అ ఆ లు ప్రతి ఇంటికీ రావాలి

104-year-old Kuttiyamma Scores 89percent In Kerala Basic Literacy Exam - Sakshi

104 ఏళ్ల కేరళ కుట్టియమ్మ పరీక్షలు రాసి పాసవడం చూశాం. ఆమెకేనా ఆ అదృష్టం? ఐదారు దశాబ్దాల క్రితం పుట్టిన చాలా మంది స్త్రీలు చదువుకు నోచకనే జీవితంలో పడ్డారు. ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలుగా ఉన్న వారంతా కుట్టియమ్మకు మల్లే చదువుకోవాలని అనుకోవచ్చు. కేరళలో ఇలాంటి స్త్రీల కోసం ఇంటికి వచ్చి చదువు చెప్పే ప్రభుత్వ వాలంటీర్లు ఉన్నారు. కుట్టియమ్మ అలా ఇంట్లోనే చదివింది. దేశమంతా ఇలా అఆలు ఇళ్ల తలుపు తట్టాల్సి ఉంది. వెలుతురు నవ్వు చూడాల్సి ఉంది.

‘అ’ అంటే అమ్మ అని పుస్తకాల్లో చదువుకుంటాం. ఇక మీదట ‘అ’ అంటే ‘అవ్వ’ అని చదవాలమో. కుట్టియమ్మ అనే అవ్వ ఇప్పుడు ఆ మేరకు వార్తలు సృష్టిస్తోంది. దానికి కారణం ఆమె వయసు 104. ఆమె పరీక్షల్లో సాధించిన మార్కులు 100కు 89. మొన్నటి నవంబర్‌ 10న ఆమె ఈ పరీక్షలో కూచుంది. ఇంకేంటి. ఆమె పేరు మారుమోగదా? కేరళలోని కొట్టాయం జిల్లాలోని ‘అయర్‌ కున్నమ్‌’ అనే పంచాయతీకి చెందిన కుట్టియమ్మను చూడటానికి ఇప్పుడు ఆ ఊరికి కార్లు వస్తున్నాయి. అందులో నాయకులు వస్తున్నారు. కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్‌ కుట్టి ఆమెను సత్కరించి ‘అక్షర ప్రపంచంలోకి స్వాగతం’ అన్నాడు. ఆమె ఇలా చదువుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అన్నాడు. ఇంతకు మించిన స్ఫూర్తి ఏముంటుంది ఏ వయసులో అయినా చదువుకోవడానికి.

రెండు నెలల్లో చదివి
కుట్టియమ్మ కథ దేశంలోని లక్షల మంది స్త్రీల కథే. ఆమెకు చదువుకునే వీలు కలగలేదు. 15 ఏళ్లకే పెళ్లి అయ్యింది. ఇప్పటికి ఆమె తన వంశంలో ఏడు తరాలను చూసింది. కాని ఆమెకు చదువుకోవాలని ఉండేది. అక్షరాలను గుణించుకుని న్యూస్‌పేపర్‌ చదివే ప్రయత్నం చేసేది. కాని ఆమె పెన్ను పట్టుకుని రాయలేదు. కేరళ ప్రభుత్వం ‘సాక్షరతా మిషన్‌’లో భాగంగా ‘సాక్షరతా ప్రేరకులు’ పేరుతో వాలంటీర్‌లను నియమించి ఇలాంటి మహిళల కోసం ఇంటింటికి వెళ్లి చదువు చెప్పే ఏర్పాటు చేసింది. అలా ఫెహరా జాన్‌ అనే వాలంటీర్‌ ఆమె ఇంటికి వచ్చి చదువు చెప్పింది. ‘టీచర్‌ను చూసి ఆమె చిన్నపిల్లలా ఉత్సాహపడింది’ అని కుట్టియమ్మ కుటుంబ సభ్యులు చెప్పారు.


పరీక్ష రాస్తున్న కుట్టియమ్మ
‘ఆమె షరతు ఒక్కటే. పెద్దగా పాఠం చెప్పమని. ఎందుకంటే ఆమెకు సరిగా వినపడదు. నేను అరిచి చెప్పేదాన్ని. సాక్షరతా మిషన్‌లో భాగంగా కేరళలోని ప్రతి పంచాయితీలో ప్రాథమిక పరీక్షను నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాసైతే 4వ తరగతి స్థాయి పరీక్ష రాయవచ్చు. ప్రాథమిక పరీక్షలో మలయాళం, లెక్కలు, జనరల్‌ నాలెడ్జ్‌ ఉంటాయి. పరీక్షకు కేవలం రెండు నెలల ముందే ఆమెకు చదువు మొదలయ్యింది. రెండు నెలల్లోనే ఆమె బాగా పాఠాలు నేర్చుకుంది. అంతే కాదు పెన్ను పట్టి అక్షరాలు రాయడం మొదలెట్టి మార్కులు కూడా తెచ్చుకుంది’ అంది ఫెహరా జాన్‌. ‘ఆమె గుచ్చి గుచ్చి అడిగి మరీ తెలుసుకునేది. నస పెట్టడం అంటారు చూడండి. అలా’ అని నవ్వుతుంది ఆ పెద్ద వయసు స్టూడెంట్‌ కలిగిన చిన్న వయసు టీచర్‌.

కర్ర పెండలం, చేపలు
కుట్టియమ్మకు 104 సంవత్సరాలు ఉన్నా ఇంకా చురుగ్గా ఉంది. బి.పి, షుగర్‌ లేవు. కళ్లద్దాలు కూడా లేవు. రాత్రి పూట చూపు ఆనదు. వినపడదు. అంతే. ‘ఆమె ఉదయం పూట టిఫిన్‌ రాత్రి భోజనం తప్ప మధ్యలో ఏమీ తినదు. అవి కూడా కొంచెం కొంచెమే తింటుంది. మధ్యాహ్నం ఆమెకు పడుకునే అలవాటు లేదు. ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు చేపలు, కర్రపెండలం ఇష్టం.’ అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ వయసులో చదువుకోవడం వల్ల ఇప్పుడు ఆమెకు మాత్రమే కాక ఆమె ఇంటికి కూడా గుర్తింపు వచ్చింది.

ఇతరుల సంగతి ఏమిటి?
ఏ మనిషికైనా తన పేరు తాను రాసుకోగలగడం, తన పేరును తాను చదువుకోగలడం ప్రాథమిక అవసరం. దేశంలో సంపూర్ణ అక్షరాసత్య కార్యక్రమాలు మొదలయ్యి ఇన్నాళ్లవుతున్నా అందరినీ అక్షరాస్యులు చేసే పని అంత సజావుగా సాగడం లేదు. కేరళలో మాత్రం 1989లోనే ‘కొట్టాయం’ జిల్లా సంపూర్ణ సాక్షరతను సాధించిన జిల్లాగా పేరు పొందింది. సాక్షరతా సూచిలో తమ రాష్ట్రం ముందుండేలా ఆ రాష్ట్రం నిరంతరం శ్రద్ధ పెడుతూనే ఉంది. ఇలా ప్రతి రాష్ట్రంలో చదువు, జ్ఞానం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఏ వయసులోనైనా ఉంది. స్త్రీలు ఎన్నో దశాబ్దాలుగా అక్షరానికి దూరమై ఉన్నారు. వారి కోసం కొంత కాలం ప్రభుత్వాలు రాత్రి బడులు నిర్వహించాయి. ఇప్పుడు అలాంటి పని జరగడం లేదు. కేరళ వంటి చోట చదువే అలాంటి వారి ముంగిట్లోకి వస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఆ వెలుగు ఇంటింటికి చేరాల్సి ఉంది. కుట్టియమ్మ చూపిన పట్టుదల చదువుకు నోచుకోని ప్రతి మహిళా చూపితే, అందుకు వ్యవస్థలు మద్దతుగా నిలిస్తే దేశం నిజమైన వికాసంలోకి అడుగు పెడుతుంది.

ఇంట్లో తన టీచర్‌ దగ్గర చదువుతూ...
జ్ఞానం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఏ వయసులోనైనా ఉంది. స్త్రీలు ఎన్నో దశాబ్దాలుగా అక్షరానికి దూరమై ఉన్నారు. కేరళ వంటి చోట చదువే అలాంటి వారి ముంగిట్లోకి వస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఆ వెలుగు ఇంటింటికి చేరాల్సి ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top