నగరాల్లో 750 మంది తల్లిదండ్రులను సర్వే చేయగా 69 శాతం మంది ఇప్పుడు మొదలైన వేసవి సెలవుల్లో పిల్లలు మూడు గంటలకు మించి ఫోన్‌గాని కంప్యూటర్‌ స్క్రీన్‌గాని చూస్తున్నారని అంగీకరించారు. మొత్తం 85 శాతం మంది తమ పిల్లలు అవసరానికి మించి ఫోన్‌లు చూస్తున్నారని ఇందుకు తాము చాలా ఆందోళన చెందుతున్నామని తెలియచేశారు. అంతంత సేపు వాళ్లు ఫోన్‌ చూడటం వల్ల మజ్జుగా ఉండటమే కాదు సోమరులుగా తయారవుతున్నారు. నిద్ర లేమితో బాధపడుతున్నారు అని తెలియచేశారు.

► రెక్కలు కత్తిరించి
అయితే ఈ తప్పు పిల్లలదా? వారు నిజంగా ఆడుకోరా? గెంతరా? అల్లరి చేయరా? అంటే చేస్తారు. కాని ఆటస్థలాలు లేకపోవడం, వీధుల్లో ఆడలేకపోవడం, అపార్ట్‌మెంట్‌లలో సెల్లార్‌లు ఉన్నా ఆడటానికి కమిటీలు అంగీకరించకపోవడం, పార్క్‌లు నామమాత్రంగా ఉండటం... వీటన్నింటి వల్ల రోజువారి జీవితంలో బడి నుంచి వచ్చాక మాత్రమే వారు ఫోన్‌ చేతిలోకి తీసుకునేవారు. తల్లిదండ్రుల ఉద్యోగాల వల్లో, పని వొత్తిడి వల్లో, పిల్లలతో గడిపే సమయం వారు తమ ఫోన్‌కు ఇస్తున్నందు వల్లో పిల్లలు ఫోన్‌ చూస్తున్నా చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. ఇప్పుడు వేసవి సెలవుల్లో వారికి ఆ అలవాటు వ్యసనం స్థాయికి వెళ్లడం, నివారిస్తే అలగడం మనస్తాపం చేస్తుండటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.

► ఇలా చేయాలని ఉంది
సర్వేలో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులను ‘మీ పిల్లలు ఈ సెలవుల్లో ఏం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు’ అనే ప్రశ్నకు ఇంగ్లిష్‌ నేర్చుకోవడం (50 శాతం), నైతిక విషయాలు సంఘ మర్యాదలు తెలుసుకోవాలి (45 శాతం), కళలు నేర్చుకోవాలి (36 శాతం), ఆడుకోవడం విహారాలు చేయడం (32 శాతం) సమాధానం చెప్పాలి. అందరూ ఆశిస్తున్నది విజ్ఞానం వినోదం కలగలిసి ఉంటే బాగుంటుందని. ‘పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటారు. ఫోన్‌ చూసే సమయాన్ని తగ్గించి కొత్త విషయాలు నేర్పించడంలో వారిని ఉత్సాహపరచాలని ఉంది అని చాలామంది తల్లిదండ్రులు మాతో అన్నారు’ అని సర్వే చేసిన కాంటార్‌ ఏజెన్సీ ప్రతినిధి తెలియచేశారు.

► మెల్లగా మళ్లించాలి
స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించాలంటే అది ఒక్కసారిగా బంద్‌ చేయకుండా మెల్లగా తగ్గించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఫోన్‌లు రీచార్జ్‌ చేయకుండా నిరుత్సాహ పరచడం, ఇంట్లో రౌటర్‌ ఉంటే దానిని తరచూ ఆఫ్‌ చేస్తూ ఉండటం, ఈ పుస్తకం చదివితే ఫోన్‌ ఇస్తాను, కాసేపు ఆడుకుంటే ఇస్తాను, ఫ్రెండ్స్‌ను కలిసి వచ్చాక ఇస్తాను అని వారిని దారి మళ్లించడం, విహారాలకు తీసుకెళ్లడం, ఆడుకునే సమయం– కథలు చదివే సమయం– ఫోన్‌ సమయం అని టైమ్‌ విభజించి ఆ టైమ్‌ పాటించడం... అలా మెల్లగా ఫోన్‌ టైమ్‌ను తగ్గించాలి.

పిల్లలు ఫోన్‌ చూడటం వల్ల వారి మానసిక, బౌతిక స్థితుల కంటే వారు చూస్తున్నది ఆరోగ్యకరమైనదో కాదో పరిశీలించే తీరికలో కూడా తల్లిదండ్రులు లేకపోతే అట్టి సర్వేలకు అందనంత తీవ్ర ఆందోళన చెందాల్సిందే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top