గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యం
జంగారెడ్డిగూడెం : గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు లక్కవరం ఎస్సై శశాంక తెలిపారు. గురువారం మండలంలోని లక్కవరం–నాగులగూడెం గ్రామాల మధ్య కొండ దేవతల ఆలయం పాత ఇసుక ర్యాంపు సమీపంలోని ఎర్రకాలువలో లక్కవరానికి చెందిన చల్లా బసవయ్య(70) గల్లంతయ్యాడు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న బసవయ్య గురువారం పశువులు మేపేందుకు బసవయ్య కాలువ సమీపంలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, కాలువ వద్ద అతడి చెప్పులు, తువ్వాలు, కర్ర ఉన్నాయి. ప్రమాదవశాత్తూ మునిగిపోయి ఉంటారని స్థానికులు భావించారు. సమాచారం అందుకున్న లక్కవరం ఎస్సై శశాంక ఘటనాస్థలికి చేరుకుని వృద్ధుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు గాలించినప్పటికీ బసవయ్య మృతదేహం లభ్యం కాకపోవడంతో, శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా బసవయ్య మృతదేహం నీటిలో తేలుతూ ఉండడంతో గుర్తించి స్థానికుల సహకారంతో బయటికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
టి.నరసాపురం: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టి.నరసాపురం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్సై జయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. తమకు అందిన సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బందితో కలిసి మండలంలోని మల్లుకుంట సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించామన్నారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని కాకినాడ తరలిస్తుండగా గుర్తించి వాహనాన్ని అదుపులోకి తీసుకుమన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కోడి వ్యర్థాలు తరలిస్తున్న వ్యాన్ సీజ్
భీమడోలు : భీమడోలు పంచాయతీ శివారు పెదలింగంపాడు ఆక్వా చెరువులకు కోడి వ్యర్థాలు తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. పెదపాడుకు చెందిన కోరం ప్రకాష్, కూడిపూడి వాసు వ్యాన్‌లో హైదరాబాద్ నుంచి లింగంపాడులోని గంటా మోహనరావు ఆక్వా చెర్వులకు కోడి వ్యర్థాలు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై వై.సుధాకర్ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
గల్లంతైన వృద్ధుడి మృతదేహం లభ్యం


