
ఈ నెల 30న జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)పాసింగ్ ఔట్ పరేడ్ చారిత్రక సందర్భం కానుంది. ‘ఎన్‌డీఏ’లో తొలిసారిగా 17 మంది మహిళా క్యాడెట్స్ ఉన్నారు. ఫస్ట్‌బ్యాచ్‌కు చెందిన పదిహేడు మంది మహిళలు ‘ఎన్‌డీఏ’తో తమకు ఉన్న మూడు సంవత్సరాల అనుభవాన్ని, అనుబంధాన్ని పంచుకున్నారు...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎన్‌డీఏ, నావల్ అకాడమీ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులైన మహిళలను అనుమతించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. 2021 ఆగస్ట్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఎన్‌డీఏలోకి మహిళా క్యాడెట్‌ల వ్రవేశానికి మార్గం సుగమం అయింది.
‘ఆర్మీ కుటుంబం నుంచి వచ్చాను. నా కుటుంబ సైనిక నేపథ్యమే నేను సైన్యంలోకి రావడానికి స్ఫూర్తిని ఇచ్చింది. మా నాన్న సైన్యంలో హవల్దార్‌గా పనిచేశారు. మా తాత కూడా సైన్యంలో పనిచేశారు. అకాడమీ గురించి ఒక మాట చెబుతుంటారు... అకాడమీ ఫస్ట్ బ్రేక్స్ యూ అండ్ దెన్ మేక్స్ యూ. ట్రైనింగ్‌లో ఇది అక్షర సత్యం అని తెలుసుకున్నాను’ అంటుంది పదిహేడుమంది క్యాడెట్స్‌లో ఒకరైన హర్ సిమ్రాన్ కౌర్.‘సైన్యం అనే భావన నా రక్తంలోనే ఉంది. నా తండ్రి మాజీ ఎన్‌డీఏ ఆఫీసర్. నా సోదరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసింది’ అంటుంది శుృతి ‘ఫస్ట్ బ్యాచ్‌కు చెందిన మహిళలుగా మేము ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది’ అంటుంది హర్‌సిమ్రాన్ కౌర్.
‘లింగ వివక్షత ఎక్కడా కనిపించలేదు. అందరినీ సమానంగా చూశారు. మేము ఇక్కడ ఒక కుటుంబంలా ఉన్నాం. కష్టసుఖాలను పంచుకున్నాం. పరుగు నుంచి కొండలు ఎక్కడం వరకు అన్నిటిలోనూపోటీ పడ్డాం. ఎన్‌డీఏలో మహిళలు అడుగుపెట్టడం అనేది మహిళాసాధికారతకు, సాయుధ బలగాలలోపాలుపంచుకోవాలన్న యువ మహిళల ఆకాంక్షకు అద్దం పడుతుంది’ అంటుంది కేడెట్ ఇషితా శర్మ.
‘ఎన్‌డీఏలో ఇచ్చే శిక్షణ కఠినంగా ఉంటుందని తెలిసినా ఎప్పుడూ బెదరలేదు. ఎన్‌డీఏలోకి రావడానికి ముందు పరిస్థితి ఎలా ఉన్నా, ఇప్పుడు మాత్రం ఎలాంటి విపత్కరమైన పరిస్థితి అయినా తట్టుకొనే సామర్థ్యం, ధైర్యసాహసాలు వచ్చాయి. ఇక్కడ ఇచ్చిన శిక్షణ మమ్మల్ని తీర్చిదిద్దింది. మానసికంగా దృఢత్వాన్ని తీసుకువచ్చింది’ అంటుంది బెటాలియన్ కెప్టెన్ క్యాడెట్ రీతుల్.
గతంలోకి వెళితే...
ఎన్‌డీఏలో మహిళల ప్రవేశానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై కొందరికి సందేహాలు వచ్చాయి. ‘ఇంతకీ నిరూపించుకుంటారా?’ ‘బ్రహ్మాండంగా’ అని చెప్పడానికి ఎన్‌డీఏలో ఫిమేల్ క్యాడెడ్స్ ప్రతిభ కొలమానం. తిరుగులేని సమాధానం. మహిళా క్యాడెట్లు ఎన్నో హద్దులను అధిగమించారు. అకాడమిక్ పెర్‌ఫార్‌మెన్స్‌లోనే కాదు పీటి, డ్రిల్‌లోనూ మెరిట్ కార్డ్ సాధించారు.
సవాళ్లను అధిగమించి సత్తా చాటారు
శిక్షణ పూర్తి చేసుకున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లోని ఉమెన్ క్యాడెడ్స్ కళ్లలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. ‘మా కోర్సులను విజయవంతంగా పూర్తి చేశాం. ఎంతో సవాలుతో కూడిన క్యాంప్ రోవర్స్, క్యాంప్ టోర్న, క్యాంప్ గ్రీన్‌లను అవలీలగా పూర్తి చేశాం’ అంటుంది ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ రీతుల్. ‘పదిహేడుమందిలో ఎవరి స్థాయిలో వారు సత్తా చాటారు’ అంటుంది ఇషితా శర్మ.