లోతైన దర్యాప్తు అవసరం | Sakshi Editorial On NEET, National Testing Agency, UGC NET | Sakshi
Sakshi News home page

లోతైన దర్యాప్తు అవసరం

Published Tue, Jun 25 2024 1:20 AM | Last Updated on Tue, Jun 25 2024 1:20 AM

Sakshi Editorial On NEET, National Testing Agency, UGC NET

తవ్వుతున్నకొద్దీ  బయటపడుతున్న జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వాకాలు చూస్తుంటే దాని వాలకం ‘అయ్యవారిని చేయబోతే కోతి అయింద’న్న చందంగా మారిందని అందరికీ అర్థమైంది. జేఈఈ మెయిన్‌ మొదలుకొని నీట్, యూజీసీ నెట్‌ సహా తొమ్మిది ప్రవేశ పరీక్షలవరకూ నిర్వహిస్తున్న ఈ సంస్థ విడుదల చేసే ప్రశ్నపత్రాలు, వాటి జవాబులు గుజరాత్, హరియాణా, బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర వంటిచోట్ల ‘కావలసినవారికి’ బజారులో దొరికాయని సీబీఐ రంగ ప్రవేశం చేశాక తేటతెల్లమైంది. 

బిహార్‌ పోలీసులు అరెస్టు చేసిన 20 మంది నిందితులను విచారిస్తే మే 5న నిర్వహించిన నీట్‌–యూజీ ప్రశ్నపత్రం ఒకరోజు ముందే పీడీఎఫ్‌ రూపంలో వారికి వచ్చిందని తేలింది. ఎందుకో ఈ ప్రశ్నపత్రాల మాఫియా దక్షిణాది రాష్ట్రాలవైపు దృష్టి సారించినట్టు లేదు. గత పదిరోజుల వ్యవధిలో ఎన్‌టీఏ నిర్వహించాల్సిన నాలుగు పరీక్షలు రద్దుకావటం అసాధారణం. రెండు లక్షలమంది విద్యార్థులు రాయాల్సిన ఆదివారంనాటి నీట్‌ పీజీ పరీక్షను కేవలం 12 గంటల ముందు రద్దుచేశారు. 

ఎన్‌టీఏ చీఫ్‌ సుబోద్‌ కుమార్‌ సింగ్‌ దీనంతటికీ బాధ్యుడని తేలుస్తూ ఆయన్ను తొలగించారు. అంతేనా... దీంతో పాపప్రక్షాళన పూర్తయినట్టేనా? ‘ఒకే దేశం–ఒకే పరీక్ష’ పేరిట ఏమాత్రం పారదర్శకతలేని ఈ వ్యవస్థను సృష్టించిన పాలకుల మాటేమిటి? గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బెంగాల్, పంజాబ్, హరియాణాల్లో భిన్న సంస్థలు నిర్వహించిన 70కి పైగా పరీక్ష పత్రాలు లీకయ్యాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. 

నిరుడు తెలంగాణలో పరీక్షపత్రాలు లీకవటంతో నిరుద్యోగులు భగ్గుమన్నారు. నిజాయితీగా అహోరాత్రాలూ చదివిన కోటిన్నరమంది విద్యార్థుల భవితవ్యం ఈ లీకుల పర్యవసానంగా దెబ్బతిన్నదని అంటున్నాయి. ఈ లీకుల బెడద లేకుండా అన్ని సంస్థలనూ తలదన్నేలా నెలకొల్పామని చెప్పిన ఎన్‌టీఏ తీరు సైతం సక్రమంగా లేదంటే ఇక ఏమనాలి?

నిజమే... వైద్య విద్యలో దేశమంతా వర్తించే ఒకే పరీక్ష నిర్వహిస్తే వేలకు వేలు ఖర్చుపెట్టడం, వేర్వేరు పరీక్షలకు సంసిద్ధం కావటంవంటి విద్యార్థుల వెతలు తీరుతాయని సర్వోన్నత న్యాయస్థానం 2011లో భావించింది. లీకులను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందనుకున్నది. కానీ ఆచరణలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. 

వైద్య విద్యకు ఒకే ప్రవేశ పరీక్ష ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పటి భారత వైద్య మండలి(ఎంసీఐ)కి  చేసిన సూచన కాస్తా అనేక మలుపులు తిరిగి చివరకు ఇలాంటి ఉమ్మడి పరీక్ష నిర్వహణ రాజ్యాంగ విరుద్ధమని 2013లో సుప్రీంకోర్టే 2–1 మెజారిటీ తీర్పునిచ్చింది. కానీ తీర్పు ఇచ్చే ముందు ముగ్గురు న్యాయమూర్తుల మధ్యా ఎలాంటి చర్చా జరగలేదన్న కారణంతో 2016లో అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మళ్లీ విచారించి నీట్‌ను అనుమతించింది. 

దేశంలో ఫెడరల్‌ వ్యవస్థ ఉన్నదని, ఉమ్మడి జాబితాలోని విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చేముందు రాష్ట్రాలతో, విద్యారంగ నిపుణులతో, ఇతర వర్గాలతో చర్చించాలని ఎవరూ అనుకోలేదు. ఒకపక్క హిందీ భాషాప్రాంత విద్యార్థులకు వారి భాషలో ప్రశ్నపత్రం ఇవ్వాలని నిర్ణయించిన ఎంసీఐ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు స్థానిక భాషల్లో ఇవ్వటం కుదరదని మొరాయించింది. 

ఆ తర్వాత 2017లో ఎన్‌టీఏ ఆవిర్భవించాక 13 భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తోంది. లీకులకు ఆస్కారంలేదని పెట్టిన వ్యవస్థ అందుకు తగ్గట్టుగా ఉందా అనేది ఉన్నతస్థాయిలో గమనించేవారే లేకపోయారు. కేంద్ర సిలబస్‌లు, ముఖ్యంగా సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా నిర్వహించే ఈ పరీక్షల్లో రాష్ట్ర సిలబస్‌తో చదివినవారు రాణించగలరా అన్న సందేహమూ రాలేదు. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో దశాబ్దాలుగా వర్ధిల్లుతున్న విద్యా మాఫియా జాతీయ స్థాయికి విస్తరించింది. 

తమిళనాడు ప్రభుత్వం నియమించిన 2021లో నియమించిన జస్టిస్‌ రాజన్‌ కమిటీ అధ్యయనం ప్రకారం నీట్‌కు ముందు ఇంగ్లిష్‌ మాధ్యమంలో చదివిన విద్యార్థులు ఎంబీబీఎస్‌ కోర్సులకు 80.2 శాతం నుంచి 85.12 శాతంవరకూ ఎంపికయ్యేవారు. తమిళ మాధ్యమంలో చదివిన వారి శాతం 14.88 శాతం ఉండేది. కానీ నీట్‌ మొదలైనాక ఇంగ్లిష్‌ మాధ్యమం విద్యార్థులు 97 శాతంవరకూ సీట్లు తెచ్చుకుంటుండగా, తమిళ మాధ్యమం విద్యార్థుల వాటా దాదాపు 3 శాతానికి పడిపోయింది. 

నీట్‌ సాధించేవారిలో అధికాదాయ కుటుంబాల పిల్లల సంఖ్య అంతక్రితంకన్నా పెరగ్గా, నిరుపేద వర్గాల పిల్లల సంఖ్య తగ్గిందని ఆ నివేదిక వివరించింది. నీట్‌వల్ల ప్రతిభావంతులకు సీట్లు వస్తున్నాయన్న వాదనను ఆ కమిటీ ఎండగట్టింది. నీట్‌కు ముందు హెచ్‌ఎస్‌సీ విద్యార్థుల సగటు స్కోరు 98.1 శాతం వుండగా, ఇప్పుడది 89.05 శాతం మాత్రమే.

ఈసారి వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒకపక్క, ఎన్‌టీఏ ప్రశ్నపత్రాల లీకు మరోపక్క మన వ్యవస్థలకున్న విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇందులో మొదటిది దేశ ప్రజానీకం ఆకాంక్షల్నీ, రెండోది లక్షలాదిమంది విద్యార్థుల ఆశలనూ తలకిందులు చేసింది. 

ఇందువల్ల ప్రపంచంలో మనం నగుబాటుపాలయ్యామని ఇప్పటికీ ఎన్‌డీఏ సర్కారు గ్రహించకపోవటం, దొంగను తేలుకుట్టినట్టు వ్యవహరించటం ఆశ్చర్యకరం. ఈ ప్రపంచంలో విద్యాధనాన్ని మాత్రమే ఎవరూ కొల్లగొట్టలేరని చిన్నప్పుడు అందరం చదువుకున్నాం. కళ్లు మూసుకున్న పాలకుల నిర్వాకం కారణంగా దాన్ని సైతం ఎగరేసుకుపోవచ్చని ప్రశ్నపత్రాల మాఫియా నిరూపించింది. 

అందుకే ఎన్‌టీఏ చీఫ్‌ను సాగనంపితే సరిపోదు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించి, ఇలాంటి లీకులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement