ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత శనివారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ముఖ మండపంలో అర్చకులు శేష వస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం సూపరింటెండెంట్ ఐవీ రామారావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్. ప్రియదర్శిని నూతక్కి తదితరులు ఉన్నారు.
కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
కార్తీక మాసం, శనివారం కావడంతో చినవెంకన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగడంతో ఆలయ ప్రాంగణం, విభాగాలన్నీ సందడిగా కనిపించాయి.
ఉంగుటూరు: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సరిపడా నాణ్యమైన గోనెసంచులు సిద్ధంగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్ తెలిపారు. శనివారం ఉంగుటూరు మండలం కై కరంలో రహదారి వెంబడి ఖాళీ ప్రదేశాల్లో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం రాశులను ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. రైతు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, రవాణా సొమ్ముల చెల్లింపుల్లోనూ సమస్యలు లేకుండా చూస్తున్నామని అభిషేక్ గౌడ్ స్పష్టం చేశారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి ప్రవీణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు.
ద్వారకాతిరుమల: వేద విద్యలో విశేష ప్రతిభ కనబరిచిన ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం వేద పండితుడు సన్నిధానం వాచస్పతి ఘనపాఠికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 24న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వేద విద్యపై నిర్వహించిన జాతీయ కార్యక్రమంలో అశోక్ సింఘల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ‘భారతాత్మ’ ఉత్తమ విద్యార్థి పురస్కారంతో పాటు బిరుదును ప్రదానం చేశారు. దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు శనివారం ఆయనను శాలువాతో సత్కరించి, వేద విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఏఈఓ పి. నటరాజారావు, సూపరింటెండెంట్ గోవాడ సుబ్రహ్మణ్యం, సూరవరపు శివరామకృష్ణ అవధాని పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. లింగపాలెం మండలం కలరాయనగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అండర్–14, అండర్–17 బాలికల విభాగాల్లో జిమ్నాస్టిక్స్, కురాష్ క్రీడాంశాలకు ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. అర్హులైన క్రీడాకారులు క్రీడా సామగ్రి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో సకాలంలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీడీలు, పీఈటీలను ఆమె ఆదేశించారు.


