రైటింగ్‌ టేబుల్‌

Sakshi Editorial On Writing

మగవాడు రాసేటప్పుడు తాను ఒక్కడే ఉంటాడు. స్త్రీ రాసేటప్పుడు ఆమె వెనుక ఇంకా ఆర్పాల్సిన గ్యాస్‌స్టవ్, పిల్లవాడికి పట్టాల్సిన పాలు, ఆరేయగా లోపలికి తేవాల్సిన బట్టలు, కరెంటు మనిషి మీటర్‌ కట్‌ చేసి వెళ్లకుండా కట్టాల్సిన బిల్లు, పెద్దగా కదలికలు లేని అత్తగారికి ఇవ్వాల్సిన మందులు, సంతరోజు తప్పిపోకుండా తేవాల్సిన కూరగాయలు... ఇన్ని ఉంటాయి. 

మగవాడు– రాసుకోవాలి అనంటే ఆ ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది. ఒక గది ఇవ్వబడుతుంది. ముఖ్యం అతనికి ఒక రైటింగ్‌ టేబుల్‌ ఉంటుంది. ‘కాని నాకు తెలిసి మన దేశంలో రాయాలనుకున్న స్త్రీలకు ఒకే ఒక టేబుల్‌ ఉంటుంది. అది డైనింగ్‌ టేబుల్‌. దానిని శుభ్రం చేసుకుని కూచుని రాసుకోవడమే’ అంది ప్రఖ్యాత రచయిత్రి కమలాదాస్‌. వర్జీనియా ఊల్ఫ్‌ కూడా ఇదే మాట అంది– రాయాలనుకున్న స్త్రీలు తాము ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేని ఆదాయం కలిగి ఉండాలి... వారికి సొంత గది ఉండాలి.

ఆసియాలోనే అతి పెద్దదైన ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ ఇటీవల జరిగితే అందులో వర్తమాన భారతీయ రచయిత్రులు ఎందరో పాల్గొని ‘తాము రాస్తున్నాము’ అని గొప్ప ప్రకటన చేస్తే, మగవారు పాల్గొన్న వేదికలపై రాని చర్చ ఈ రచయిత్రులు పాల్గొనే వేదికపై వచ్చింది. అది– రాయడానికి సమయం, కావలసిన మద్దతు గురించి! ‘మీరు ఎన్నయినా చెప్పండి... భారతీయ స్త్రీ రాయాలంటే భర్త సహకారం తప్పదు. మన స్త్రీలు అనేక బాధ్యతల మధ్య సమయం వెతుక్కుని రాయాలి. ఆ సమయానికి భర్త ఆటంకం కలిగిస్తే రాయడం కష్టం’ అంది అనుకృతీ ఉపాధ్యాయ్‌ అనే రచయిత్రి. ‘నేను ఒక నవల మొదలెట్టాను. లాక్‌డౌన్‌ వచ్చింది. రెండేళ్ల పాటు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నవల పని మూలపడింది. మళ్లీ స్కూళ్లు తెరిచి వాళ్లు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళితే తప్ప రాయడానికి వీలవలేదు’ అంది సిమ్రన్‌ ధిర్‌ అనే ఢిల్లీ రచయిత్రి. ‘ఈ గొడవంతా ఎందుకని నేను ఉదయం నాలుగ్గంటలకు లేచి ఆరు వరకు రాస్తాను. రోజుకు 200 పదాలు రాస్తే చాలు అనుకుంటూ నా నవల పూర్తి చేశాను’ అంది శివానీ సిబాల్‌ అనే మరో రచయిత్రి.

స్త్రీల కల్పనాశక్తి వందల ఏళ్ల పాటు మన దేశంలో మౌఖికంగా ఉండిపోయింది. వారు ఆటల్లో, పాటల్లో, పిల్లల్ని నిద్ర పుచ్చడానికి చెప్పిన కథల్లో తమ సృజనను చూపించి సంతృప్తిపడాల్సి వచ్చింది. మరో రకంగా చెప్పాలంటే మన దేశ పురాణ జ్ఞానం, జానపద సంపద వాళ్ల నాలుక చివరల నుంచే ఒక తరం నుంచి మరో తరానికి అందింది. కానీ వారు విద్యకూ, కలం పట్టి రాయడానికీ శతాబ్దాలు దూరం ఉన్నారు. రాయడం మొదలెట్టాక, ఇంతకాలం గడిచాక కూడా వారి ఎదుట ఉండాల్సిన సవాళ్లు ఉండనే ఉంటున్నాయి. ‘నేను నా మొత్తం కల్పనా సామర్థ్యాన్ని నా కుటుంబ మర్యాదకు లోబడి కుదించుకోవడానికి అవస్థలు పడ్డాను’ అంది కమలా దాస్‌. స్త్రీలు రాయవచ్చుగాని అన్నీ రాయకూడదు. కొన్ని కథాంశాలు ముట్టుకోవడం నిషిద్ధం. కొన్ని వర్ణనలు చేయడం నిషిద్ధం. కొన్ని మాటలు వాడటం నిషిద్ధం. స్త్రీలు పాపులర్‌గా రాసినా, గాఢమైన మానవ ప్రవర్తనలు రాసినా ‘ఇవన్నీ ఈమెకు ఎలా తెలుసు... ఈ కథలోని పాత్ర అనుభవం ఈమె అనుభవమే కాబోలు’ అనే భావనలో మన ఎదగని పాఠకులు, కుటుంబాలు ఉంటాయి. కనుక ఇప్పటి వరకూ మన దేశంలో రాసిన స్త్రీలు తమ పూర్తి శక్తితో రాశారని అనుకోవడానికి లేదు. ఇక మీదట రాస్తారనీ చెప్పలేము. కనపడని సెన్సార్‌షిప్‌ ప్రభావం అది.

పురుషులకు వృత్తి ఉంటుంది. రాయడం వారి ప్రవృత్తి (ఆప్టిట్యూడ్‌). అదే స్త్రీలకు అభిరుచి (హాబీ)గా చెప్పబడుతుంది. రాసే స్త్రీలను భర్తలు పరిచయం చేస్తూ ‘ఆ.. ఏవో గిలుకుతుంటుంది లేండి’ అని చిన్నబుచ్చుతారు. కార్టూనిస్టులు రచయిత్రుల తిరిగొచ్చిన రచనలు మోయలేక పారిపోయే పోస్ట్‌మేన్‌లను వేసి నవ్విస్తారు. సినిమాల్లో రచయిత్రులవి హాస్యపాత్రలు. నాణ్యత లేని రచన పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఉంటుంది. కానీ స్త్రీలు హేళనకు సాధనాలవుతారు. 1965 నుంచి మన దేశంలో జ్ఞానపీఠ​​​​్ ఇస్తుంటే ఇప్పటికి 62 మందికి ఆ పురస్కారం దక్కితే వారిలో కేవలం 9 మందే స్త్రీలు ఉన్నారు. ఎన్నో ప్రతిబంధకాలను దాటి, సవాళ్లను ఎదుర్కొని, మగ రచయితల రాజకీయాలను జయించి రాగలిగారు కాబట్టే ఈ 9 మందైనా! 

‘నేను చెన్నై కన్నెమరా లైబ్రరీలో పని చేశాను. వందల రచయిత్రుల పుస్తకాలు అక్కడ చూశాను. కానీ వారంతా ఒకటీ రెండూ పుస్తకాల వారు. అంటే 18 నుంచి 24 ఏళ్లలోపు రాసిన వారు. బహుశా పెళ్లయిన తర్వాత వాళ్లందరూ రాయడం మానేసి ఉండాలి’ అంది పరమేశ్వరి అనే తమిళ కవయిత్రి ఒక వ్యాసంలో! ఇదే సూత్రాన్ని ప్రతి భాషకూ అప్లై చేస్తే పెళ్లికి ముందు రాసి ఆ తర్వాత ఆగిపోయిన రచయిత్రుల రాయబడని కావ్యాలను హతం చేసినదే మన సమాజం.

వెలుతురు అర్థం కాకపోతే చీకటి అర్థం కాదు. స్త్రీ రాయకపోతే పురుషుడు రాసిందీ సంపూర్ణం కాదు. మానవ చిత్తవృత్తులనూ, సంక్షోభ సమయాలలో వారి దిటవునూ, సందర్భాలకు తగినట్టు మారే కపట విన్యాసాలనూ స్త్రీ గమనించినంత సూక్ష్మంగా పురుషుడు గమనించలేడు. ఈ ప్రపంచం అర్థం కావాలంటే స్త్రీ రచన విస్తృతం కావాలి. రాసే స్త్రీలున్న ఇళ్లలో వారికంటూ తప్పక ఒక రైటింగ్‌ టేబుల్‌ ఉండాలి. అది లేనంత కాలం మనం పూర్తిగా నాగరికం కానట్టే! స్త్రీలు రాయాలి. స్త్రీ రచనలు వర్ధిల్లాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top