చల్లని తల్లి.. కొల్లేటి పెద్దింట్లమ్మ
● నేడు కలువ బోనాల సమర్పణ
● లక్ష మంది విచ్చేస్తారని అంచనా
● ప్రధాన ఆకర్షణగా ప్రభల ఊరేగింపు
కొల్లేరు దిబ్బపై పెద్దింట్లమ్మ జాతరను తిలకించడం ఓ మధురానుభూతి. కై కలూరు నుంచి భీమవరం వెళ్ళే రహదారిలో ఆలపాడు వద్ద బస్సు దిగి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దింట్లమ్మ దేవస్థానానికి చేరుకోవచ్చు. పెద్దింట్లమ్మ విగ్రహం చెంత జలదుర్గాదేవితో గోకర్ణేశ్వరస్వామికి జరిగే కల్యాణం అనంతరం ఆ తలంబ్రాలు చల్లుకుంటే ఎంతో పుణ్యం.
– కూచిపూడి శ్రీనివాసు, ఆలయ కార్యనిర్వహణాధికారి, కొల్లేటికోట
కై కలూరు : తెలంగాణ బోనాల సంప్రదాయాన్ని ఏలూరు జిల్లా కొల్లేరు ప్రజలు కొనసాగిస్తున్నారు. ఏలూరు జిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర (తీర్థం) ఈ నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు జరుగుతోంది. జాతరలో ప్రధాన ఘట్టమైన శ్రీ జలదుర్గా గోకర్ణేశ్వరస్వామి కల్యాణం శనివారం (28వ తేదీ) రాత్రి జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి వేలాదిగా కొల్లేరులంక గ్రామాల మహిళలు కలువ బోనాలు నెత్తిన పెట్టుకుని భక్తితో అమ్మకు సమర్పిస్తారు. ప్రభుత్వం నుంచి అమ్మకు పట్టువస్త్రాలు అందిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నీటి మధ్యలో ద్వీప కల్పం
పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ తల్లి ఆలయం వేంగి రాజుల కాలంలో నిర్మించిన పురాతన దేవాలయం. కొల్లేటి గ్రామాల ప్రజలకు ఆరాధ్య దైవం. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ప్రత్యేక ఆకర్షణగా బోనాలు
భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. మొదటి ఏడాది 60 మంది బోనాలు సమర్పిస్తే, రెండో ఏడాది ఆ సంఖ్య 200కు చేరింది. ప్రస్తుతం వేల సంఖ్యలో బోనాలతో మహిళలు మొక్కులు తీర్చుకుంటున్నారు. మహిళలు మూడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలో తాటి కల్లు, పానకం, పిండి వంట, వడ పప్పు, చలివిడి నింపి చివరి కుండపై నెయ్యితో నిండిన 365 ఒత్తుల దీపాన్ని ఉంచుతారు. బోనాలకు ముందు వరుసలో 7 కావిళ్లలో పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టెలు, నిమ్మ కాయలు, పానకం, కల్లు, అమ్మవారి ప్రతిరూపాలుగా భక్తులు మోసుకెళ్తారు. కొల్లేరు సరస్సులో ఫిబ్రవరి, మార్చిలో సహజసిద్ధంగా కలువ పువ్వులు లభిస్తాయి. కొల్లేరు ప్రజలు తమ ఇలవేల్పుగా భావించే అమ్మవారికి ప్రీతిపాత్రమైన కలువ పువ్వులను బోనాలకు కట్టుకుని సమర్పిస్తారు. బోనాల కోసం ప్రత్యేక కుండలకు రంగులు అద్ది అందంగా అలంకరిస్తారు. బోనాలలో పానకం, ఇతర పదార్థాలను అమ్మకు నైవేద్యంగా పెట్టిన తర్వాత చేపలు, రొయ్యల చెరువుల్లో కలపడం ఇక్కడి సంప్రదాయం.
కొల్లేటికోట పెద్దింట్లమ్మ తల్లి
గోకర్ణేశ్వరస్వామి
చల్లని తల్లి.. కొల్లేటి పెద్దింట్లమ్మ
చల్లని తల్లి.. కొల్లేటి పెద్దింట్లమ్మ
చల్లని తల్లి.. కొల్లేటి పెద్దింట్లమ్మ
చల్లని తల్లి.. కొల్లేటి పెద్దింట్లమ్మ
చల్లని తల్లి.. కొల్లేటి పెద్దింట్లమ్మ


