భీమడోలు: కౌలు వ్యవసాయంలో వరుస నష్టాలు, పెరిగిన అప్పుల భారం ఒక రైతు కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుమందు తాగిన కౌలు రైతు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే పూళ్ల గ్రామానికి చెందిన సనపల అప్పన్న (50) ఎనిమిది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. అక్టోబర్ మొదటి వారంలో సంభవించిన వరుస తుపాన్ల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిని సుమారు రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లింది. కౌలు సాగు మానుకోవాలని భార్య సూచించినప్పటికీ, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక అప్పన్న తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తొలుత ఉంగుటూరు మండలం చేబ్రోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ (మంగళగిరి) ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆయన మరణించాడు. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


