ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Nov 29 2026 1:34 PM | Updated on Nov 29 2026 1:34 PM

కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి

కై కలూరు/కలిదిండి: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కై కలూరు నియోజకవర్గంలోని కై కలూరు, కలిదిండి మండలాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను శనివారం ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో రెండో విడత కింద 8 మండలాల్లోని 160 పంచాయతీల సర్పంచ్‌లు, 1,219 వార్డు సభ్యుల స్థానాలకు 2,024 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుందని, నిర్ణీత సమయానికి కేంద్రంలో ఉన్న వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు. అనంతరం అదే కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో 673 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. సిబ్బంది శిక్షణలో నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకుని, ఎన్నికల సంఘం నిబంధనలను తప్పకుండా పాటిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌డీఓ విజయలక్ష్మి, ఇరు మండలాల తహసీల్దార్లు ఆర్‌. రామకృష్ణ, ఎల్‌వీఎస్‌. రామకృష్ణ, ఎంపీఓలు జి. అప్పారావు, జి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రబీలో సాగు, తాగునీటి కొరత రానివ్వొద్దు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌లో సాగు, తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. సాగునీటి లభ్యత, ఆయకట్టుకు నీటి పంపిణీ, తాగునీటి కేటాయింపులపై అధికారులు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గోదావరి డెల్టా పరిధిలో రబీ అవసరాలకు 103 టీఎంసీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 87.75 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. దీనిని అధిగమించేందుకు వంతుల వారీ విధానంలో శివారు భూములకూ నీరందేలా చూడాలని, మార్గమధ్యలో మోటార్లతో నీటిని తోడకుండా నిఘా పెట్టాలని సూచించారు. తాగునీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపాలన్నారు. అలాగే తమ్మిలేరు, ఎర్రకాల్వ, కొవ్వాడ కాల్వ, జల్లేరు ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు నీరందించాలని, కాల్వల్లో పూడికతీత (డీసిల్టింగ్‌), చెత్త తొలగింపు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతులందరినీ పంటల బీమా పథకంలో నమోదు చేయించాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ జి. గుణకనకారావు, ఈఈలు సి.హెచ్‌. దేవప్రకాశ్‌, కొడాలి బాబు, జె. జగదీశ్‌, పి. ఆంజనేయులు, డీఏఓ హబీబ్‌ భాషా, ఉద్యాన శాఖ డీడీ సాజా నాయక్‌, భూగర్భ జలశాఖ డీడీ కోదండరామ్‌, సాగునీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

చింతలపూడి భూసేకరణ వేగవంతం చేయాలి

జిల్లాలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రాజెక్టు భూసేకరణ, ఇతర పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు. సమావేశంలో జేసీ ఎం.జె. అభిషేక్‌ గౌడ్‌, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బి. వినూత్న తదితరులు పాల్గొ్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement