ఎమ్మెల్యే చిర్రికి ఘోర పరాభవం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చిర్రికి ఘోర పరాభవం

Nov 29 2026 1:34 PM | Updated on Nov 29 2026 1:34 PM

ఎమ్మెల్యే చిర్రికి ఘోర పరాభవం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరుస వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు పంచాయతీ ఎన్నికల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ ఓటర్లతో పాటు సొంత ఊరి ప్రజలు, పార్టీ నేతలు సైతం ఆయన తీరును వ్యతిరేకిస్తూ గట్టి షాక్‌ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే సన్నిహితురాలు, తండ్రి, సోదరుడి భార్య ముగ్గురూ ఓటమి పాలవ్వడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

పరింపూడిలో ఫలించని వ్యూహం:

కొయ్యలగూడెం మండలంలోని 11,806 ఓట్లు ఉన్న పరింపూడి మేజర్‌ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు అయిన మట్టా వనజాలక్ష్మి చివరి నిమిషంలో జనసేనలో చేరి సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఎమ్మెల్యే బాలరాజు తన సన్నిహితురాలు ఓడూరి భారతిని పోటీలో నిలిపి, పార్టీ అంతా ఆమెకే మద్దతునిస్తుందని ప్రకటించారు. వారం రోజుల పాటు పరింపూడిలోనే మకాం వేసి భారతి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. జనసేన అభ్యర్థిని వనజాలక్ష్మి 2,800 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించగా, భారతి కేవలం 1,242 ఓట్లకే పరిమితమయ్యారు. గతంలో ఇసుక, మట్టి వసూళ్ల విషయంలో పరింపూడి సొసైటీ అధ్యక్షుడు దుగ్గిన శ్రీనివాస్‌ను భారతి బహిరంగంగా నిలదీసిన వీడియో వైరల్‌ కాగా, తాజా ఎన్నికల్లో అదే శ్రీనివాస్‌ ఇంటి నుంచే ఆమె క్యాంప్‌ నిర్వహించడం గమనార్హం. సొంతూరిని విస్మరించడంతో..

పరింపూడిపైనే పూర్తి దృష్టి పెట్టిన ఎమ్మెల్యే, తన స్వగ్రామమైన జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం పంచాయతీని పట్టించుకోలేదు. అక్కడ సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన సోదరుడి భార్య చిర్రి సుమాంజలికి 1,289 ఓట్లకు గాను కేవలం 179 ఓట్లు మాత్రమే దక్కాయి. టీడీపీ మద్దతు ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన వనమా రమణ 580 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ఇక ఇదే పంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసిన ఎమ్మెల్యే తండ్రి చిర్రి కృష్ణయ్యకు కేవలం ఏడు ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. సొంత పార్టీ శ్రేణులను కలుపుకొని పోకపోవడం, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో వైఫల్యమే ఈ పరాజయాలకు కారణమని నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది.

పల్లె పోరులో పోలవరం ఎమ్మెల్యేకు దిమ్మతిరిగే షాక్‌

స్వగ్రామంలో తండ్రి, సోదరుడి భార్యకుఘోర పరాజయం

పరింపూడిలోనూ సన్నిహితురాలికి ఓటమి

సొంత పార్టీ నేతల వ్యతిరేకతే కారణమంటూ చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement