రాజకీయ రహదారి!  

Sakshi Editorial On Purvanchal Expressway

రహదారులు రాజకీయ రణక్షేత్రంగా మారడమంటే ఇదే! యూపీలో ప్రధాని మోదీ మంగళవారం ఆర్భాటంగా ప్రారంభించిన పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలకు దారి తీస్తోంది. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీలో రూ. 23 వేల కోట్ల పైగా వ్యయంతో నిర్మించిన 341 కి.మీల ఈ కొత్త రహదారి చర్చనీయాంశమైంది.

లక్నో నుంచి ఘాజీపూర్, అలాగే బిహార్‌లో బక్సర్‌ లాంటి చోట్లకు ప్రయాణ సమయాన్ని ఆరేడు గంటల నుంచి ఏకంగా మూడున్నర, నాలుగు గంటలకు తగ్గించే ఈ రహదారి ఘనత ఎవరిది? యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యంలోని అధికార బీజేపీ, అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), మాయావతి బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్పీ)లు దేనికవే ఈ ప్రాజెక్టు ఘనత తమదేనని చెప్పుకుంటున్నాయి. ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ విజయానికీ, ఆ ప్రాజెక్ట్‌కూ ఉన్న లంకె అలాంటిది మరి!

యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 160 స్థానాలు, అంటే దాదాపు 40 శాతం సీట్లున్నది పూర్వాంచల్‌లోనే! అక్కడి గెలుపోటములను బట్టే పార్టీల అధికార భవితవ్యం! ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు పెట్టనికోటలుగా భావించే 9 జిల్లాల మీదుగా తాజా రహదారి నిర్మాణం జరగడం గమనార్హం. కేంద్రం చేసిన కొత్త రైతు చట్టాలకు యూపీ పశ్చిమ ప్రాంత రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అందుకే, మళ్ళీ అధికారంలోకి రావడానికి తూర్పు యూపీపై బీజేపీ కన్నేసింది.

నిజానికి, ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ఆలోచన ఎస్పీది. గత ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ పార్టీ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తీరా ఎన్నికల్లో ఎస్పీ ఓటమి పాలై, బీజేపీ వచ్చాక అనేక మార్పులు, చేర్పులతో, మూడేళ్ళ పైచిలుకు రికార్డు కాలంలో యోగి దీన్ని నిర్మించారు. అసలీ రోడ్డు ఆలోచన, ఆరంభం తమ ఘనతేనని అఖిలేశ్‌ ఇప్పుడు గోల చేస్తున్నది అందుకే. బీఎస్పీ సైతం ఈ రోడ్డు రేసులో తానూ ఉన్నానంటోంది. ‘పశ్చిమ యూపీలోని నోయిడాను తూర్పు యూపీలోని జిల్లాలతో అనుసంధానించే రహదారి ప్రణాళిక మేము అధికారంలో ఉండగా సిద్ధం చేసినదే. అప్పట్లో కేంద్రంలోని కాంగ్రెస్‌ అడ్డుపడడంతో మొదలెట్టలేకపోయాం’ అన్నది మాయావతి వాదన.

గతంలో బీఎస్పీ సర్కారు కాలంలో నోయిడా – ఆగ్రా (యమునా) ఎక్స్‌ప్రెస్‌ వే వస్తే, ఎస్పీ పాలనలో ఆగ్రా – లక్నో ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణమైంది. ఇప్పుడు ముచ్చటగా మూడోదైన పూర్వాంచల్‌ రహదారి బీజేపీ ఏలుబడిలో వచ్చింది. ఈ మూడూ యుద్ధ విమానాలు దిగడానికి వీలైనవే. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు కట్టిన హైస్పీడ్‌ రోడ్లే అయినప్పటికీ, చుట్టుపక్కల కొత్త పట్నాలు, వసతులు వస్తే వీటి వల్ల యూపీ ఆర్థిక ముఖచిత్రమే మారనుంది. గత రెండు రహదార్లూ వాటిని నిర్మించిన పార్టీలకు రాజకీయంగా ఆట్టే కలసి రాలేదు. కానీ, తాజా రహదారి తమకు కలిసొస్తుందని బీజేపీ భావన. ‘ఎక్కడ గతుకులు, గుంతలు మొదలవుతాయో, అక్కడ నుంచి ఉత్తర ప్రదేశ్‌ పరిధిలోకి అడుగుపెట్టినట్టు’ అని జనవ్యవహారం! అలాంటి చోట భవిష్యత్తులో 8 లేన్లకు సైతం విస్తరించే వీలుగా, 9 జిల్లాల మీదుగా, ఆరు లేన్ల భారీ రహదారి నిర్మాణం బీజేపీ సర్కారు విజయమే. 

దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన తూర్పు యూపీ (పూర్వాంచల్‌)లో పురోభివృద్ధికీ, పెట్టుబడులు – పారిశ్రామికీకరణ – ఉపాధి కల్పనతో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరగడానికీ ఈ భారీ రహదారి తోడ్పడుతుంది. అనుబంధంగా వేసిన లింకు రోడ్లతో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటకమూ పెరుగుతుందని లెక్క. ఇక, ఎక్స్‌ప్రెస్‌ వేలో భాగంగా సుల్తాన్‌పూర్‌ వద్ద 3.5 కి.మీ మేర నిర్మించిన ఎయిర్‌ స్ట్రిప్‌ అత్యవసర వేళ భారత యుద్ధ విమానాల రాకపోకలకు అనువైనది కావడం విశేషం. ఈ మధ్యే కుశీనగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇప్పుడీ ఎక్స్‌ప్రెస్‌ వేల ప్రారంభం, గోరఖ్‌పూర్‌లో ‘ఎయిమ్స్‌’ – ఇలా వికాస మంత్రంతో ఓటర్ల ఆకర్షణ బీజేపీ వ్యూహం.  

కానీ, ‘మైనారిటీలకు బీజేపీ వ్యతిరేక’మని ఎస్పీ ఆరోపిస్తోంది. ‘ఎస్పీ ఫక్తు జిన్నావాదీ పార్టీ’ అని బీజేపీ వాదిస్తోంది. ఒకవైపున ప్రియాంక సారథ్యంలో కాంగ్రెస్‌ ‘మహిళలకు 40 శాతం ఎమ్మెల్యే సీట్లు’ సహా అనేక ప్రకటనలతో ప్రచారం చేస్తోంది. మరోవైపున బీఎస్పీ బ్రాహ్మణవర్గాన్ని తమ వైపు తిప్పుకోవడానికి సకల ప్రయత్నాలూ చేస్తోంది. పూటకో సభ, రోజుకో ప్రదర్శన, ప్రకటనలతో అన్ని పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మాటల యుద్ధమూ మొదలైపోయింది. 

పూర్వాంచల్‌ రహదారి ప్రారంభోత్సవ వేళ సాక్షాత్తూ ప్రధాని మోదీ మాటలే అందుకు నిదర్శనం. మాఫియాల చేతి నుంచి అభివృద్ధి పథానికి యూపీ ఇప్పుడు చేరుకుందంటూ రహదారి ప్రారంభాన్ని రాజకీయ వేదికగా ఆయన మలుచుకున్నారు. అఖిలేశ్‌ సైతం తక్కువ తినలేదు. యోగి లాంటి ‘చిల్లమ్‌ జీవి’ (చిలుము పీల్చి, మత్తులో జోగేవారు) వల్ల యూపీకి మేలు జరగదని వివాదం రేపారు. ఇంకోపక్క, ప్రియాంకనూ, రాహుల్‌నీ పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘ఘర్‌ పే లడ్‌కా హై. మగర్‌ లడ్‌ నహీ సక్తా’ (ఇంట్లో మగపిల్లాడున్నాడు. కానీ, పోరాడలేడు) అని బీజేపీ నేత స్మృతీ ఇరానీ వ్యంగ్యం పోయారు.

సాటి మహిళపై లింగ దుర్విచక్షణతో వ్యాఖ్యలెలా చేస్తారని ప్రియాంక మండిపడుతున్నారు. వెరసి, యూపీలో వాతావరణం వేడెక్కుతోంది. ఇదిలా ఉండగా పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, గంగ– ఇలా అనేక భారీ రహదార్లతో యూపీ ఇప్పుడు ‘ఎక్స్‌ప్రెస్‌ వే రాష్ట్రం’ అని కొందరి మాట. మెజారిటీని సంఘటితం చేసే వ్యూహాలకు ఈ వికాస మంత్రమూ కలిసొస్తుందని యోగి నమ్మకం. మళ్ళీ అధికార పీఠం చేరడానికి ఈ రాజకీయ రహదారులు రాచబాటలవుతాయా?

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top