ఈ మార్పులు మంచికేనా?

Sakshi Editorial On Radical changes made by UGC For PHD

ఎక్కడైనా, ఎప్పుడైనా.... కాలాన్ని బట్టి నియమ నిబంధనల్ని మార్చాల్సిందే. కానీ, కొత్త నియమ నిబంధనలు పురోగమింపజేస్తాయా, తిరోగమింపజేస్తాయా అన్నదే కీలకం. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు సంబంధించిన డాక్టోరల్‌ డిగ్రీల రూల్స్‌లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చేసిన సమూలమార్పులు ఇప్పుడు అదే చర్చకు దారి తీస్తున్నాయి. ఎంఫిల్‌ కోర్సుల రద్దు, పీహెచ్‌డీ రావడానికి చేయాల్సిన కోర్స్‌వర్క్‌ను సడలించడం, నాలుగేళ్ళ డిగ్రీ కోర్స్‌ చేసిన వెంటనే పీహెచ్‌డీలో పేరు నమోదుకు అనుమతించడం లాంటి మార్పులపై భిన్నాభిప్రాయాలున్నాయి. యువ విద్యార్థులను మరింతగా పరిశోధన వైపు ఆకర్షించడానికే ఈ చర్య అని యూజీసీ చెబుతోంది. కానీ ఆచరణలో ఇది ప్రమాణాల క్షీణతకూ, పర్యవేక్షకుల కొరతకూ దారితీస్తుందనే వాదన బలంగా వినపడుతోంది. 

నిజానికి యూజీసీ 2009లో, తర్వాత 2016లో కొన్ని నియమాలు పెట్టింది. వాటి స్థానంలో కొత్తవాటిని ఈ నెల 7న వెల్లడించింది. ఈ కొత్త ‘యూజీసీ (పీహెచ్‌డీ కనీస ప్రమాణాలు, విధానాల) నిబంధనలు 2022’ వల్ల పీహెచ్‌డీ చేయడానికి అర్హత నుంచి ప్రవేశ విధానం, మూల్యాంకన పద్ధతుల దాకా అన్నీ మారనున్నాయి. మునుపటి నిబంధనల కింద అనుమతి లేని వర్కింగ్‌ ప్రొఫెష నల్స్‌ పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీలకు సైతం పచ్చజెండా ఊపారు. మాస్టర్స్‌ డిగ్రీ ఒక ఏడాది (2 సెమిస్టర్లు) చదివినా, లేక నాలుగేళ్ళ (8 సెమిస్టర్ల) బ్యాచ్‌లర్‌ డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు సాధించినా పీహెచ్‌డీలో చేరవచ్చు. ఎప్పటిలానే నెట్‌/ జేఆర్‌ఎఫ్‌ అర్హతలు, ప్రవేశపరీక్షలతో ప్రవేశాలు చేసుకో వచ్చు. అయితే పీహెచ్‌డీ ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష చర్చను ప్రస్తావించకుండా వదిలేశారు. 

పీహెచ్‌డీ చేస్తున్నవారు తప్పనిసరిగా ప్రత్యేక జర్నల్స్‌లో కనీసం ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించాలనీ, సదస్సుల్లో కనీసం రెండు పత్రసమర్పణలు చేయాలనీ పాత నిబంధనలు. ఆ రెండూ ఇక తీసేశారు. ఇప్పటి దాకా పరిశోధనకు ప్రవేశద్వారంగా ఉన్న ఎంఫిల్‌ కోర్సును ‘జాతీయ విద్యావిధానం’ సిఫార్సుకు అనుగుణంగా ఎత్తేశారు. ఇవన్నీ పరిశోధనలో నాణ్యతను దెబ్బతీస్తాయనేది విద్యావేత్తల్లో ఒక వర్గం ఆందోళన. మరో వర్గం మాత్రం తప్పనిసరి తద్దినంగా మారిన పత్రాల నిబంధనల్లో పలు లోపాలున్నాయనీ, వాటితో ప్రయోజనం లేదు గనక ఎత్తేయాలన్న నిర్ణయం సరైనదేననీ అంటోంది. అసలీ పత్రాల ప్రచురణ అంశంపై యూజీసీ చాలాకాలంగా తర్జనభర్జన పడుతోంది. పరిశోధక విద్యార్థుల నుంచి రుసుము వసూలు చేసి, పత్రాలను ప్రచురించే ‘దోపిడీ జర్నల్స్‌’, గ్రంథచౌర్యం పెరగడంతో సమస్య వచ్చిపడింది. 

విశ్వవిద్యాలయ పత్రాల్లో నూటికి 75 ‘స్కోపస్‌’ గుర్తింపు పొందని జర్నల్స్‌లోనే ప్రచురిత మవుతున్నాయనేది ఒక అధ్యయనం. అందుకే, ఆ తరహా జర్నల్స్‌లో, వాటి ప్రచురణకర్తలు పెట్టే సదస్సుల్లో ఇచ్చిన పత్రాలను పరిగణనలోకి తీసుకోరాదని 2019లోనే యూజీసీ ప్యానెల్‌ సిఫార్సు చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు విస్తృత సంబంధాలు, ఆర్థిక స్థోమత ఉండవు గనక అలాంటి దోపిడీ జర్నల్స్‌కు అడ్డుకట్ట వేయాల్సిందే. రిసెర్చ్‌ స్కాలర్లపై ఒత్తిడిని తగ్గించాల్సిందే. కానీ, ప్రత్యామ్నాయం చూడకుండా, పత్రాలే అక్కర్లేదనడం వివేకవంతమేనా? మన దగ్గర ఇప్పటికీ విద్యార్థులు ఎక్కువ, నాణ్యమైన జర్నల్స్‌ తక్కువ. ఇదో పెనుసమస్య. ప్రపంచ పరిశోధకుల్లో 12 శాతం మంది మనవాళ్ళే అయినా, భారత పరిశోధనా పత్రాలు 4.52 శాతమేనట. 2020 నాటి స్కోపస్‌ శాస్త్రీయ ప్రచురణల డేటాబేస్‌ తేల్చింది. 

ఆచరణలో లోపాలున్నా, పత్రాల ప్రచురణ ఆలోచన అసలంటూ మంచిదే. ఐఐటీల్లో పత్రాల ప్రచురణ తప్పనిసరి కాకున్నా నాణ్యమైన పరిశోధన సాగుతోందంటే ఆచార్యులు, విద్యార్థుల నిబద్ధతే కారణం. అలాంటి వాతావరణం కరవైన విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడిక పత్రాలు లేకుండానే పరిశోధనాసక్తి, ప్రమాణాలు తగ్గకుండా ఎలా చూస్తారు? అలాగే, డిగ్రీ అవుతూనే పీహెచ్‌డీలో చేరిన విద్యార్థికి పరిశోధనా జ్ఞానం ఎలా ఉంటుంది? పీజీ చేసి, ఎంఫిల్‌లో మౌలిక పరిశోధనా పద్ధతులు తెలుసుకున్నాక ఆసక్తితో పీహెచ్‌డీ చేయడం వేరు. పరిశోధనలో ఓనమాలు తెలియకుండా డిగ్రీ అవుతూనే పీహెచ్‌డీలోకి దిగడం వేరు. అలా దిగినా, ఆరేళ్ళ నిర్ణీత వ్యవధిలో తొలి ఏళ్ళన్నీ పరి శోధనా పద్ధతులు తెలుసుకోవడానికే ఖర్చయిపోతుంది. అలాగే, పత్రసమర్పణ, ప్రచురణ తప్పని సరి కానప్పుడు విద్యార్థులకు లోతైన అధ్యయనానికి ప్రేరణ లేకుండా పోయే ప్రమాదమూ ఉంది.
 
పరిశోధనను సైతం మామూలు చదువులంత తేలిగ్గా తీసుకోవడం మన దగ్గరే. మొదట్లో 1920లలో మన దగ్గర కొన్ని డజన్ల మందే పీహెచ్‌డీ స్కాలర్లుండేవారు. కానీ, ఇవాళ అమెరికాలో ఏటా 64 వేలకు పైగా డాక్టరేట్లు వస్తుంటే, 24 వేల మంది పీహెచ్‌డీ స్కాలర్లతో మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. 2010తో పోలిస్తే 2017లో పీహెచ్‌డీలో చేరేవారి సంఖ్య రెట్టింపు దాటింది. 2000 నాటికి దేశంలో డాక్టరేట్‌ ప్రదానం చేసే సంస్థలు 326. తీరా, 2017 కల్లా వాటి సంఖ్య 912. అంటే పీహెచ్‌డీ ఎంత వేలంవెర్రిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా 60 లక్షల మంది గ్రాడ్యు యేట్లు, 15 లక్షల మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు వస్తున్న దేశంలో నిఖార్సయిన పరిశోధక విద్యార్థుల శాతం ప్రశ్నార్థకమే. ఇప్పటికే నాసిరకమని పేరుపడ్డ మన విశ్వవిద్యాలయ రిసెర్చ్‌ ప్రమాణాలు మరింత దిగజారడానికి కొత్త నిబంధనలు కారణం కాకూడదు. లోతుగా పునఃపరిశీలన చేసినా తప్పు లేదు. ప్రామాణిక పరిశోధనలకై ఒక అడుగు వెనక్కి వేసినా... ప్రగతికి అది ముందడుగే! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top