ఆరి... ‘భగవంతు’డా!

Sakshi Editorial: Punjab will be Daunting Challenge for Bhagwant Mann

విప్లవ వీరుడు భగత్‌ సింగ్‌ గ్రామం ఖత్కర్‌ కలన్‌లో బుధవారం భారీ జనసందోహం మధ్య సాగిన పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారోత్సవం మారనున్న ఆ రాష్ట్ర ముఖచిత్రానికి సంకేతమా? అవును అంటున్నారు... భగత్‌ సింగ్‌ ఫక్కీలోనే పసుపుపచ్చ తలపాగా ధరించి, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాదంతో ప్రసంగాన్ని ముగించిన ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ (ఆప్‌) కొత్త సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌. భగత్‌ సింగ్, బాబాసాహెబ్‌ అంబేడ్కర్ల స్వప్నసాకారం కోసం తనతో పాటు యావత్‌ 3 కోట్ల పంజాబ్‌ ప్రజలూ పదవీ ప్రమాణ స్వీకారం చేసినట్టే అన్నది మాన్‌ మాట. తాజా ఎన్నికలలో పంజాబ్‌లోని 117 సీట్లకు గాను 92 సీట్లు గెలిచి, అఖండ విజయం సాధించిన తమ పార్టీ అవినీతిని సమూలంగా నిర్మూలిస్తుందని ఆయన వాగ్దానం. అయితే, అవినీతి, డ్రగ్స్‌ మత్తులో మునిగిన ‘ఉఢ్తా పంజాబ్‌’గా దుష్కీర్తి సంపాదించుకొని, ఆర్థిక వనరుల కోసం అల్లాడుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ‘బఢ్తా పంజాబ్‌’గా మార్చడం భగవంత్‌ సింగ్‌ చెప్పినంత సులభమా?
 
గమనిస్తే, ‘ఆప్‌’ సాధించిన అపూర్వ ఎన్నికల విజయం సైతం అంత సులభమైనదేమీ కాదు. ముగ్గురు మాజీ సీఎంలతో సహా కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ)లకు చెందిన కొమ్ములు తిరిగిన నేతల్ని ‘ఆప్‌’లోని కొత్త తరం ఓడించిన తీరు ఓ నవ చరిత్ర. ఈ సరిహద్దు రాష్ట్రంలో ప్రధానంగా త్రిముఖంగా సాగిన పోటీలో కాంగ్రెస్‌ 23 శాతం, ఎస్‌ఏడీ 20.2 శాతం ఓట్లు సాధిస్తే, ఏకంగా 42 శాతం ఓట్లు ‘ఆప్‌’ సొంతమయ్యాయి. అయిదేళ్ళ క్రితం 2017లో కేవలం 23.7 శాతం ఓట్లతో, పట్టుమని 20 సీట్లే గెలిచి, ప్రధానంగా దక్షిణ మాల్వా ప్రాంతానికే పరిమితమైన ఓ పార్టీకి ఇది ఘన విజయమే. ఈసారి మాల్వా, దోవబ్, మాఝా ప్రాంతాలు మూడింటిలోనూ గణనీయమైన ఓటు షేర్‌తో రాష్ట్రం మొత్తాన్నీ తన ఎన్నికల చిహ్నం చీపురుతో ఊడ్చేసింది. 

కేంద్ర ప్రభుత్వ కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటంతో బీజేపీ–ఎస్‌ఏడీ పొత్తు విడిపోవడంతో, ఏడాది క్రితం పంజాబ్‌లో అధికార కాంగ్రెసే మరోసారి గెలుపు గుర్రం. కానీ, 2017లో గెలిచినప్పుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను మార్చడం మీద శ్రద్ధ పెట్టింది. క్షణానికోలా మాట్లాడుతూ, ఏ పార్టీలో ఎంతకాలం ఉంటారో తెలియని మాజీ క్రికెటర్‌ సిద్ధూను నమ్ముకొని నట్టేట మునిగింది. రాష్ట్రానికి తొలిసారి దళిత సీఎం అంటూ ఆఖరు నిమిషంలో చన్నీతో చేసిన ప్రయోగం ఫలితమివ్వకపోగా, పార్టీలోని అధికార ఆశావహులతో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అటు కేంద్ర, ఇటు రాష్ట్ర అధికార పక్షాలతో విసిగిపోయి, అంతకు మునుపు ఎస్‌ఏడీ అవినీతి పాలన అనుభవం మర్చిపోని ఓటర్లు ఏకైక ప్రత్యామ్నాయం ‘ఆప్‌’కు బ్రహ్మరథం పట్టడం అర్థం చేసుకోదగినదే! 

పంజాబ్‌ ఎన్నికలలో సాధించిన ఘన విజయం స్ఫూర్తితో మరిన్ని రాష్ట్రాలకు రెక్కలు చాచాలని కూడా ‘ఆప్‌’ ఉత్సాహపడుతోంది. హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ లాంటి ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలకు సైతం పార్టీని విస్తరింపజేయాలన్న ఆకాంక్షను ‘ఆప్‌’ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే బయటపెట్టారు. నిజానికి, ఇటీవలి ఎన్నికలలో గోవా లాంటి చోట్ల ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ, 2023లో జరిగే రాజస్థాన్‌ ఎన్నికలలోనూ పంజాబ్‌ తరహా మేజిక్‌ చేయాలని భావిస్తోంది. నాలుగేళ్ళ క్రితం 2018 రాజస్థాన్‌ ఎన్నికల్లోనూ 200 స్థానాలకు 140కి పైగా సీట్లకు ‘ఆప్‌’ పోటీ చేసింది. అప్పట్లో ఒక్క సీటైనా గెలవని ఆ పార్టీ ఇప్పుడు పంజాబ్‌ ఇచ్చిన జోష్‌తో మళ్ళీ బరిలోకి దూకాలని చూస్తోంది. విద్యుచ్ఛక్తి సమస్యలు, భారీ విద్యుత్‌ రేట్లతో సతమతమవుతున్న రాజస్థాన్‌ ప్రజలకు ఢిల్లీ, పంజాబ్‌లలో లాగా పరిష్కారం చూపుతామన్నది ‘ఆప్‌’ చెబుతున్న మాట. 

హామీలివ్వడం తేలికే... నిలబెట్టుకోవడమే కష్టం. ‘ఆప్‌’ ముందున్న సవాల్‌ అదే. నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, తక్కువ ఖర్చుకే వైద్యసేవల ‘మొహల్లా’ క్లినిక్‌లు, ఉచిత విద్యుత్‌ లాంటి ‘ఢిల్లీ నమూనా’తోనే దేశరాజధానిలో ఆ పార్టీ రెండోసారి గద్దెనెక్కింది. పంజాబ్‌లోనూ అదే బాటలో ఢిల్లీ పౌరుల కన్నా 100 యూనిట్లు ఎక్కువగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, పాఠశాలల ఉన్నతీకరణ, 16 వేల క్లినిక్‌లు, ఉచిత ఔషధాలు – శస్త్రచికిత్సల ఆరోగ్య హామీ పథకం వగైరా ‘ఆప్‌’ ప్రకటించింది. విస్తీర్ణంలో ఢిల్లీ (1484 చ.కి.మీ) కన్నా పంజాబ్‌ (50,362 చ.కి.మీ) చాలా పెద్దది. జనాభా సైతం ఢిల్లీ కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ. మిగులు ఆదాయ బడ్జెట్‌తో నడిచే ఢిల్లీతో పోలిస్తే పంజాబ్‌ ఖజానాలో నిత్యం కటకట. తాజా మాజీ కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్ర ఋణభారం రూ. 2.6 లక్షల కోట్లకు పెరిగింది. ఇది కాక కరోనా ఆపత్కాల ఖర్చులు, ప్రజాకర్షక పథకాల పుణ్యమా అని రాష్ట్ర అప్పులు, స్థూల రాష్ట్ర ఉత్పత్తి(జీఎస్డీపీ) నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరం 50శాతం దాటుతుందని అంచనా. అంటే హామీలు తీర్చే ఆర్థిక వనరులకై భగవంత్‌ సారథ్యంలో ‘ఆప్‌’ అల్లాడి ఆకులు మేయక తప్పదు.

డ్రగ్స్‌ అక్రమరవాణా, శాంతిభద్రతల సమస్యలు ఈ సరిహద్దు రాష్ట్రాన్ని ఎప్పటి నుంచో పీడిస్తున్నాయి. వాటిని అరికట్టాలంటే పోలీసు యంత్రాంగ విస్తరణ, నూతన శిక్షణ తప్పవు. ఢిల్లీలో లాగా పోలీసు శాఖ కేంద్ర అధీనంలో ఉందనీ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్డుకుంటున్నారనీ పంజాబ్‌లో చెప్పడానికి వీలుండదు. అలా ఇప్పుడు ‘ఆప్‌’కూ, అధినేత కేజ్రీవాల్‌కూ, రాజకీయాల్లోకి వచ్చిన 12 ఏళ్ళకే సీఎం స్థాయికి ఎదిగిన హాస్యనటుడైన 48 ఏళ్ళ భగవంత్‌ సింగ్‌ మాన్‌కూ అందరికీ ఇది అగ్నిపరీక్షే. ఢిల్లీలో లాగానే పంజాబ్‌లోనూ హామీలు నెరవేర్చి, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తారా? 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top